Begin typing your search above and press return to search.

ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయించిన మరో సీఎం

By:  Tupaki Desk   |   27 Sep 2020 2:00 PM GMT
ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయించిన మరో సీఎం
X
మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ గెలుపులో కీలకంగా వ్యవహరించింది రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం. ప్రశాంత్ కిషోర్‌ కు చెందిన ఐ-పాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) వైసీపీ ఎన్నికల వ్యూహాల నుంచి ప్రచారం వరకు పార్టీ అధినేత జగన్ తో పాటు శ్రేణులను కూడా ముందుండి నడిపించింది. జగన్ ను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్న ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించి రాజకీయ వ్యూహాలు పన్ని జగన్ ను గెలిపించారు.

ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరుఫున పనిచేసిన పీకే అక్కడ సీఎంగా కేజ్రీవాల్ ను గెలిపించాడు. 2014లో మోడీని, ఆ తర్వాత బీహార్ లో నితీష్, బెంగాల్ లో మమత, తమిళనాట డీఎంకేకు పనిచేస్తున్నారు.

పీకేకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ఎన్నికల రంగంలోకి దిగేందుకు కాంగ్రెస్ సమాయాత్తమవుతోంది.

ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల సలహాదారుడిగా నియమించుకోవాలని కాంగ్రెస్ పంజాబ్ నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తాజాగా పీకేతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందే పీకేతో ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం నిర్ణయించారు.

మొత్తం 117 అసెంబ్లీ స్తానాలు గల పంజాబ్ శాసనసభ గడువు మరో 15 నెలల్లో ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్, ఆమ్ ఆద్మీలు ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి.

బీజేపీతో అకాలీదళ్ స్నేహం చెడడంతో ఆ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ ను తమవైపుకు తిప్పుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రతిపాదనకు పీకే సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.