Begin typing your search above and press return to search.

50 వేల ఉద్యోగాల ప్ర‌క‌ట‌న‌.. ఆశ‌లు తీరేనా?

By:  Tupaki Desk   |   9 July 2021 5:30 PM GMT
50 వేల ఉద్యోగాల ప్ర‌క‌ట‌న‌.. ఆశ‌లు తీరేనా?
X
తెలంగాణ ఉద్య‌మ మూల‌స్థంభాల్లో ఉద్యోగాల క‌ల్ప‌న ఒక‌టి. 'నీళ్లు, నిధులు నియామకాలు' అనే పునాదుల మీద‌నే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొనసాగింది. చివరకు విజయం సాధించింది కూడా. అయితే.. రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ల‌లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? అవి నిరుద్యోగుల ఆకాంక్ష‌ల‌ను ప్ర‌తిబింబించాయా? అంటే.. అవును అని స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఉన్న ప్ర‌ధాన విమ‌ర్శ‌ల్లో ఇది ప్ర‌ధాన‌మైన‌ది.

ఈ విషయంలో రాజ‌కీయంగా ఎవ‌రి లెక్క‌లు వారు చెప్పొచ్చు. కానీ.. నిరుద్యోగులు ఆశించిన రోజులు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కైతే రాలేద‌నే చెబుతారు మెజారిటీ తెలంగాణ ప్రజలు. రాష్ట్ర ఉద్య‌మం సంద‌ర్భంగా.. ఎంతో మంది టీఆర్ఎస్ నేత‌లు ఉద్యోగాల గురించి చెప్పారు. విభ‌జ‌న జ‌రిగితే ఏకంగా 2 ల‌క్ష‌ల ఖాళీలు ఏర్ప‌డ‌తాయ‌ని, ఇవ‌న్నీ తెలంగాణ నిరుద్యోగుల‌కే ద‌క్కుతాయ‌ని కూడా ఊరించారు. కానీ.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఉసూరుమ‌నిపించార‌నే అప‌వాదును మూట‌గ‌ట్టుకున్నారు. రెండో ద‌ఫా అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా నిరుద్యోగుల‌కు స‌రైన న్యాయం చేయ‌లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ఇటీవ‌ల జ‌రిగిన ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారం మంత్రి కేటీఆర్ ఓ జాబితా రిలీజ్ చేశారు. రాష్ట్రం ఇప్ప‌టి వ‌ర‌కూ లక్షా ముఫ్పై వేల ఉద్యోగాలకుపైగా భర్తీ చేశామని ప్రకటించారు. ఈ మేర‌కు బ‌హిరంగ లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరేళ్లలో 1,32,899 ఉద్యోగాల‌ను వివిధ‌ శాఖల్లో భర్తీ చేసినట్టు ప్ర‌క‌టించారు. ఆ పోస్టుల వివరాలను కూడా తన లేఖలో ఉంచారు కేటీఆర్. దీనిపై విప‌క్షాలు ఆగ్ర‌హం వ్య‌క్తంచేశాయి. కేటీఆర్ చెబుతున్న లెక్క‌ల‌న్నీ అవాస్త‌వాల‌ని కొట్టిపారేశాయి. ఈ విషయంలో చ‌ర్చించేందుకు సిద్ధ‌మ‌ని, కేటీఆర్ ఎక్క‌డికి పిలిస్తే అక్క‌డి వ‌స్తామ‌ని స‌వాల్ విసిరారు. కానీ.. అవ‌న్నీ రాజ‌కీయ అవ‌స‌రాల‌కోసం చేసిన గాలి మాట‌లేన‌ని తేలిపోయింది.

అయితే.. ఉద్యోగాలు మాత్రం త‌గిన‌న్ని రాలేద‌ని నిరుద్యోగులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న‌మాట మాత్రం వాస్త‌వం. తెలంగాణ స‌ర్కారు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇవ్వ‌ట్లేద‌ని, అందుకు నిర‌స‌న‌గానే తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాన‌ని మార్చి 26న‌ సెల్ఫీ వీడియోలో చెప్పి, పురుగుల మందు తాగాడు కాక‌తీయ యూనివ‌ర్సిటీ విద్యార్థి సునీల్. అత‌న్ని తొలుత వ‌రంగ‌ల్ ఎంజీఎంకు, ఆ త‌ర్వాత హైద‌రాబాద్ నిమ్స్ కు త‌ర‌లించినా.. ప్రాణాలు ద‌క్క‌లేదు.

మ‌హబూబాబాద్ జిల్లా గూడురు మండ‌లం తేజావ‌త్ రామ్ సింగ్ తండాకు చెందిన సునీల్‌.. ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నించాడు. 2016లో ఎస్ఐ ప‌రీక్ష‌లో క్వాలిఫై కూడా అయ్యాడు. కానీ.. ఫిజిక‌ల్ టెస్టులో ఎత్తు త‌క్కువ‌గా ఉన్న కార‌ణంగా ఉద్యోగం కోల్పోయాడు. అయిన‌ప్ప‌టికీ ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాడు. అయితే.. రాష్ట్ర ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్లు వేయ‌ట్లేద‌ని తీవ్ర ఆవేద‌నకు గుర‌య్యాడు. ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న‌గానే తాను చ‌నిపోతున్నాన‌ని చెప్పి, పురుగుల మందు తాగాడు.

తాజాగా.. మ‌రో నిరుద్యోగి కూడా ఇదే విధంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. వ‌న‌ప‌ర్తి జిల్లా పేట మండ‌లం తాడిప‌ర్తి గ్రామానికి చెందిన కొండ‌ల్ గురువారం (జూన్ 8) ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ''అమ్మానాన్న.. మీరు నన్ను అపురూపంగా చూసుకున్నారు. నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని ఎంతో బాగా చూసుకుందామ‌ని అనుకున్నాను. కానీ.. ఉద్యోగం సాధించ‌లేక‌పోయాను. నిరుద్యోగిగా సమాజంలో బతకలేకపోతున్నా. గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ నోటిఫికేషన్ వస్తుందేమోనని ఎదురు చూసినా.. ఇంత వరకూ రాలేదు. మానసికంగా దెబ్బతిన్నాను'' అంటూ సూసైడ్ నోట్ రాసి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. కొండల్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న మ‌ర్నాడే నోటిఫికేష‌న్ రావ‌డం కాక‌తాళీయ‌మే కావొచ్చేమోగానీ.. ఈ 50 వేల ఉద్యోగాల‌కు సంబంధించిన‌ నోటిఫికేష‌న్ నిరుద్యోగుల ఆశ‌ల‌ను ఎంత మేర తీరుస్తుంద‌న్న‌దే ప్ర‌శ్న.