Begin typing your search above and press return to search.

గౌత‌మ్ అదానీ.. మ‌రో రికార్డు!

By:  Tupaki Desk   |   30 Aug 2022 6:25 AM GMT
గౌత‌మ్ అదానీ.. మ‌రో రికార్డు!
X
ఇంతై.. ఇంతింతై.. వటుడింతై అన్నట్టు సాగుతోంది.. అదానీ ఎంట‌ర్‌ప్రైజెస్ చైర్మ‌న్ గౌత‌మ్ అదానీ దూకుడు. దేశంలోనే అత్య‌ధిక ధ‌న‌వంతుడిగా ఇప్ప‌టికే రిల‌యెన్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని దాటేసిన గౌత‌మ్ అదానీ మ‌రో రికార్డును కొల్ల‌గొట్టారు. ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్నుల జాబితాలో మూడో స్థానంలోకి దూసుకుపోయారు. బ్లూమ్ బ‌ర్గ్ బిలియ‌నీర్ల తాజా నివేదిక ప్ర‌కారం ప్ర‌పంచంలో టాప్ -3 అత్య‌ధిక ధ‌న‌వంతుడిగా గౌత‌మ్ అదానీ రికార్డు సృష్టించారు. ఈ స్థాయికి చేరిన తొలి ఆసియా వాసిగానూ గౌత‌మ్ ఆదానీ రికార్డు ద‌క్కించుకున్నారు. త‌ద్వారా ముకేష్ అంబానీకి, చైనా దిగ్గజం అలీబాబాకు కూడా సాధ్యం కాని ఫీట్ న‌మోదు చేశారు.

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ తాజా నివేదిక ప్ర‌కారం.. గౌత‌మ్ అదానీ 137.4 బిలియన్ డాలర్ల సంపదతో ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించారు. దీంతో ఇప్పుడు టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల‌ అధినేత‌ ఎలాన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మాత్రమే గౌత‌మ్ అదానీ కంటే ముందున్నారు. 60 ఏళ్ల అదానీ గత కొన్నేళ్లుగా పోర్టులు, విమానాశ్ర‌యాలు, బొగ్గు గ‌నులు, సిమెంట్ పరిశ్ర‌మ‌లు, డేటా సెంటర్లు ఇలా ప్ర‌తి రంగంలోనూ కాలుమోపుతున్నారు. అంతేకాకుండా ఇటీవ‌ల దేశంలోనే టాప్ న్యూస్ చానెళ్ల‌లో ఒక‌టిగా ఉన్న ఎన్‌డీటీవీలోనూ 21 శాతానికిపైగా వాటాల‌ను ద‌క్కించుకున్నారు.

కాగా 2014లో న‌రేంద్ర మోడీ ప్ర‌ధాని ప‌ద‌విని చేప‌ట్ట‌కముందు వ‌ర‌కు గౌత‌మ్ అదానీ దేశంలో ధ‌న‌వంతుల లిస్టులో టాప్ టెన్లో కూడా లేరు. అయితే 2014లో మోదీ ప్ర‌ధాని ప‌ద‌విని చేప‌ట్టాక గుజ‌రాత్‌కే చెందిన గౌత‌మ్ ఆదానీ వ్యాపారాలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల సంప‌ద వ‌చ్చి చేరింది. అతి స్వ‌ల్ప‌కాలంలోనే ఆయ‌న దేశంలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా రికార్డు సృష్టించారు. ఈ క్ర‌మంలో రిల‌య‌న్స్ అధినేత ముకేశ్ అంబానీని వెన‌క్కి నెట్టారు. ఇప్పుడు ప్ర‌పంచంలోనే మూడో అత్య‌ధిక ధ‌న‌వంతుడిగా రికార్డు సృష్టించారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో అంబానీని వెనక్కి నెట్టిన అదానీ.. ఆసియాలోనే అత్య‌ధిక సంపన్నుడిగా నిలిచారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో బిలియన్ డాలర్లు ఆర్జించిన వ్యక్తుల్లో ఒకరిగా అదానీ సంచ‌ల‌నం సృష్టించారు. జూలైలో మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్ గేట్స్‌ను దాటేసిన ఆయన.. అప్పుడు ప్రపంచంలోకెల్లా నాలుగో సంపన్న వ్యక్తిగా చోటు ద‌క్కించుకున్నారు.

కాగా బ్లూమ్ బ‌ర్గ్ రిచెస్ట్ బిలియ‌నీర్ల జాబితా ప్ర‌కారం.. టెస్లా అధినేత‌ ఎలాన్ మస్క్ నికర విలువ 251 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్ర‌పంచంలో అత్య‌ధిక‌ ధ‌న‌వంతుడిగా మ‌స్క్ నిలిచారు. ఇక‌ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద 153 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆయ‌న రిచెస్ట్ బిలియ‌నీర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో ప్రపంచంలోని మొదటి ముగ్గురు సంపన్న వ్యక్తుల జాబితాలో ఒక ఆసియా వ్యక్తి చోటు సంపాదించడం ఇదే తొలిసారని బ్లూమ్ బ‌ర్గ్ తెలిపింది. కాగా ఇటీవ‌ల తన 60వ పుట్టిన రోజు సందర్భంగా 7.7 బిలియన్ డాలర్లను దాతృత్వ కార్యక్రమాలకు విరాళంగా ఇస్తున్నట్లు గౌత‌మ్ ఆదానీ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.