Begin typing your search above and press return to search.

ఎలన్ విజయాల వెనుక మరో కోణం..!

By:  Tupaki Desk   |   26 Dec 2021 11:30 AM GMT
ఎలన్ విజయాల వెనుక మరో కోణం..!
X
ఎలన్ మస్క్.. ఈ పేరు తెలియని బిజినెస్ పర్సన్ అంటూ ఎవరూ ఉండరేమో! ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో మస్క్ ఒకరు. ఈ అపర కుబేరుడు సందర్భానుసారంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇందుకు ఆయన సాధించిన విజయాలకు కారణం. అయితే వీటి వెనుక ఏదో చిన్న పాటి కృషి మాత్రమే ఉందని అనుకుంటే పొరపాటే. తన చిన్నప్పటి నుంచే ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు. ఏళ్ల తరబడి కఠోర శ్రమను ధారపోశారు.

ఒకటి రెండు కంపెనీలు నడుపుతూ.. ఎంచుకున్న ప్రతి రంగంలోనూ తన దైన శైలిలో ముద్ర వేశారు. అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే సంపన్నమైన వ్యక్తిగా ఎదిగారు. ఇందుకు ఆయన చిన్ననాటి నుంచే ముందస్తు ప్రణాళిక రచించుకున్నారు. ఆర్థికంగా బలమైన మనిషి గా ఎదగాలి అంటే కేవలం చదువు మాత్రమే సరిపోదని గ్రహించారు. ఇందుకు గాను తన తండ్రి ఎర్రోల్ మస్క్ చేస్తుండే వ్యాపారాలను నిశితంగా గమనించారు. అప్పటి నుంచే వ్యాపార పాఠాలను ఒంట పట్టించుకున్నారు.

అయితే తన తండ్రి నుంచి కేవలం వ్యాపార పాఠాలు మాత్రమే నేర్చుకున్నారు. కానీ అత్యంత క్రూరుడు అయిన తండ్రి నుంచి ఆ గుణాన్ని తన వరకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రూరత్వాన్ని దగ్గర నుంచి చూసిన ఎలన్ మస్క్.. నాటి నుంచే తండ్రిలా మారకూడదని నిశ్చయించుకున్నారు. ఈ తరుణంలోనే కష్టపడడం నేర్చుకున్నారు. సొంత కాళ్లపై నిలబడేంతలా గుర్తింపు తెచ్చుకోవాలని నాడే డిసైడ్ అయ్యారు. అందుకే కష్టపడి చదువుకున్నారు. దీనికి తోడు చదువుకునే రోజుల నుంచే పార్ట్ టైం గా ఏదో ఒక పని చేయడం నేర్చుకున్నాడు. అందుకే మస్క్ ని దగ్గర నుంచి చూసిన చాలా మంది కష్టం విలువ తెలిసిన వ్యక్తిగా చెప్తుకొస్తారు. ఈ కష్టపడే గుణం తో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా మారినట్లు చెప్తారు.

మస్క్ కు చిన్నప్పటి నుంచి చదువు, వ్యాపారంలపై మక్కువ ఎక్కువ. కానీ ఇందుకు సంబంధించిన కొన్ని గుణాలు ఆయన ఆ వయసులో ఒంట పట్టించుకోలేక పోయారు. ఇందుకు చాలా రోజులు పట్టింది. ముఖ్యంగా ఆయనకు నలుగురిలో నాలుగు మాటలు మాట్లాడాలి అంటే చాలా భయపడే వారు. దీనిని క్రమక్రమంగా అధిగమించారు. అలాగే మస్క్ కు ఉండే మరో సమస్య ఆటిజం. దీనితో కూడా మస్క్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు కావాలి అనుకుంటే వీటన్నింటిని అధిగమించాలని భావించి మస్క్ చాలా కఠిన పరిశ్రమ చేశారు.

తనకున్న భయం కారణంగా మిగతా వారి కంటే తాను కాస్త భిన్నంగా ఆలోచించే వాడినని మస్క్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అప్పుడప్పుడు తను చేసిన పోస్టులు, ట్వీట్లు అందుకే వైరల్ అవుతుంటాయని సరదాగా చెప్తుంటారు. ఈ ఆలోచనల్లో నుంచి పుట్టుకుని వచ్చిందే ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అని గుర్తు చేశారు. వ్యాపారంలో తాను ఇలా ఆలోచించే చాలా సార్లు ఫెయిల్ అయినట్టు పేర్కొన్నారు. కానీ అవే తనకు ఇప్పుడు లాభాలు తెచ్చి పెట్టినట్లు తెలిపారు. అందుకే భిన్నంగా ఆలోచించాలని అందరికి చెప్తానంటున్నారు.