Begin typing your search above and press return to search.

ఢిల్లీలో మరో రైతు ఆత్మహత్య .. ఇప్పటికే 60 మంది బలవన్మరణం

By:  Tupaki Desk   |   10 Jan 2021 7:54 AM GMT
ఢిల్లీలో మరో రైతు ఆత్మహత్య .. ఇప్పటికే 60 మంది బలవన్మరణం
X
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో వివిధ రాష్ట్రాల రైతులు 46 రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానా కు చెందిన వేలాది మంది రైతులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్న రైతుల్లో ఇప్పటికే 60 మంది చనిపోగా.. తాజా తాజాగా పంజాబ్ కు చెందిన మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

వ్యవసాయ రంగంలో వివిధ సంస్కరణలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు వ్యవసాయ బిల్లులను పార్లమెంట్లో ఆమోదించింది. అయితే ఈ బిల్లులు కార్పొరేట్ రంగాలకు మేలు చేకూర్చేలా ఉన్నాయని, ఈ బిల్లుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని..వాటిని ఉపసంహరించుకోవాలని పంజాబ్, హర్యానాకు చెందిన వేలాది మంది రైతులు ఉద్యమ బాట పట్టారు. ఢిల్లీకి చేరుకుని సింఘ, టిక్రి, ఘాజీపూర్, చిల్లా సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్కడే వంట చేసుకుంటూ, దాతలు ఇచ్చే ఆహారం తీసుకుంటూ నలభై ఆరు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. రైతుల ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీంతో రైతుల డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వం రైతు సంఘాల నాయకులతో ఇప్పటికే ఎనిమిది దఫాలుగా చర్చలు జరిపింది.

కొత్త చట్టాలను రద్దు చేయాలని రైతులు పట్టుబడుతుండగా, మార్పులు చేర్పులకు అవకాశం ఇస్తాం.. కానీ రద్దు చేయడం కుదరదని ప్రభుత్వం తెగేసి చెబుతోంది. దీంతో రైతులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రైతుల ఆందోళనకు మద్దతుగా వివిధ రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా పంజాబ్ కు చెందిన 40 ఏళ్ల రైతు అమరీందర్ సింగ్ సింఘ సరిహద్దుల్లో విషం తాగాడు. సహచర రైతులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం సోనిపట్ ఫిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అమరీందర్ సింగ్ మృతి చెందాడు. ఉద్యమ బాట పట్టిన రైతుల్లో 60 మంది ఇప్పటికే వివిధ కారణాలతో మృతిచెందడం తీవ్రంగా కలచి వేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా
18వ తేదీన మహిళా కిసాన్ దివస్ పేరుతో, 23వ తేదీన నేతాజీ జయంతి సందర్భంగా ఆజాద్ కిసాన్ పేరుతో ఆందోళనలు చేపడతామని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ట్రాక్టర్లతో గణతంత్ర పరేడ్ నిర్వహిస్తామని తెలిపారు. అటు కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతు సంఘాల నాయకులు చేస్తున్న డిమాండ్లపై సుప్రీం కోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేసింది. వ్యవసాయ చట్టాల రద్దు, రైతుల ఆందోళన పిటిషన్లపై 11వ తేదీ సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది.