Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ మెట్రోలో మ‌రో ప్ర‌మాదం...ఊడిప‌డ్డ క్యాబిన్‌

By:  Tupaki Desk   |   18 Oct 2019 4:00 PM GMT
హైద‌రాబాద్ మెట్రోలో మ‌రో ప్ర‌మాదం...ఊడిప‌డ్డ క్యాబిన్‌
X
హైదరాబాద్ మెట్రో యొక్క షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. మెట్రో రాకతో ట్రాఫిక్‌ బాధలు తప్పాయని ఊపిరి పీల్చుకున్న నగరవాసులు... ఇప్పుడు మెట్రో జర్నీ అంటేనే భయపడిపోయే ప‌రిస్థితులు క‌లుగుతున్నాయి. అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో పెచ్చులూడి ఓ యువతి ప్రాణాలు కోల్పోవడంతో బెంబేలెత్తిపోయిన ప్ర‌యాణికులు..ఇప్పుడిప్పుడే ఆ ఘ‌ట‌న నుంచి తేరుకుంటుండ‌గా...తాజాగా ఎల్బీనగర్-మియాపూర్ రూట్‌ మెట్రోలో మ‌రో ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో రైల్ డోర్ మీద ఉన్న క్యాబిన్ ఊడిపోవ‌డంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు.

మెట్రో రైలులో ప్ర‌యాణిస్తున్న ప‌లువురు ప్ర‌యాణికులు తెలిపిన వివ‌రాలు, మీడియాలో జ‌రిగిన ప్ర‌చారం ప్ర‌కారం ఎల్బీనగర్‌-మియాపూర్‌ మెట్రో మార్గంలో ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ వద్దకు చేరుకున్న సమయంలో డోర్‌పైనున్న క్యాబిన్‌ ఊడి ప్రయాణికులపై పడింది. దీంతో ఒక్క‌సారిగా ప్ర‌యాణికులు షాక్ తిన్నారు. పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అని మెట్రో అధికారులు, ప్రభుత్వ వర్గాలు ఒకవైపు ఎలుగెత్తి చాటుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం దారుణమని ప‌లువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నగర పరిధిలో ఎల్బీనగర్‌–మియాపూర్, నాగోల్‌–హైటెక్‌సిటీ మార్గాల్లో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం విదితమే. ఈ రెండు రూట్లలో నిత్యం 3లక్షల మంది జర్నీ చేస్తుండగా... డిసెంబరులో ఎంజీబీఎస్‌–జేబీఎస్‌ రూట్‌లోనూ రాకపోకలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మ‌రోవైపు, గత 14 రోజులుగా టీఎస్‌ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండటంతో హైదరాబాద్‌ మెట్రో సర్వీసులకు జనం తాకిడి ఎక్కువైంది. అలాంటి స‌మ‌యంలో...మెట్రోపై అనుమానాలు క‌లిగించే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.