Begin typing your search above and press return to search.

విజ‌య్ మాల్యాకు మ‌రో దెబ్బ‌.. ఆ సీటు గోవిందా?

By:  Tupaki Desk   |   6 July 2021 9:40 AM GMT
విజ‌య్ మాల్యాకు మ‌రో దెబ్బ‌.. ఆ సీటు గోవిందా?
X
భార‌త‌దేశంలోని బ్యాంకుల‌ను దాదాపు రూ.9 వేల కోట్ల మేర మోసం చేసి లండ‌న్ పారిపోయిన వ్యాపార‌వేత్త విజ‌య్ మాల్యా.. ఇప్పుడు మ‌రో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కింగ్ ఫిష‌ర్ బీర్ల‌ను ఉత్ప‌త్తి చేసే యూబీఎల్ (యునైటెడ్ బ్రూవ‌రీస్ లిమిటెడ్‌) కంపెనీ నుంచి మాల్యాకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమ‌వుతోంది. ప్ర‌స్తుతం యూబీఎల్ చైర్మ‌న్ గా ఉన్న లిక్క‌ర్ కింగ్‌ విజ‌య్ మాల్యాల‌ను.. ఆ స్థానం నుంచి తొల‌గించేందుకు డ్ బ్రూవ‌ర్ హైనెకెన్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది.

యూబీఎల్ లో షేర్ హోల్డ‌ర్ గా ఉన్న హైనెకెన్‌.. త‌న వాటాను మ‌రింత‌గా పెంచుకుంది. యునైటెడ్ బ్రూవ‌రీస్ లిమిటెడ్ లోని మాల్యా షేర్ల‌లో మ‌రికొన్ని హైనెక్ కొనుగోలు చేసింది. దీంతో.. మొత్తం యూబీఎల్ లో 46.5 శాతం వాటా క‌లిగి ఉన్న హైనెకెన్‌.. తాజా కొనుగోలుతో త‌న వాటాను ఏకంగా 61.5 శాతానికి పెంచుకుంది.

స‌హ‌జంగా.. ఏ కంపెనీలోనైనా 49ః51 అనే ప‌ద్ధ‌తిలో మెజారిటీ నిర్ణ‌యాలు అమ‌ల‌వుతుంటాయి. అంటే.. 51 శాతం షేర్లు క‌లిగిన వారి మాట‌కు బోర్డులో బ‌లం ఉంటుంది. వారు తీసుకునే నిర్ణ‌యాలు అమ‌ల‌య్యేందుకు స్కోప్ ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటిది హైనెకెన్ ఏకంగా 61.5 శాతం వాటా క‌లిగి ఉండ‌డంతో.. యూబీఎల్‌ చైర్మ‌న్ సీటును ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నెల 29న జ‌ర‌గ‌నున్న కంపెనీ వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశం హైనెకెన్ సంస్థ‌కు అత్యంత కీల‌కం కానుంది. చైర్మ‌న్ ను మార్చ‌డానికి ఈ స‌మావేశం అంగీక‌రించాల్సి ఉంటుంది.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న కంపెనీ రూల్స్ ప్ర‌కారం.. కొత్త చైర్మ‌న్ ను నామినేట్ చేసే అధికారం విజ‌య్ మాల్యాకు మాత్ర‌మే ఉంటుంది. యూబీఎల్ లైఫ్ టైమ్ చైర్మ‌న్ గా ఆయ‌న ఆ హ‌క్కును కలిగి ఉన్నారు. అయితే.. ఈ నిబంధ‌న‌ల‌ను మార్చేందుకు సైతం హైనెకెన్ ప్ర‌య‌త్నిస్తోంది. ముందుగా.. మాల్యాను సంప్ర‌దించడం ద్వారా ఈ స‌మ‌స్య‌ను సామ‌ర‌స్యంగా పరిష్క‌రించుకోవాల‌ని చూస్తోంద‌ట‌.. కుద‌ర‌క‌పోతే నిబంధ‌న‌లు మార్చేందుకు సైతం సిద్ధ‌ప‌డ‌నుంద‌ని ఎక‌న‌మిక్స్ టైమ్స్ పేర్కొంది. అయితే.. ఈ నిబంధ‌న‌ల‌ను మార్చాలంటే.. 75 శాతం వాటా క‌లిగి ఉండాలి. కానీ.. హైనెకెన్ వాటా 61.5 శాతం మాత్ర‌మే. మిగిలిన షేర్ హోల్డ‌ర్ల‌ను క‌లుపుకొని ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. మ‌రి ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.