Begin typing your search above and press return to search.

అంతర్వేదిలో 100 ఏళ్ళు ఉండేలా మరో కొత్త రధం !

By:  Tupaki Desk   |   13 Sep 2020 8:30 AM GMT
అంతర్వేదిలో 100 ఏళ్ళు ఉండేలా మరో కొత్త రధం !
X
అంతర్వేది ఆలయంలో రధం కాలి బూడిద కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5 అర్ధరాత్రి దాటిన తర్వాత అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం అగ్నికి ఆహుతి అయిపోయింది. అనుకోని విధంగా మంటలు చెలరేగడంతో కాలి బూడిదైంది. ఈ ఘటన పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ వినిపించింది. దీంతో జగన్ సర్కార్ ఈ కేసు దర్యాప్తు బాధ్యతల్ని సీబీఐకి అప్పగించింది. ఇకపొతే ,కాలిపోయిన రథానికి రూ.84 లక్షల ఇన్స్యూరెన్స్ ఉంది. అయితే ఆ డబ్బు రావాలంటే .. రథం ఎందుకు కాలిందో తెలియాలి. అయితే దీనిపై కేసు నడుస్తుండటంతో ఇది ఇప్పట్లో తేలేలా కనిపించడంలేదు. దీనితో కొత్త రథాన్ని ప్రభుత్వమే తయారు చేయించనుంది. 2021 ఫిబ్రవరిలో లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవ సమయానికి రథాన్ని సిద్ధం చేయనున్నారు.

కొత్త రథం నిర్మాణం కోసం రూ.95 లక్షల అంచనాతో దేవదాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.దీనికోసం నియమించిన దేవదాయ శాఖ ప్రత్యేకాధికారి రామచంద్రమోహన్‌ రెండు రోజులుగా అంతర్వేది ఆలయాన్ని పరిశీలించి కొత్త రథం నిర్మాణంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. దేవదాయ, అగ్నిమాపక, ఇతర శాఖల సమన్వయంతో వారం, పది రోజుల్లో డిజైన్‌ కి తుది రూపం ఇవ్వనున్నారు. రథం నిర్మాణం కోసం 1,300 ఘనపుటడుగుల నాణ్యమైన ముదురు టేకు కలప అవసరమని లెక్క తేల్చారు. రథం 21 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తుతో తయారు చేయాలని నిర్ణయించారు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలతోపాటు తూర్పుగోదావరి జిల్లాలో టేకు కలప కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణు, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెంలో టింబరు డిపోను పరిశీలించారు. పాత టేకు కలప కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

కొత్త రథానికి ఫైర్‌ సేఫ్టీ ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు. ఈ విషయంపై రాష్ట్రంలో 80 ర«థాల నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించిన గణపతి ఆచారి అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరుగా రథానికే నీటి సరఫరా ఉండేలా ప్రత్యేక పైపులను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. రథం ఉంచే షెడ్డుకు కూడా అవసరాన్ని బట్టి నిరంతరం నీటి సరఫరా జరిగేలా పైపులుండేలా డిజైన్‌ను రూపొందిస్తున్నారు. నాణ్యత, రక్షణ విషయంలో రాజీపడకుండా రథం నిర్మాణానికి రూ.1.10 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. దగ్ధమైన రథం 39.7 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు ఉండేది. ప్రస్తుత కొత్త రథం 40 నుంచి 41 అడుగులతో నిర్మించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇటీవల దగ్ధమైన రధానికి వినియోగించిన టేకు కలపను బర్మా నుండి తెచ్చారు. అ రథం 54 ఏళ్లు పూర్తయినా చెక్కుచెదరలేదు. దీనితో ఇందుకు తగ్గట్టుగానే ఇప్పుడు తయారు చేయబోయే రథం 100 ఏళ్ళు మన్నికగా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు.