Begin typing your search above and press return to search.

మావోల టార్గెట్‌ లో 200 మంది నేత‌లు

By:  Tupaki Desk   |   26 Sep 2018 5:32 PM GMT
మావోల టార్గెట్‌ లో 200 మంది నేత‌లు
X
ఏపీలో మ‌రో క‌ల‌క‌లం రేపే వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. ఏపీలోని విశాఖ మన్యంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడి డుంబ్రిగుడ మండల కేంద్రానికి కిలోమీటరు దూరంలోనున్న లివిటిపుట్టు -గుంటసీమ రోడ్డులో సుమారు 40 నుంచి 60 మంది మావోయిస్టులు పథకం ప్రకారం మాటువేసి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రభుత్వ విప్‌ - అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు - రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యులు - మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను కాల్చి చంపిన ఉదంతం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే త‌ర‌హా ముప్పులో మ‌రో 200 మంది నేత‌లు ఉన్న‌ట్లు తేలింది. మావోయిస్టులపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు - వారి వద్ద 200 మంది పేర్లతో కూడిన జాబితా ఉన్నట్టు గుర్తించారు.

పోలీసుల ద‌గ్గ‌ర మంత్రులు - మాజీ మంత్రులు - ఎమ్మెల్యేలు - మాజీ ఎమ్మెల్యేలు - ప్రజా ప్రతినిధులు - గతంలో మావోలుగా పనిచేసి లొంగిపోయిన యువకులు - పోలీసు ఇన్ ఫార్మర్లుగా భావిస్తున్న గిరిజనుల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారాం ప్ర‌కారం మావోల హిట్ లిస్టులో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు - మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు - ఆయన సోదరుడు వినాయక్ - పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి - ఆమె వ్యక్తిగత కార్యదర్శి పోలుపర్తి గోవిందరావు - బీజేపీ నేత లోకుల గాంధీ - కొయ్యూరు మండలం బూదరాళ్ల మాజీ సర్పంచ్‌ సూరిబాబు - ఇక్కడి టీడీపీ నేత ఎం ప్రసాద్‌ తదితరుల పేర్లు ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరితో పాటు పెదబయలు మండల అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు - మాజీ ఎంపీపీ జర్సింగి సూర్యనారాయణ - జామిగూడ మాజీ సర్పంచ్‌ సుబ్బారావు - ఇంజిరి మాజీ సర్పంచులు సత్యారావు - కామేశ్వరరావుల పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో చాలామందికి మావోల నుంచి ఇప్పటికే హెచ్చరికలు వెళ్లాయని పోలీసువ‌ర్గాలు పేర్కొంటున్నాయి.