Begin typing your search above and press return to search.

ఏపీ, తెలంగాణ మధ్య మరో వివాదం

By:  Tupaki Desk   |   26 Nov 2021 6:32 AM GMT
ఏపీ, తెలంగాణ మధ్య మరో వివాదం
X
ఏపీ తెలంగాణ మధ్య మరో వివాదం మొదలైంది. ప్రతి విషయంలోనూ వివాదాలు సృష్టించి, ఇబ్బందులు పెడుతున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఇంకో వివాదానికి తెరలేపింది. తెలంగాణలోకి కర్నూలు జిల్లా వడ్లను అనుమతించడం లేదు.

జిల్లా సరిహద్దులోని పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద బుధవారం రాత్రి నుంచి తెలంగాణ పోలీసులు ధాన్యం లారీలను అడ్డుకుంటున్నారు. నంద్యాల ప్రాంతంలో పండిన హంస రకం వడ్లను రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ ధాన్యాన్ని తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించేందుకు లారీలలో తీసుకువెళ్లారు.

ఏపీ నుంచి వచ్చే ధాన్యాన్ని తెలంగాణలోకి అనుమతించవద్దని తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్ర పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ముందుగా సమాచారం లేకపోవడంతో వ్యాపారులు సరిహద్దు చెక్‌ పోస్టు వద్ద లారీలను నిలబెట్టుకుని పడిగాపులు కాయాల్సి వస్తోంది. లంగాణ మిల్లర్లకు అమ్మేందుకు బుధవారం రాత్రి జిల్లా నుంచి దాదాపు 20 లారీల్లో ధాన్యాన్ని లోడు చేసి పంపారు.

టి-పోలీసులు పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద ఈ లారీలను అడ్డుకున్నారు. తమ రాష్ట్రంలోకి ధాన్యం లారీలను ఎలా తీసుకువస్తారని నిలిపివేశారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి తలెత్తలేదని, ఎప్పటిలాగానే ఈ సీజన్‌లో కర్నూలు జిల్లా నుంచి వరి ధాన్యాన్ని తెలంగాణకు సరఫరా చేస్తున్నామని లారీల డ్రైవర్లు వారికి తెలిపారు.

ఇప్పుడెందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ధాన్యం లారీలను తెలంగాణలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని తమ ప్రభుత్వం ఆదేశించిందని అక్కడి పోలీసులు ఖరాకండిగా చెప్తున్నారు.ఏపీలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కనీవినీ ఎరగని రీతిలో వర్షాలు కురిసి, వరదలు ముంచెత్తాయి.

ఇలాంటి సమయంలో తాము ధాన్యాన్ని నిల్వచేయలేమని, తెలంగాణకు ధాన్యం వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంటే తమ పరిస్థితి ఏంటని ఆంధ్రా రైతులు ప్రశ్నిస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై స్పందించి, ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో ఫైట్‌ చేస్తోంది తెలంగాణ.

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని, పంజాబ్‌ లాంటి రాష్ట్రాలకు ఒక న్యాయం తెలంగాణకు ఒక న్యాయమా అని ప్రశ్నిస్తోంది. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ వివాదం కొనసాగుతుండగానే ఇటు ఆంధ్రా నుంచి వచ్చే ధాన్యం లారీలను అడ్డుకుంటున్నారు తెలంగాణ అధికారులు.

మరోవైపు తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై ఇవాళ కేంద్రం క్లారిటీ ఇవ్వనుంది. దీనిపై కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌తో భేటీ కానున్నారు తెలంగాణ వ్యవసాయశాఖమంత్రి నిరంజన్‌రెడ్డి. 2021-22 ఖరీఫ్‌, రబీ సీజన్‌లో కేంద్రం కొనుగోలు చేసే ధాన్యం కోటాపై చర్చించనున్నారు. మరోవైపు బాయిల్డ్‌ రైస్‌పై ఇప్పటికే స్పష్టం ఇచ్చింది కేంద్రం.