Begin typing your search above and press return to search.

ఏపీ ఉద్యోగులకు సర్కార్ మరో వరం

By:  Tupaki Desk   |   6 July 2021 3:30 PM GMT
ఏపీ ఉద్యోగులకు సర్కార్ మరో వరం
X
కరోనా కల్లోలంతో ఇప్పుడు అందరూ ఆ మహమ్మారి బారిన పడుతున్నారు. తర తమ బేధం లేకుండా అందరినీ ఆ మహమ్మారి కబళిస్తోంది. ఇక బయట ఆఫీసుల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు కష్టాలు చెప్పనలవి కావు. ఇప్పటికే చాలా మంది కరోనా బారినపడ్డారు. కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ క్రమంలోనే కోవిడ్ బారిన పడ్డ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ బారిన పడిన ప్రభుత్వ ఉద్యోగులకు 20 రోజులపాటు సాధారణ సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు కరోనా దేశంలో ప్రారంభమైన 2020 మార్చి 25వ తేదీ నుంచి వర్తిస్తాయని వెల్లడించింది.

ప్రభుత్వ ఉద్యోగులను మొత్తం 5 కేటగిరిలుగా విభజించి ఈ సెలవులు మంజూరు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉద్యోగి కరోనా బారినపడి హోం ఐసోలేషన్ లో ఉంటే 20 రోజుల వరకూ కమ్యూటెడ్ సెలవు ఇస్తారు.. ఒకవేళ ఆ సెలవులు లేకుంటే 15 రోజుల పాటు ప్రత్యేక సాధారణ సెలవుగా ఇస్తారు. మిగతా ఐదు రోజుల్లో ఈఎల్., హెచ్.పీ.ఎల్ నుంచి సర్దుబాటు చేయనున్నట్లు తెలిపింది.

ప్రభుత్వ ఉద్యోగులు కరోనాతో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి 20 రోజుల పాటు సెలవు మంజూరు చేస్తారు. ఇక ఉద్యోగి కుటుంబ సభ్యులకు కరోనా సోకితే 15 రోజుల పాటు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేస్తారు. ఇక కుటుంబానికి కరోనా సోకి ప్రభుత్వ ఉద్యోగి క్వారంటైన్ లో ఉంటే 7 రోజుల పాటు వర్క్ ఫ్రం హోంగా పరిగణిస్తారు..కంటైన్ మెంట్ జోన్ లో ఉంటే ఉద్యోగికి వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ వరాలు ప్రకటించింది. వారు కోవిడ్ బారిన పడినా..కుటుంబం పడినా కూడా జీతం నష్టపోకుండా సెలవులను కేటాయించింది. ఏపీలో కరోనా తీవ్రత దృష్ట్యా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగవర్గాలు ప్రశంసలు కురుస్తున్నాయి.

కాగా ఏపీలో కరోనా తీవ్రత తగ్గుతోంది. లాక్ డౌన్ ఆంక్షలు, నైట్ కర్ఫ్యూ, చర్యల కారణంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 33964 యాక్టివ్ కేసులున్నాయి.