Begin typing your search above and press return to search.

కొన‌సాగుతున్న లేఖ‌ల యుద్ధం.. కృష్ణాబోర్డుకు మ‌రో ఉత్త‌రం

By:  Tupaki Desk   |   5 July 2021 3:30 PM GMT
కొన‌సాగుతున్న లేఖ‌ల యుద్ధం.. కృష్ణాబోర్డుకు మ‌రో ఉత్త‌రం
X
తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మొద‌లైన‌ జ‌ల వివాదం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఏపీ అక్ర‌మ ప్రాజెక్టులు నిర్మిస్తోంద‌ని తెలంగాణ‌.. తెలంగాణ అనుమ‌తి లేకుండా విద్యుత్ ఉత్ప‌త్తి మొద‌లు పెట్టింద‌ని ఏపీ.. కొన్ని రోజులుగా పోట్లాడుకుంటున్న సంగ‌తి తెలిసిందే. శ్రీశైలంతో పాటు.. నాగార్జున సాగ‌ర్‌, దాని కింద ఉన్న పులిచింత ప్రాజెక్టులోనూ విద్యుత్ ఉత్ప‌త్తి మొద‌లు పెట్టడంతో వివాదం మ‌రింత పెరిగింది.

అయితే.. విద్యుత్ ఉత్ప‌త్తి వ‌ల్ల ప్రాజెక్టుల్లోని వేలాది క్యూ సెక్కుల నీరు దిగువ‌కు వెళ్లిపోతోందని ఏపీ వాదిస్తోంది. పులి చింత‌ల నుంచి ప్ర‌కాశం బ్యారేజీ వైపు భారీగా వ‌ర‌ద నీరు వ‌స్తుండ‌డంతో.. ప్ర‌కాశం బ్యారేజీ గేట్ల‌ను కూడా ఎత్తేశారు ఏపీ అధికారులు. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 9,000 క్యూసెక్కుల నీటిని స‌ముద్రంలోకి విడుద‌ల చేసిన‌ట్టు తెలుస్తోంది.

కాగా.. తెలంగాణ స‌ర్కారు అనుమ‌తి లేకుండా సాగిస్తున్న విద్యుత్ ఉత్ప‌త్తిని ఆపాలంటూ.. ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌ధాన మంత్రికి, కేంద్ర జ‌ల‌శ‌క్తి సంఘానికి, కృష్ణా బోర్డుకు కూడా లేఖ రాశారు. ఈ నేప‌థ్యంలో.. కృష్ణాబోర్డు తెలంగాణ స‌ర్కారుకు లేఖ రాసింది. శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి ఆపాల‌ని పేర్కొంది. దీనికి ప్ర‌తిగా.. తెలంగాణ నీటి పారుద‌ల శాఖ అధికారులు కృష్ణాబోర్డుకు లేఖ రాశారు.

శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభించిన స‌మ‌యంలో ప్లానింగ్ క‌మిష‌న్‌, కృష్ణా మొద‌టి ట్రైబ్యున‌ల్ పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి అనుమ‌తి ఇచ్చింద‌ని అన్నారు. ఆ నిర్ణ‌యానికి అనుగుణంగానే క‌రెంటు ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్టు చెప్పారు. 1991 నుంచి ఏప్రిల్‌, మే నెల‌లో ఏ రోజు కూడా 834 అడుగుల‌కుపైగా నీటి మ‌ట్టం ఉండేలా చూడ‌లేద‌ని పేర్కొన్నారు. కానీ.. ఇప్పుడు మాత్రం 854 అడుగుల పైన నీటి మ‌ట్టం ఉండాల‌ని ఏపీ కోరుతోంద‌ని పేర్కొన్నారు.

తెలంగాణ విద్యుత్ ఉత్ప‌త్తితో ఏపీకి న‌ష్టం వాటిల్లుతోంద‌న్న వాద‌న‌లో వాస్త‌వ‌మే లేద‌న్నారు. ఇక‌, విద్యుత్ కూడా 50 శాతం నిష్ప‌త్తితో పంచాల‌ని విభ‌జ‌న చట్టంలోనే లేద‌ని పేర్కొన్నారు. ఈ విష‌యాల‌న్నీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ఒక నిర్ణ‌యానికి రావాల‌ని ఆదివారం రాసిన‌ లేఖ‌లో కోరారు.

అయితే.. సోమ‌వారం మ‌రో లేఖ రాశారు తెలంగాణ ఇరిగేష‌న్ అధికారులు. ఈ జ‌ల వివాదం గురించి మాట్లాడేందుకు రెండు రాష్ట్రాల అధికారుల‌తో త్రిస‌భ్య క‌మిటీ స‌మావేశం ఏర్పాటు చేసేందుకు కృష్ణా బోర్డు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 9న స‌మావేశం నిర్వ‌హించనున్న‌ట్టు ఇరు రాష్ట్రాల‌కు బోర్డు లేఖ రాసింది. అయితే.. ఆ రోజు స‌మావేశంలో పాల్గొన‌లేమ‌ని, ఈ నెల 20వ తేదీన పూర్తిస్థాయి బోర్డుస‌మావేశం ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. దీంతో.. 9వ తేదీన స‌మావేశం జ‌రిగే అవ‌కాశం లేద‌నే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. మ‌రి, దీనిపై బోర్డు ఎలా స్పందిస్తుంది? అన్న‌ది చూడాలి.