Begin typing your search above and press return to search.

బయటకొచ్చిన బైడెన్ దంపతుల వార్షిక ఆదాయం

By:  Tupaki Desk   |   19 May 2021 10:00 AM IST
బయటకొచ్చిన బైడెన్ దంపతుల వార్షిక ఆదాయం
X
చట్టాలు ఉండటం వేరు. అవి పక్కాగా అమలు కావటం వేరు. మన దేశంలో నిబంధనల అమలు ఎలా అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అన్నింటికి మించి ప్రజాప్రతినిధులు తమ ఆస్తుల గురించి... ఆదాయాల గురించి వెల్లడించే వాస్తవాలు చాలా కామెడీగా ఉంటాయి. వారికున్న ఆస్తిపాస్తుల లెక్కలు వారి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోని అందరికి తెలిసినా.. వారు చూపించే లెక్కలు మాత్రం భిన్నంగా ఉంటాయి. అదేమంటే.. సాంకేతిక అంశాల్ని చూపిస్తూ తాము ఎంత నిజాయితీగా ఉన్నామన్న విషయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంటారు.

అమెరికాలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంటుంది. ఏ చిన్న తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది. అందుకే.. తమ ఆస్తులకు సంబంధించిన విషయాల్లోనూ.. ఆదాయానికి సంబంధించిన విషయాల్లో లెక్క పక్కాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు 2020 ఏడాదికి సంబంధించిన ఆదాయ పన్ను చెల్లింపు వివరాల్ని వెల్లడించారు. దీని ప్రకారం 2020లో బైడెన్ దంపతుల స్థూల ఆదాయం రూ.4.43 కోట్లుగా వైట్ హౌస్ పేర్కొంది. అంతకు ముందు ఏడాది అంటే 2019లో ఈ దంపతుల స్థూల ఆదాయం రూ.7.19 కోట్లుకావటం గమనార్హం. మరి.. ఏడాదిలో ఎందుకంత తక్కువ ఆదాయం వచ్చిందన్నది ప్రశ్న.

అక్కడున్నచట్టాల ప్రకారం తాము సంపాదించిన ఆదాయానికి రూ.1.14 కోట్ల మొత్తాన్ని ఆదాయ పన్నుగా చెల్లించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అధ్యక్ష స్థానంలో ఉన్న బైడెన్ దంపతుల వార్షిక ఆదాయంతో పోలిస్తే.. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఉన్న మనమ్మాయి కమలా దంపతుల స్థూల ఆదాయం రూ.12.38 కోట్లు కావటం గమనార్హం. ఈ మొత్తానికి వారు రూ.4.54 కోట్ల మొత్తాన్ని ఆదాయపన్నుగా చెల్లించారు. అధ్యక్షుల వారిఆదాయం కంటే ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా దంపతుల వార్షిక ఆదాయం ఎక్కువగా ఉండటం విశేషం.