Begin typing your search above and press return to search.

ఆ సాధ్వీ ఇప్పుడ‌లా ఉన్నార‌ట‌

By:  Tupaki Desk   |   30 Aug 2017 10:48 AM GMT
ఆ సాధ్వీ ఇప్పుడ‌లా ఉన్నార‌ట‌
X
అంతులేని సంప‌ద‌.. అంత‌కు మించిన అధికారం.. వీట‌న్నింటికి మించి తానేం చెప్పినా గుడ్డిగా న‌మ్మేసే ల‌క్ష‌లాది భ‌క్త‌జ‌నం. ఇదంతా దుర్మార్గ డేరా బాబాకున్న బ్యాక్ గ్రౌండ్‌. ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. బాబా చేతిలో దారుణమైన అన్యాయానికి గురై.. భ‌గ‌భ‌గ మండే గుండె మంట‌తో త‌న‌కు జ‌రిగిన అన్యాయానికి చ‌ట్ట‌ప‌రమైన చ‌ర్య‌ల కోసం ఒక ఆడ‌పిల్ల పోరాడ‌టం అంటే మాట‌లా? రాజ‌కీయ నేత‌లు మొద‌లుకొని.. పోలీసు అధికారులు.. తెలిసిన వారు.. ఇలా అంతా ఆమెకు జ‌రిగిన అన్యాయాన్ని మ‌ర్చిపోవాల‌ని చెప్పినోళ్లే కానీ.. ఆమె త‌ర‌ఫు నిల‌బ‌డ‌తామ‌ని.. అండ‌గా నిలుస్తామ‌ని.. బాబు దుర్మార్గం అంతు చూస్తామ‌న్నోళ్లు లేరు. అయినప్ప‌టికీ వెన‌క్కి త‌గ్గ‌కుండా ద‌శాబ్దాల త‌ర‌బ‌డి న్యాయ‌పోరాటం చేసిన ఆమె ఇప్పుడు ఎక్క‌డ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇప్పుడామె స్పంద‌న ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌లు.

డేరా బాబా గుర్మీత్ చేతిలో అత్యాచారానికి గురై సాధ్వీ.. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై అలుపెర‌గ‌కుండా చేసిన న్యాయ‌పోరాటానికి సాక్ష్యంగా డేరా బాబా ఇప్పుడు రోహ్ త‌క్ జైల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. డేరా బాబా త‌లుచుకుంటే ఎంత దారుణానికైనా తెగ‌బ‌డ‌తాడ‌న్న దానికి.. సిర్సాలో అత‌డి మార‌ణ‌హోమం చూస్తేనే అర్థ‌మ‌వుతుంది.

నిబంధ‌న‌ల ప్ర‌కారం గుర్మీత్ చేతిలో అత్యాచారానికి గురై.. న్యాయ‌పోరాటం చేసిన ఆమె పేరు.. వివ‌రాలు.. రూపురేఖ‌లు.. ఆమెకు సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌టం నేరం. చ‌ట్ట‌ప్ర‌కారం త‌ప్పు. అయితే.. ఒక మ‌హాశ‌క్తిని ఒక మామూలు ఆడ‌పిల్ల ఎదురొడ్డి.. తీవ్ర‌ ఒత్తిడిని ఎదుర్కొని.. ఈ రోజు త‌న‌కు జరిగిన అన్యాయానికి బ‌దులు తీర్చుకున్న ఆమెకు సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశాలు కొన్ని చెప్పుకోవాల్సిందే. మొక్కోవ‌ని ఆమె ధైర్యం.. న్యాయం కోసం ప్రాణాలు ప‌ణంగా పెట్టి మ‌రీ జ‌రిపే మొండిత‌నం మ‌రికొంద‌రికైనా స్ఫూర్తి వంతం కావాల్సిందే. అందుకే.. ఆమెకు సంబంధించిన ఈ క‌థ‌నం.

ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లో వెల్ల‌డించిన ఆమె ముచ్చ‌ట్ల‌ను సింఫుల్ గా చూస్తే.. గుర్మీత్ కు శిక్ష ప‌డిన త‌ర్వాత ఆమె మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ భ‌య‌ప‌డ‌లేద‌ని.. సాక్ష్యం చెప్పే రోజు కూడా భ‌య‌ప‌డ‌లేద‌న్నారు. త‌న‌కు జ‌రిగిన అన్యాయం గురించి త‌న అన్న‌కు (అత‌ను బాబాను విప‌రీతంగా న‌మ్మేవాడు) చెప్పిన‌ప్పుడు ఆవేశంతో ర‌గిలిపోయి ప్ర‌శ్నించినందుకు అత‌న్ని దారుణంగా చంపేశారు. అదే విష‌యాన్ని కేసు విచార‌ణ స‌మ‌యంలోనూ గుర్మీత్ అనుచ‌ర గ‌ణం బెదిరించేద‌ని.. అయిన‌ప్ప‌టికీ తాను భ‌య‌ప‌డలేద‌న్నారు.

అంద‌రూ ఆమెను దూరంగా పెడితే.. కొద్దిమంది స్నేహితులు.. బంధువులు ఆమెకు అండ‌గా నిలిచారు. సీబీఐ కూడా ఆమెను జాగ్ర‌త్త‌గా చూసుకుంది. 2002 నుంచి ఆమెకు ప్ర‌త్యేక భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తున్నారు. తీర్పు స‌మ‌యంలోనూ ఆమెకు భ‌ద్ర‌త‌ను మ‌రింత పెంచారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే ఆమెకు సంబంధించిన కొన్ని వ్య‌క్తిగ‌త విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కొన్నేళ్ల క్రితం ఆమె త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తినే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆమెకు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా. వాళ్లకు ఏమైనా అవుతుంద‌న్న భ‌యం.. వారిపై ఏదైనా దాడి జ‌రుగుతుంద‌న్న ఆందోళ‌న ఆమె మ‌న‌సులో ఉన్నా.. ధైర్యంగానే ఆమె కోర్టుకు హాజ‌రు కావ‌టం గ‌మ‌నార్హం. ఒక సాధార‌ణ అమ్మాయి త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై ధైర్యంగా నోరు విప్ప‌ట‌మే కాదు.. క‌ష్టాలు..క‌న్నీళ్లు.. స‌వాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ న్యాయం కోసం పోరాడితే.. అంతిమంగా విజ‌యం ద‌క్కుతుంద‌న్న విష‌యం ఆమె నిరూపించారు. అన్యాయం కొండలా ఉన్నా.. వెంట్రుక ముక్క తో న్యాయం కోసం పోరాడితే అంత పెద్ద‌ కొండ సైతం కింద ప‌డ‌టం ఖాయ‌మ‌న్న విష‌యాన్ని గుర్మీత్ ఎపిసోడ్ చెబుతుంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.