Begin typing your search above and press return to search.

సినిమా టికెట్ల వ్య‌వ‌హారం.. ఏపీ ప్ర‌భుత్వానికి మ‌రో ఎదురు దెబ్బ త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   9 Sep 2021 11:30 AM GMT
సినిమా టికెట్ల వ్య‌వ‌హారం.. ఏపీ ప్ర‌భుత్వానికి మ‌రో ఎదురు దెబ్బ త‌ప్ప‌దా?
X
సినిమా టికెట్ల విక్ర‌యాల‌కు సంబంధించి ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం.. స‌ర్కారుకు మ‌రో ఎదురు దెబ్బ‌తగిలేలా చేస్తుందా? న్యాయ పోరాటం త‌ప్ప‌దా? అంటే.. ఔన‌నే అంటున్నారు సినీ ప్ర‌ముఖులు. తాజాగా ఏపీ ప్ర‌బుత్వం తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు ప్రభుత్వమే సినిమా టికెట్లను విక్రయిస్తుంది. రైల్వే టికెట్లను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో కొన్న తరహాలోనే... సినిమా టికెట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే వెబ్‌సైట్‌ ద్వారా కొనాల్సి ఉంది. ఒక మోస్తరు పట్టణాల నుంచి నగరాల వరకు పేటీఎంతో మొదలుకుని బుక్‌మైషో వంటి వెబ్‌సైట్‌లు, యాప్‌లతో టికెట్లు కొనేస్తున్నారు. మరి... ఇప్పుడు ఇదే వ్యాపారంలోకి సర్కారు ఎందుకు ప్రవేశిస్తోంది.

ప్రైవేటు వ్యక్తులకు చెందిన సినిమా థియేటర్ల టికెట్లను ప్రభుత్వం అమ్మడం ఎందుకు? ఇందులో జోక్యం చేసుకోవడానికి కారణం ఏమిటి? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మేరకు ఇకపై రాష్ట్రంలోని ఏ, బీ, సీ సెంటర్ల లో.. ఏ థియేటర్లో సినిమా చూడాలన్నా ప్రభుత్వ పోర్టల్‌ ద్వారానే టికెట్‌ కొనాలి. స్మార్ట్‌ ఫోన్‌, గూగుల్‌పే, నెట్‌ బ్యాంకింగ్‌ లేదు.. థియేటర్‌కు వెళ్లినా అక్క‌డ కూడా ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన విధానంలో టికెట్ల‌విక్ర‌యం ఉంటుంది. సింగిల్ స్క్రీన్‌ థియేటర్‌ నుంచి నగరాల్లోని మల్టీప్లెక్స్‌ల దాకా ప్రభుత్వ పోర్టల్‌ నుంచే టికెట్లు కొనాలి.

అయితే.. ఈ విధానంపై సినీ వ‌ర్గాలు పెద‌వి విరుస్తున్నాయి. ఈ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు సినీ ప‌రిశ్ర‌మ ప్రైవేటు రంగం. దీనిలో నేరుగా ప్ర‌భుత్వ జోక్యం ఉండ‌రాదు. ప్రొడ‌క్ష‌న్ నుంచి ప‌బ్లిసిటీ, డిస్ట్రిబ్యూష‌న్‌, స్క్రీనింగ్ వ‌ర‌కు అన్నీ ప్రైవేటుగానే సాగుతాయి. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ పాత్ర కేవ‌లం కొన్ని సబ్సిడీలు ఇవ్వ‌డం .. అనుమ‌తులు మంజూరు చేయ‌డం.. ట్యాక్సులు వ‌సూలు చేసుకోవ‌డం.. ఇత‌ర‌త్రా ప‌నులు మాత్ర‌మే. ఈ క్ర‌మంలో జీఎస్టీ వ‌సూలు చేసుకోవ‌డం, వినోద‌పు ప‌న్నులు వ‌సూలు చేసుకోవ‌డం.. టికెట్ల అమ్మ‌కాల‌పై ప‌న్నుల‌లు విధించ‌డానికే ప‌రిమితం కావాలి.

అయితే.. ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం టికెట్ల విక్ర‌య విష‌యంలో నేరుగా వేలు పెడుతోంది. ఇది.. వాస్త‌వానికి సినీ రంగానికి ప్రాణం వంటి.. ఆదాయంపై ప్ర‌భావం చూపుతుంద‌నే వాద‌న వినిపిస్తోంది. ప్రేక్షకుల డబ్బులు తొలుత ప్రభుత్వ ఖాతాలోకి వెళాయి. ఆ తర్వాత... వాటిని ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యాలకు చెల్లించాలి. ఇలా వెంట‌నే చెల్లింపులు చేస్తుందా? ఇదే పెద్ద సందేహం సినీ వ‌ర్గాల్ల మ‌స‌లుతోంది. ఒక‌వేళ .. ప్ర‌భుత్వం ఇవ్వ‌క‌పోయినా.. తాము పోరాటం చేసే ప‌రిస్థితి ఉండ‌ద‌న్న‌ది వీరి ఆవేద‌న‌.ఆన్‌లైన్‌ బుకింగ్‌లో టికెట్లు విక్రయించే సంస్థలు 24 గంటలు తిరక్కుండానే డబ్బును థియేటర్ల ఖాతాలో జమ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఇలాగే ఇస్తుం దా? ఇవ్వకుంటే పరిస్థితి ఏమిటి? గట్టిగా నిలదీస్తే... తనిఖీలతో వేధింపులు తప్పవా? ఇలా ఎన్నెన్నో సందేహాలు సినీ రంగంలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

అయితే.. ప్ర‌బుత్వ వాద‌న మ‌రో విధంగా ఉంది. టికెట్ల విక్రయంలో జ‌రుగుతున్న మోసాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు ఇలా చేస్తున్నామ‌ని చెబుతోంది. అంతేకాదు.. మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త‌తో టికెట్ల విక్ర‌యాలు జ‌ర‌పాల‌నేది త‌మ ఉద్దేశ‌మ‌ని అంటోంది. అయితే.. దీనిపై అధికార వ‌ర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. టికెట్ల విక్ర‌యాలు ప్ర‌భుత్వానికి మ‌రిన్ని త‌ల‌నొప్పులు తెస్తాయ‌ని అంటున్నారు. `ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న విధానాలే బెట‌ర్‌. బుక్ మై షో త‌దిత‌ర వాటి ద్వారా విక్ర‌యాలు చేస్తున్న వాటిపై ఆదాయం వ‌స్తోంది. ఇంత‌కు మించి ఆదాయం ఏమ‌ముంటుంది?`` అనేది వీరి వాద‌న‌.

ఇదిలావుంటే.. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని హైకోర్టులో స‌వాల్ చేయాల‌ని ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్ల సంఘాలు ప్లాన్ చేస్తున్నాయి. ఇది పూర్తిగా ప్రైవేటు వ్యాపార‌మ‌ని.. దీనిలో ప్ర‌భుత్వ జోక్యం అనేది ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఎక్క‌డా లేద‌ని.. ప్ర‌భుత్వానికి ప‌న్నులు క‌ట్ట‌క‌పోతేనో.. నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతేనో.. చ‌ర్య‌లు తీసుకునే హ‌క్కు ఉంటుంది త‌ప్ప‌.. ఇత‌రత్రా విష‌యాల్లో ప్ర‌భుత్వానికి జోక్యం ఎందుక‌ని.. వీరు వాదిస్తున్నారు. మొత్తానికి ఈ విష‌యంలో ప్ర‌భుత్వానికి మ‌రో ఎదురు దెబ్బ త‌గులుతుందా? కోర్టు ఈ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధిస్తుందా? వేచిచూడాల్సిందే.