Begin typing your search above and press return to search.

2022 మార్చిలో విడుదల కానున్న మరో హైదరాబాద్ టీకా

By:  Tupaki Desk   |   20 Jun 2021 4:53 AM GMT
2022 మార్చిలో విడుదల కానున్న మరో హైదరాబాద్ టీకా
X
పుట్టినంతనే.. బాల్యంలో మాత్రమే టీకాలు వేయించుకునే అలవాటైన చాలామందికి కరోనా పుణ్యమా అని.. వ్యాక్సిన్ అన్నది జీవితంలో ఒక భాగంగా మారింది. పలువురు నిపుణుల అభిప్రాయాన్ని చూస్తే.. కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు మాత్రమే కాదు.. రానున్న రోజుల్లో ఏడాదికోసారి కానీ రెండేళ్లకు ఒకసారి కానీ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. వ్యాక్సిన్ తయారీకి సంబంధించి పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే కోవాగ్జిన్ కారణంగా హైదరాబాద్ ఘన కీర్తి ప్రపంచానికి పరిచయమైంది. త్వరలో హైదరాబాద్ కు చెందిన బయలాజికల్ -ఇ సంస్థ నుంచి కొవిడ్ కు మరో టీకా రానుంది.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ కు చెందిన మరో ఫార్మా సంస్థ కోవిడ్ కు చెక్ చెప్పే మరో వ్యాక్సిన్ ను రూపొందించే ప్రయత్నంలో ఉంది. చివరి దశలో ఉన్న ఈ టీకా.. 2022 మార్చిలో అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఇంతకీ ఆ కంపెనీ ఏదంటే.. ఐఐఎల్.ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్. ఇప్పటికే పలు వ్యాక్సిన్లతో పాటు.. పశుశుల ఔషధాల్ని తయారు చేసే ఈ సంస్థ తమ ఉత్పత్తుల్ని 50 దేశాలకు సరఫరా చేస్తోంది.

ప్రపంచంలోనే అతి పెద్ద టీకా తయారీ సంస్థల్లో ఒకటిగా నిలుస్తోంది. హైదరాబాద్ సమీపంలోని కరకపట్ల వద్ద ఉన్న యూనిట్ లో పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తుంటారు. ఈ సంస్థకు హైదరాబాద్ లో రెండు.. ఊటీ.. న్యూజిలాండ్ లలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం నాలుగు తయారీ యూనిట్లు ఉన్నాయి. ఈ సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సిన్ ‘‘లైవ్ ఎటెన్యూయేటెడ్ వ్యాక్సిన్’. ఈ టీకా వేసుకున్నంతనే మంచి యాంటీ బాడీ స్పందన వస్తుందని.. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ రెస్పాన్స్ ను ప్రేరేపించటం తమ వ్యాక్సిన్ ప్రత్యేకతగా చెబుతున్నారు. అంతేకాదు వైరస్ లో వచ్చే స్వల్ప మ్యుటేషన్లపై కూడా ఇది పని చేస్తుందని చెబుతున్నారు.

మిగిలిన టీకాలతో పోలిస్తే.. తమ వ్యాక్సిన్ చాలా తక్కువ ధరకు లభించేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ టీకాను ఒక డోస్ తీసుకోవాలా? రెండు డోసులు తీసుకోవాలా? అన్న విషయం మీద మాత్రం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. అయితే.. ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్లతో పోలిస్తే దీర్ఘకాలం ఇమ్యూనిటీని ఇస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం జంతువులపై పరీక్షలు చేస్తున్నారు. త్వరలోనే మనుషులపై కూడా పరీక్షలు జరిపి.. అనుకున్నట్లే వచ్చే మార్చి నాటికి అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.