Begin typing your search above and press return to search.

అటవీశాఖ అధికారులపై మరో దాడి

By:  Tupaki Desk   |   2 July 2019 5:05 AM GMT
అటవీశాఖ అధికారులపై మరో దాడి
X
కొమురం భీం జిల్లాలో మహిళా అటవీ అధికారిపై దాడిని మరువక ముందే మరో దారుణం వెలుగుచూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో దాడి ఘటన కలకలం రేపుతోంది. అటవీ భూమిని సాగుచేసుకుంటున్న గిరిజనులను అడ్డుకున్న అటవీ అధికారులను చితకబాదారు.

తాజాగా భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం గుండాలపాడు పోడుభూముల్లో సాగు చేయడాన్ని అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో అక్కడి గిరిజనులు మళ్లీ కర్రలు తీసుకొని అటవీ అధికారులపై దాడులకు దిగి చితకబాదారు. ఈ దాడిలో సెక్షన్ ఆఫీసర్ నీలమయ్య, బీట్ ఆఫీసర్ భాస్కర్ రావు తీవ్రంగా గాయపడ్డారు.

అటవీ అధికారులు పోడు భూములను దున్నుతున్న గిరిజనుల వద్దకు వెళ్లి వారి ట్రాక్టర్లను ఆపారు. ప్రశ్నించగా గిరిజనులంతా అధికారులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇదరు అధికారులు గాయపడ్డారు.

గిరిజనుల దాడి నుంచి తప్పించుకున్న అటవీ అధికారులు ముల్కలపల్లి పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఉదయం ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా వర్షా కాలం కావడంతో అడవులు నరికి సాగుచేసుకుంటున్న గిరిజనులు పంటలు పండించేందుకు భూములు చదును చేయడం తెలంగాణలో వివాదాస్పదమవుతోంది. అటవీ భూమి కావడంతో ఫారెస్ట్ అధికారులు అడ్డు చెబుతున్నారు. కానీ అనాదిగా అడవుల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులు మాత్రం దీనిపై తిరగబడుతున్నారు. వరుసగా రెండో సంఘటన తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.