Begin typing your search above and press return to search.

ఎయిరిండియా టాటా చెప్పేందుకు మరింత సమయం..!

By:  Tupaki Desk   |   28 Dec 2021 9:34 AM GMT
ఎయిరిండియా టాటా చెప్పేందుకు మరింత సమయం..!
X
ప్రముఖ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా ను టాటా సన్స్ కు అప్పగించేందుకు మరో నెల రోజుల సమయం పట్టవచ్చని తెలుస్తోంది. అనుకున్న దాని కంటే అప్పగింతల ప్రక్రియ మరింత ఆలస్యం కావడం తోనే ఈ జాప్యం జరిగిందని అధికారులు తెలిపారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ మేరకు టాటా గ్రూప్ టేకోవర్ చేయాల్సి ఉంది. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల మరింత ఆలస్యం జరగనుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వానికి, టాటా సంస్థలకు మధ్య జరిగిన ఈ ఒప్పందం ప్రకారం ఇప్పటికే ఎయిరిండియాలో వాటా విక్రయం పూర్తి స్థాయిలో జరగాల్సి ఉంది. కానీ ఇది జరగలేదు. వచ్చే ఏడాది 2022 జనవరి నాటికి ఈ విక్రయానికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రక్రియ కొలిక్కి వస్తుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

ఈ ఒప్పందంతో ఎయిరిండియాలో మొత్తం వాటాలతో పాటు ఎయిర్ ఎక్స్ ప్రెస్ సంస్థలో సైతం వంద శాతం వాటాను టాటా సంస్థ కొనుగోలు చేసింది. మరోవైపు ఎయిర్ఇండియా శాట్స్‌ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ లో కూడా టాటా సంస్థకు సగానికి పైగా వాటాలు వచ్చాయి. ఇందుకు గానూ టాటా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి సుమారు రూ. 2,700 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపులు ఇంకా పూర్తి స్థాయిలో జరిగితే ఎయిరిండియా కొనుగోలు సులభంగా జరుగుతుంది.

అక్టోబర్ లో ఎయిరిండియా వంద శాతం పెట్టుబడిని అధికారికంగా ధృవీకరించింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించి టాటా సంస్థకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను కూడా జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. టాటా సంస్థ మన దేశంలో ఉండే వాటిలో అతి పెద్ద సంస్థ. ఎయిరిండియా ఆర్థికంగా కష్టాల్లో మునిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ రంగ సంస్థలను ఇటీవల కాలంలో ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం మొగ్గు చూపుతుంది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు చెప్తున్నారు.

అయితే ఈ సంస్థ పై ఉన్న అప్పులను మాత్రం కేంద్ర భరిస్తూ కేవలం ఆస్తులను మాత్రమే టాటా సంస్థకు బదలాయింపు చేసింది కేంద్రం. ఇలా చేయడంపై విపక్షాలు చాలా సార్లు మండి పడ్డాయి. ప్రభుత్వ ఆస్తులను పెట్టుబడిదారులకు అప్పనంగా కట్టబెడుతున్నారని విమర్శించాయి. అయితే ఎయిరిండియాకు ఆగస్టు నాటికి మొత్తం అప్పు రూ. 61,562 కోట్లు ఉంది. అయితే ఈ మొత్తంలో టాటా గ్రూప్ కేవలం రూ. 15,300 కోట్లు మాత్రమే కట్టనుందని అధికారులు తెలిపారు.