Begin typing your search above and press return to search.

మ‌రో మ‌హామాంద్యం త‌ప్ప‌దా? .. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే!

By:  Tupaki Desk   |   26 Sep 2022 11:32 AM GMT
మ‌రో మ‌హామాంద్యం త‌ప్ప‌దా? .. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే!
X
మ‌రోమారు ప్ర‌పంచం ఆర్థిక మాంద్యం కోర‌ల్లో చిక్కుకోకత‌ప్ప‌దా? మ‌హామాంద్యం మ‌న‌ల్ని పొంచే ఉందా? అవుననే అంటున్నారు.. ఆర్థిక నిపుణులు. గ‌త రెండేళ్లు కోవిడ్ సృష్టించిన విల‌యంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్ర‌జ‌లు క‌న్నుమూశారు. నెల‌ల త‌ర‌బ‌డి లాక్‌డౌన్ విధించ‌డంతో వ్యాపారాలు జ‌ర‌గ‌క ఆయా దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లే దెబ్బ‌తిన్నాయి. పలు దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయాయి. శ్రీలంక‌, ఆఫ్రిక‌న్ దేశాలు ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చ‌ని అంటున్నారు.

కోవిడ్ సృష్టించిన విల‌యం నుంచి ఇప్పుడిప్పుడే ఆయా దేశాలు కోలుకుంటున్నాయి. వ్యాక్సిన్ల రాక‌తో కోవిడ్‌కు చాలావ‌ర‌కు అడ్డుక‌ట్ట ప‌డింది. ప్ర‌పంచ దేశాలు నిదానంగా ఊపిరిపీల్చుకుంటున్నాయి. మళ్లీ ఇంతలోనే ర‌ష్యా - ఉక్రెయిన్ యుద్ధంతో ప‌రిస్థితి మళ్లీ మొద‌టికొచ్చింది. ఉక్రెయిన్ నుంచి గోధుమ‌లు, వ‌న‌స్ప‌తి నూనెలు, ర‌ష్యా నుంచి చ‌మురు ఎగుమ‌తులు ఆయా దేశాల‌కు నిలిచిపోయాయి. దీంతో ఆయా దేశాల్లో వీటి ధ‌ర‌లు హెచ్చాయి. ఫలితంగా ద్ర‌వ్యోల్బ‌ణం తారాస్థాయికి చేరింద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో 2008ని మించిన ఆర్థిక మాంద్యం మ‌రోమారు వ‌స్తుంద‌ని ప్ర‌ముఖ ఆర్థికవేత్త, రోబిని మాక్రో అసోసియేట్స్ చైర్మ‌న్ క‌మ్ సీఈవో నోరియ‌ల్ రోబిని చెబుతున్నారు. తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2022 చివ‌రికి అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుంద‌ని ఆయ‌న బాంబుపేల్చారు. అంతేకాకుండా వ‌చ్చే ఏడాదంతా మాంద్యంలోనే కొన‌సాగుతుంద‌న్నారు.

అగ్ర రాజ్య‌మైన అమెరికానే ఆర్థిక మాంద్యం బారిన‌ప‌డ‌టం, డాల‌ర్‌తో ప్ర‌పంచ వాణిజ్యం మార్పిడి విధానం ఆధార‌ప‌డి ఉండ‌టంతో మిగిలిన దేశాలు సైతం ఆర్థిక సంక్షోభంలోకి జారుకోవ‌డం ఖాయ‌మ‌ని నోరియ‌ల్ రోబిని చెబుతున్నారు. కాబ‌ట్టి ప్ర‌పంచ దేశాలు ఆర్థికంగా బాగుండాలంటే అమెరికా బాగుండ‌టం అవ‌స‌ర‌మ‌న్నారు. అమెరికా ఆర్థిక మాంద్యం బారిన‌ప‌డితే మిగిలిన దేశాలు అదే బాట‌లో ప‌య‌నిస్తాయ‌ని హెచ్చ‌రించారు.

2008లో వ‌చ్చిన ఆర్థిక మాంద్యం బ్యాంకుల‌ను, రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌ల‌ను దెబ్బ‌తీసింద‌ని రోబిని గుర్తు చేశారు. అయితే ఈసారి వ‌చ్చే మాంద్యం దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను దెబ్బతీస్తుంద‌న్నారు. 2008 ఆర్థిక మాంద్యాన్ని రోబిని చాలా ముందుగానే అంచ‌నా వేయ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే మ‌హా మాంద్యం గురించి ఆయ‌న చెబుతున్న విష‌యాల‌ను చాలామంది విశ్వ‌సిస్తున్నారు.

ఇప్ప‌టికే శ్రీలంక పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో ప‌డిపోగా పాకిస్థాన్ కూడా సంక్షోభం ముంగిట ఉంది. బంగ్లాదేశ్‌లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాకుండా మ‌న‌దేశంలో ప‌లు రాష్ట్రాలు స్థాయిని మించి, ఆర్‌బీఐ ప‌రిమితిని దాటి అప్పులు చేస్తున్నాయ‌ని విమ‌ర్శ ఉంది. ఈ నేపథ్యంలో రోబిని తాజా వ్యాఖ్య‌లు అంద‌రిలో తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.

గ‌త రెండేళ్లు కోవిడ్, ప్ర‌స్తుతం ర‌ష్యా - ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా ఫెడ్ రేట్ల‌ను గ‌త ద‌శాబ్దాల్లో ఎన్న‌డూ లేనంత‌గా పెంచ‌డం, పెద్ద ఎత్తున బెయిల‌వుట్ ప్యాకేజీల‌ను ప్ర‌క‌టించ‌డం వంటి మాంద్యానికి ముంద‌స్తు సూచిక‌లుగా భావించ‌వ‌చ్చ‌ని అంటున్నారు.

వ‌డ్డీ రేట్ల పెంపుతో ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించి ప్ర‌జ‌ల‌ ఆదాయాలు పడిపోతున్నాయ‌ని చెబుతున్నారు. రానున్న కాలంలో ఇవి ఇలాగే కొనసాగితే ఆర్థిక మాంద్యం విజృంభిస్తోంద‌ని ఇప్ప‌టికే నిపుణులు హెచ్చ‌రించిన సంగ‌తి తెల‌సిందే. అయినా అనేక దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతూనే ఉన్నాయి. కాగా అమెరికా వ‌చ్చేనవంబర్, డిసెంబర్ నాటికి మరింతగా ఫెడ్ రేట్లు పెంచుతుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌న‌దేశంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సైతం అదే దారిలో ముందుకు సాగుతోంద‌ని స‌మాచారం. దీంతో ప్ర‌జ‌ల‌కు రుణాల భారం పెరిగి అధిక మొత్తం ఈఎంఐలు క‌ట్టాల్సి ఉంటుంద‌ని.. త‌ద్వారా వారి ఆదాయాలు ప‌డిపోతాయ‌ని నిపుణులు చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.