Begin typing your search above and press return to search.

బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ మీద మరో యాక్సిడెంట్

By:  Tupaki Desk   |   6 Jan 2020 4:49 AM GMT
బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ మీద మరో యాక్సిడెంట్
X
ఏ ముహుర్తంలో పని ప్రారంభించారో.. మరే ముహుర్తంలో స్టార్ట్ చేశారో కానీ బయోడైవర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్ ఎంత వివాదాస్పదంగా మారిందో తెలిసిందే. ఫ్లైఓవర్ ప్రారంభించిన రోజుల వ్యవధిలోనే పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకోవటమే కాదు.. మూడు ప్రాణాలతో పాటు.. పలువురిని గాయాల పాలు చేసిన బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ వివాదాస్పదంగా మారింది. దాని డిజైను పై విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదిలా ఉంటే.. కొద్దిరోజులుగా బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మీద పెద్ద ఎత్తున రక్షణ జాగ్రత్తలకు సంబంధించిన పనులు చేపట్టి.. శనివారం (జనవరి నాలుగు) మరోసారి వాహనాల్ని అనుమతించిన విషయం తెలిసిందే. ఫ్లైఓవర్ రీ ఓపెనింగ్ చేసిన రోజు వ్యవధిలోనే మరో యాక్సిడెంట్ చోటు చేసుకోవటం గమనార్హం.

ఈ ప్రమాదం గురించి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆదివారం మధ్యాహ్నం వనస్థలిపురానికి చెందిన ప్రవీణ్ రెడ్డి కారులో ఐకియా స్టోర్ కు వెళుతుండగా..లంగర్ హౌజ్ కు చెందిన షబ్బీర్ తన టూవీలర్ తో వేగంగా వచ్చి కారును ఢీ కొన్నారు. దీంతో కారు కొంత దెబ్బ తినగా.. ద్విచక్ర వాహనం మీద ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంపై ప్రవీణ్ రెడ్డి ఫిర్యాదు చేయగా రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన కొద్ది రోజులకే రెండు ప్రమాదాలు.. ముగ్గురు మరణించటం.. పలువురు గాయపడటంతో ఈ ప్లైఓవర్ ను తాత్కాలికంగా మూసేసి.. ప్రమాదాలు చోటు చేసుకోకుండా పలు జాగ్రత్తలు తీసుకొని ఫ్లైఓవర్ ను రీఓపెనింగ్ చేశారు. నిపుణుల కమిటీ పర్యవేక్షణలో పరీక్షలు జరిపి.. ఓకే చెప్పిన తర్వాత ఓపెన్ చేసిన రోజు వ్యవధిలోనే యాక్సిడెంట్ చోటు చేసుకోవటం విశేషం.

అయితే..తాజా యాక్సిడెంట్ సైతం టూవీలర్ అతి వేగం కారణం కావటం గమనార్హం. ఈ ఫ్లైఓవర్ మీద గంటకు 40కి.మీ. కంటే వేగంగా ప్రయాణం చేయకూడదన్న రూల్ పెట్టటమే కాదు.. దాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. అయినప్పటికీ.. ఈ ప్రమాదం చోటు చేసుకోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది.