Begin typing your search above and press return to search.

క్రికెట్లో రాణిస్తున్న మ‌రో ఎమ్మెల్యే..!

By:  Tupaki Desk   |   10 Jan 2022 11:30 PM GMT
క్రికెట్లో రాణిస్తున్న మ‌రో ఎమ్మెల్యే..!
X
రాజ‌కీయ నాయ‌కులు క్రీడల్లో రాణించ‌డం మామూలు విష‌యం కాదు. ఒక వైపు నిత్యం ప్ర‌జా స‌మ‌స్య‌ల్లో బిజీగా ఉంటూ మ‌రో వైపు ఆట‌ల్లో ప్ర‌తిభ చూప‌డం అసాధార‌ణ విష‌యం. ఆ అసాధార‌ణ విష‌యాన్ని సాధార‌ణ విష‌యంగా చేసి చూపెడుతున్నారు కొంద‌రు ఎమ్మెల్యేలు. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా ఆట‌ల‌పై త‌మ మ‌క్కువ చూపిస్తూ ఉన్నారు. ఆట‌ల్లో త‌మ ప్ర‌తిభ చూపిస్తూనే రాజ‌కీయాల్లో త‌మ ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేస్తూ ఉన్నారు. తాజాగా ఆ కోవ‌లోకే వ‌చ్చారు మ‌న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు.

తెలంగాణ రాజ‌కీయ య‌వ‌నిక‌పై ఆట‌ల్లో పై చేయి సాధిస్తూ వ‌స్తున్నారు కొంద‌రు మ‌న ప్ర‌జాప్ర‌తినిధులు. అందులో మొద‌ట‌గా చెప్పుకోవాల్సింది మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్ గురించి. మ‌న దేశం త‌ర‌పున వంద‌ల మ్యాచ్‌ల్లో ప్ర‌తిభ చూపిన అజారుద్దీన్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ఉమ్మడి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒకప్పుడు క్రికెట్ ఆటగాడే.

టీఆర్ఎస్ మంత్రి హ‌రీశ్‌రావు కూడా అప్పుడ‌ప్పుడూ క్రికెట్ పై త‌న‌కున్న ఇష్టాన్ని చాటుకుంటూ ఉన్నారు. రాజ‌కీయాల్లో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపే హరీశ్‌రావులో ఒక మంచి క్రికెట‌ర్ దాగి ఉన్నాడు. సినీ తార‌లు, మీడియా, పొలిటిక‌ల్ క్ల‌బ్ ల నుంచి చాలా ఆట‌ల్లో ప్రాతినిథ్యం వ‌హించాడు. చ‌క్క‌టి బ్యాటింగ్‌, బౌలింగ్ తో ఎన్నో సార్లు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఇప్ప‌టికీ త‌న‌కు క్రికెట్ అంటే ప్రాణం అని చెబుతుంటారు.

తెలంగాణ నుంచే మ‌రో నేత కూడా క్రికెట్లో రాణించారు. ఆయ‌నెవ‌రో కాదు.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి ఈటెల రాజేంద‌ర్ చేతిలో ఓడిపోయిన కౌశిక్ మంచి క్రికెట్ ఆట‌గాడు. ఇటీవ‌ల టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికైన కౌశిక్ గ‌తంలో కౌంటీల్లో పాల్గొన్నారు. ఎన్నో మ్యాచ్‌ల‌కు ప్రాతినిథ్యం వ‌హించి ప‌లు అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆ జాబితాలో చేరారు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల‌రాజు. ఆదివారం అచ్చంపేట‌లో ఆలిండియా క్రికెట్ టోర్న‌మెంట్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో గువ్వ‌ల అసాధార‌ణ ప్ర‌తిభ చూపారు.

16 బంతులు విసిరి 21 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు సాధించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో మ‌హారాష్ట్ర జ‌ట్టు, ఆర్ఫాన్ సీసీ జ‌ట్టు త‌ల‌ప‌డ‌గా ఎమ్మెల్యే ఆర్ఫాన్ జ‌ట్టు త‌ర‌పున పాల్గొన్నారు. గువ్వ‌ల మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడ‌గా రెండు మ్యాచ్‌ల్లో రెండేసి వికెట్లు సాధించి.. చివ‌రి మ్యాచ్‌లో 4 వికెట్లు సంపాదించారు. దీంతో అంద‌రూ ఎమ్మెల్యే ప్ర‌తిభ‌ను చూసి ముచ్చ‌ట‌ప‌డ్డారు. తెలంగాణ రాజ‌కీయాల నుంచి మ‌రో క్రికెట‌ర్ వ‌చ్చాడ‌ని సంబ‌ర‌ప‌డ్డారు.