Begin typing your search above and press return to search.

తెర‌పైకి మ‌రో మిలినీయం మార్చ్ .. !

By:  Tupaki Desk   |   25 July 2022 8:02 AM GMT
తెర‌పైకి మ‌రో మిలినీయం మార్చ్ .. !
X
ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌కు పరిష్కారం దొరకడం లేదు. దీంతో వారి ఆవేదన ఉద్యమ రూపం దాల్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిరసనను ఉద్ధృతంగా చేయాలని భావిస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఈ మేర‌కు స‌ర్కారుకు ఓ అల్టిమేటం ఇచ్చాయి. నిన్న‌టి వేళ శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీనే నిర్వ‌హించాయి.

అదేవిధంగా త‌మ‌ను వేధిస్తున్న తీరుపై కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. ఎప్ప‌టిక‌ప్పుడు స‌స్పెన్ష‌న్లు, షోకాజ్ నోటీసుల పేరిట ప్ర‌భుత్వం త‌మ‌ను వేధిస్తోంద‌ని సంబంధిత నాయ‌కులు ప్ర‌భుత్వంపై విమర్శలు చేశారు. ఈ నేప‌థ్యంలోనే సెప్టెంబ‌ర్ లో మిలీనియం మార్చ్ నిర్వ‌హించేందుకు తామంతా సిద్ధం అవుతున్నామ‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం అయ్యారు.

వాస్త‌వానికి కొత్త పీఆర్సీ అమ‌లుకు సంబంధించి ఇప్ప‌టికీ కొన్ని చోట్ల కొంద‌రిలో అసంతృప్త‌త నెల‌కొని ఉంది. వాటిపై బ‌య‌ట‌కు మాట్లాడేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేదు.

అదేవిధంగా ప‌ని ఒత్తిడి కార‌ణంగాప‌డుతున్న అవ‌స్థ‌ల‌పై కూడా బ‌య‌ట‌కు మాట్లాడితే ఎక్క‌డ ఇబ్బందులు వ‌స్తాయో అని వీరంతా వెనుకంజ వేస్తున్నారని విపక్షాలు అంటున్నాయి. వైసీపీ ప్ర‌భుత్వంలో ఇచ్చిన హామీల‌కు వాటిని అమ‌లు చేసిన తీరుకు అస్స‌లు పొంత‌నే లేద‌ని ఉపాధ్యాయ వ‌ర్గాలు ఆందోళ‌న చెందుతూనే ఉన్నాయి.

దీంతో వారి ఆగ్ర‌హానికి మరో రూపం అన్న విధంగా భారీ ఎత్తున్న ఐదు జిల్లాల నాయ‌కులు, కార్య‌వ‌ర్గ స‌భ్యులు నిన్న‌టి వేళ ర్యాలీకి త‌ర‌లివ‌చ్చారు. జిల్లా కేంద్రంలో పలు స‌మ‌స్య‌ల‌పై వారు మాట్లాడారు. అదేవిధంగా పాఠ‌శాల‌ల విలీనంపై కూడా వారు గ‌ళం వినిపించారు. సీపీఎస్ ర‌ద్దు కు సంబంధించి ఎటువంటి స్ప‌ష్ట‌తా ఇవ్వ‌డం లేద‌ని మండిప‌డ్డారు మ‌రోసారి. ఈ నేప‌థ్యంలో ఉద్యోగుల‌కూ, అధికార పార్టీ నాయ‌కులకూ మ‌ధ్య దూరం క్ర‌మ క్ర‌మంగా పెరుగుతోంది అన్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది.

ఇప్పటికే అన్ని విభాగాల ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొన్న వేళ... అన్ని సంఘాలు ఏకమై ఉద్యమం మొదలుపెడితే ప్రభుత్వానికి ఊపిరాడటం కష్టమే. చూడాలి ఏం జరుగుతుందో.