Begin typing your search above and press return to search.

భారత్ కి మరో పథకం ... బాక్సర్ ల‌వ్లీవాకు కాంస్యం !

By:  Tupaki Desk   |   4 Aug 2021 8:30 AM GMT
భారత్ కి మరో పథకం ... బాక్సర్ ల‌వ్లీవాకు కాంస్యం !
X
టోక్యో ఒలింపిక్స్‌ లో ఇండియ‌న్ బాక్స‌ర్ లవ్లీనా బోర్గొహైన్ అద్భుత పోరాటం ముగిసింది. బుధ‌వారం 64-69 కేజీల విభాగంలో జ‌రిగిన సెమీఫైన‌ల్ లో తన ప్రత్యర్థి ట‌ర్కీ బాక్స‌ర్ బుసెనాజ్ సూర్మ‌నెలి చేతిలో 0-5తో ఆమె ఓడిపోయింది. మూడు రౌండ్ల‌లోనూ ట‌ర్కీ బాక్స‌ర్ పూర్తి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. దీనితో ఐదుగురు జ‌డ్జీలు ఏక‌గ్రీవంగా ఆమెనే విజేత‌గా తేల్చారు. ఈ ఓట‌మితో ల‌వ్లీనా బ్రాంజ్ మెడ‌ల్‌తో స‌రిపెట్టుకుంది.

లవ్లీనా ఒలింపిక్స్‌ లో ఆడటం ఇదే తొలిసారైనా భయపడలేదు. అదిరిపోయే పంచులతో క్వార్టర్స్‌ వరకు చేరింది. క్వార్టర్స్‌ లో మాజీ ప్రపంచ ఛాంపియన్‌, చైనీస్‌ తైపీ బాక్సర్‌ నిన్‌-చిన్‌ తో తలపడింది. 4-1 స్కోరుతో ఘన విజయం సాధించి.. సెమీస్‌ కు దూసుకెళ్లింది. ఎలాగైన ప్ర‌పంచ బాక్స‌ర్‌ పై విజ‌యం సాధించి స్వ‌ర్ణం గెల‌వాల‌ని చూసిన లవ్లీవాకు సెమీస్‌లో ఎదురుదెబ్బ త‌గ‌ల‌డంతో కాస్యంతో స‌రిపెట్టుకోవాలసి వ‌చ్చింది. ఇక ఒలింపిక్స్ బాక్సింగ్‌ లో ఇండియాకు వ‌చ్చిన మూడో మెడ‌ల్ ఇది. గ‌తంలో విజేంద‌ర్‌, మేరీకోమ్ కూడా బ్రాంజ్ మెడ‌ల్స్ గెలిచారు. అలాగే , ఈ టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా గెలిచిన మూడో మెడ‌ల్ ఇది. వెయిట్‌ లిఫ్టింగ్‌ లో మీరాబాయి చాను సిల్వ‌ర్‌, బ్యాడ్మింట‌న్‌ లో సింధు బ్రాంజ్ మెడ‌ల్ గెల‌వ‌గా.. ఇప్పుడు బాక్సింగ్‌ లో ల‌వ్లీనా బోర్గోహైన్ మ‌రో బ్రాంజ్ మెడ‌ల్ తీసుకొచ్చింది.

అంత‌క‌ముందు, అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ల‌వ్లీనా మ్యాచ్‌ ను వీక్షించేందుకు అసెంబ్లీని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. చారిత్రాత్మక స్వర్ణ పతకం సాధించాలని కోరకుంటూ తమ అభిమాన బాక్సర్‌ ని ప్రత్యక్షంగా చూడటానికి అనుమతించాలని డిప్యూటీ స్పీకర్ నుమాల్ మోమిన్ స్పీకర్ బిశ్వజిత్ డైమరీని అభ్యర్థించినట్లు సంబంధిత అధికారి తెలిపారు. బౌట్ ముగిసిన తర్వాత, అసెంబ్లీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇందుకోసం లైవ్‌ టెలికాస్ట్‌ ను ఏర్పాటు చేశారు. తద్వారా సభలోని సభ్యులందరూ, అసెంబ్లీ సిబ్బంది దీన్ని వీక్షించవచ్చు. అస్సాం నుంచి ఒలింపిక్ పతకం సాధించిన తొలి క్రీడాకారిణి, అలాగే ఒలింపిక్స్‌లో పాల్గొన్న రాష్ట్రం నుండి మొదటి మహిళా అథ్లెట్ కూడా లవ్లీనే కావడం గమనార్హం.

మరోవైపు, భారత కుస్తీవీరులు రవికుమార్‌ దహియా (57 కిలోలు), దీపక్‌ పునియా (86 కిలోలు) సంచలనం సృష్టించారు. తమ విభాగాల్లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. బల్గేరియాకు చెందిన జార్జి వలెటినోవ్‌ను రవి 14-4 తేడాతో చిత్తు చేశాడు. ఇక చైనాకు చెందిన లిన్‌ జుషెన్‌పై దీపక్‌ పునియా 6-3 తేడాతో విజయం సాధించాడు. రవికుమార్‌ గతంలో ఎన్నడూ లేనంత ఫామ్‌ లో కనిపిస్తున్నాడు. వరుసగా రెండో బౌట్లోనూ ప్రత్యర్థిని సాంకేతిక ఆధిపత్యంతోనే ఓడించాడు. అతడి ఉడుం పట్టుకు, టేక్‌ డౌన్లకు జార్జి వలెటినోవ్‌ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. తొలి పిరియడ్‌లో వరుసగా 2, 2, 2 పాయింట్లు సాధించిన రవి 6-0తో ఆధిపత్యం సాధించాడు.

ఇక రెండో పిరియడ్‌ లో మరింత రెచ్చిపోయాడు. వరుసగా 2, 2, 2, 2 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. ప్రత్యర్థికి కేవలం 4 పాయింట్లే వచ్చాయి. మరో 16 సెకన్లు ఉండగానే బౌట్‌ ముగిసింది. ప్రిక్వార్టర్స్‌ లో కొలంబియాకు చెందిన టిగ్రరోస్‌పై రవి 13-2 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. సెమీస్‌ లో కజక్‌స్థాన్‌ రెజ్లర్‌ సనయెన్‌ నురిస్లామ్‌ తో తలపడనున్నాడు.

తొలి బౌట్లో దూకుడుగా ఆడిన దీపక్‌ పునియా క్వార్టర్స్‌లో అటు దూకుడు ఇటు రక్షణాత్మక విధానంలో విజయం సాధించాడు. ప్రత్యర్థి అనుభవాన్ని గౌరవించాడు. లిన్‌ జుషెన్‌ ను 6-3తో ఓడించాడు. తొలి పిరియడ్‌లో దీపక్‌ ఒక పాయింటు సాధించి 1-0తో ముందుకెళ్లాడు.
ఇక రెండో పిరియడ్‌ లో వరుసగా 2, 2, 1 సాధించాడు. ప్రత్యర్థికి 1,2 పాయింట్లు మాత్రమే రావడంతో విజయం భారత కుస్తీవీరుడినే వరించింది. ప్రిక్వార్టర్స్‌ లో అతడు నైజీరియాకు చెందిన అజియోమొర్‌ ఎకెరెకెమిని 12-1 తేడాతో చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. సెమీస్‌లో అతడు డేవిడ్‌ మోరిస్‌ తో తలపడనున్నాడు.