Begin typing your search above and press return to search.

పేదల బియ్యం.. కాకినాడ వయా ఆఫ్ఘనిస్తాన్‌ !

By:  Tupaki Desk   |   3 Dec 2021 3:57 AM GMT
పేదల బియ్యం.. కాకినాడ వయా ఆఫ్ఘనిస్తాన్‌ !
X
కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ బియ్యం స్కామ్‌లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. మటుమాయమైన పేదల బియ్యం విదేశాలకు ఎగుమతైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. కైకలూరు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి మాయమైన వేలాది బస్తాల బియ్యంలో అధిక భాగం దేశ సరిహద్దులు దాటేసినట్టు తెలుస్తోంది. ఈ బియ్యం కాకినాడ పోర్టు నుంచి అప్ఘానిస్థాన్ లో పాటు వివిధ దేశాలకు తరలిపోయినట్టు సమాచారం.

పేదల కడుపుపై అక్రమార్కుల కన్నుపడింది. రేషన్ బియ్యాన్ని విదేశాలకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమ రవాణాకు కాకినాడ పోర్టు సాక్ష్యంగా నిలుస్తోంది. కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ లో అదృశ్యమైన బియ్యం బస్తాల్లో అధిక భాగం కాకినాడ పోర్టు నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ తదితర దేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెబుతున్నారు.

కృష్ణా జిల్లాలోని కలిదిండి, కైకలూరు, మండవల్లి మండలాల నుంచి రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించి అక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ అక్రమ రవాణ వెనుక బడా మాఫియా హస్తం ఉన్నట్టు చెబుతున్నారు. ఈ మాఫియా చేతిలో సివిల్‌ సప్లయిస్‌ అధికారులు చిక్కుకున్నట్టు సమాచారం.

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో వెలుగు చూసిన.. ఈ స్కామ్ బయటకు పొక్కడంతో విచారణ కమిటీని నియమించారు. కమిటీ ఏర్పాటు చేయకముందు మాఫియా తేరుకుంది. బయట నుంచి ఐదు లారీల్లో బియ్యాన్ని తిరిగి తీసుకువచ్చి గోడౌన్ లలో సర్దేశారని చెబుతున్నారు. ఈ లోపే విచారణ కమిటీ రంగంలోకి దిగింది.

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి మొత్తం 12000 బియ్యం బస్తాలు, ఇతర నిత్యావసరాలు మాయమైనట్లు కమిటీ గుర్తించింది. అంతేకాకుండా మొవ్వ, అవనిగడ్డ, జి.కొండూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల పరిధిలో కూడా లెక్కలను తారుమారైనట్లు తెలుస్తోంది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జ్‌ లంతా ఒక నెట్‌వర్క్‌ గా ఏర్పడి గోడౌన్లలోని పేదల బియ్యాన్ని తరలించేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జీ లు ఎవరి కనుసన్నల్లోనే పని చేస్తున్నారనే దానిపై దృష్టి సారిస్తే అసలు విషయం బయటకు వస్తుందని అంటున్నారు.

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి అధిక మొత్తంతో బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించినట్లు తెలుస్తోంది. మిగిలిన బియ్యం బస్తాలను మిల్లులకు తరలించినట్లు సమాచారం.

ఈ బియ్యాన్ని మిల్లర్లు తక్కువ రేటు కొనుగోలు చేసి.. ఇదే బియ్యానికి పాలిష్ చేసి రెట్టింపు ధరకు విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేషన్ మాఫియాను పట్టుకోవడంతో పాటు, కాకినాడ పోర్టుకు, అక్కడి నుంచి విదేశాలకు తరలించే రాకెట్‌ వ్యవహారాన్ని అధికారులు ఛేదించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.

ఈ స్కామ్‌ వల్ల కలిదిండి, కైకలూరు, మండవల్లి మండలాలకు చెందిన పేద ప్రజలు నిత్యావసరాలను దూరమవుతున్నారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల నుంచి రేషన్ పూర్తిస్థాయిలో వినియోగదారులకు అందడం లేదనే చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి.

ఆరు నెలలుగా ఈ మూడు మండలాల ప్రజలు పూర్తిస్థాయిలో నిత్యావసరాలను అందుకోవటం లేదని వాపోతున్నారు. పూర్తిస్థాయిలో రేషన్ అందక కార్డుదారులు రేషన్‌ డీలర్లను నిలదీస్తున్నారు. కైకలూరు నుంచి దారిమళ్లిన బియ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.