Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్.. ఔషధానికి కేంద్రం అనుమతులు

By:  Tupaki Desk   |   28 Dec 2021 8:35 AM GMT
గుడ్ న్యూస్.. ఔషధానికి కేంద్రం అనుమతులు
X
కరోనా మహమ్మారిపై పోరాటం చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే శక్తిమంతమైన ఆయుధం. ఈ అస్త్రంతోనే వైరస్ ను ఎదుర్కొగలమని ప్రపంచ దేశాలకు చెందిన వైద్యనిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా వివిధ సంస్థలు, కంపెనీలు అభివృద్ధి చేసిన టీకాల అత్యవసర వినియోగలకు అనుమతులు ఇస్తూ... వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేశారు. మనదేశంలోనూ వివిధ రకాల టీకాలు అందుబాటులోకి వచ్చాయి. నేటి నుంచి మరో రెండు వ్యాక్సిన్లు, ఒక కొవిడ్ ఔషధ వినియోగానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది.

సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కొవావాక్స్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. బయోలాజికల్-ఈ సంస్థ తయారుచేసిన కార్బెవాక్స్ టీకా అత్యవసర వినియోగానికి కూడా కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ అనుమతులు లభించాయి. ఈ రెండు టీకాలతో పాటు మాల్న్ పిరవిర్ అనే కొవిడ్ ఔషధ వినియోగానికి పర్మిషన్ ఇచ్చింది. నేటి నుంచే ఇవి అందుబాటులోకి వస్తాయని సీడీఎస్సీఓ ప్రకటించింది.

కరోనా రెండు టీకాలైన కొవావాక్స్, కార్బెవాక్స్, మాల్న్ పిరవిర్ మాత్రల అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. సిఫార్సు చేసిన 24 గంటల్లోనే కేంద్రం దీనిపై స్పందించింది. భారత్ లో వీటిని అత్యవసర వినియోగం కింద ఉపయోగించవచ్చునని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు సీడీఎస్సీఓ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ప్రకటించారు. కరోనాపై పోరాటం చేసేందుకు మరో మూడు ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వీటి అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయని ప్రస్తావిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

దేశంలో ఇప్పటికే పలు సంస్థలకు చెందిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో ఆ సంఖ్య ఎనిమిదికి చేరింది. భారత్ బయోటెక్ కొవాగ్జిన్, ఆక్స్ ఫర్డ్ కొవిషీల్డు, రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ, జైడస్ క్యాడిల్లా, జాన్సన్ అండ్ జాన్సన్, మొడెర్నా టీకాల అత్యవసర వినియోగానికి అందుబాటులో ఉన్నాయి. తాజాగా మరో రెండో టీకాలు, ఓ మాత్ర ఈ జాబితాలో చేరాయి. ఇకపోతే దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఈ రెండు టీకాలకు అనుమతులు వచ్చినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఒమిక్రాన్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. టీకా అవసరాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నొక్కిచెప్పింది.