Begin typing your search above and press return to search.

సంపన్నుల జాబితాలో నుంచి బయటకు వచ్చేస్తా!

By:  Tupaki Desk   |   15 July 2022 6:30 AM GMT
సంపన్నుల జాబితాలో నుంచి బయటకు వచ్చేస్తా!
X
ఊరు ఎంతో ఇచ్చింది.. దానికి తిరిగి ఇవ్వకపోతే లావైపోతామన్న అర్థం వచ్చేలా శ్రీమంతుడి సినిమాలో హీరో చెప్పే మాటలకు.. కాస్త విస్తృతి పెంచి ప్రపంచాన్నే తన ఊరుగా ఫీలయ్యే అపర కుబేరుల్లో ఒకరు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. ఇప్పటికే బిల్ అండ్ మిలిందా గేట్స్ సంస్థకు లక్షల కోట్ల రూపాయిల్ని సేవా కార్యక్రమాల కోసం వెచ్చించిన ఆయన.. తాజాగా మరింత మొత్తాన్ని ఈ సంస్థకు ఇచ్చేందుకు తాను సిద్ధమవుతున్నట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. త్వరలోనే తన ఆస్తిలోని మరో 20 బిలియన్ డాలర్ల మొత్తాన్నిఫౌండేషన్ కు ఇవ్వనున్నట్లు చెప్పారు.

తానిలా చేయటం వల్ల కొంతకాలం ప్రపంచ సంపన్నుల జాబితాలో నుంచి బయటకు వచ్చేస్తానన్న ఆయన.. తాను చేస్తున్న సహాయం త్యాగం ఎంత మాత్రం కాదన్నారు. ప్రపంచం చవిచూస్తున్న సవాళ్లను ఎదుర్కోవటంలో భాగస్వామ్యం కావటాన్ని గొప్పగా భావిస్తానని పేర్కొన్నారు. రెండు దశాబ్దాల నుంచి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్ని చేపడుతున్న గేట్స్.. మొదట్లో ఏటా ఒక బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేసేవారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని అంతకంతకూ పెంచుకుంటూ ఏటా ఆరు బిలియన్ డాలర్లు ఖర్చు చేసే స్థాయికి ఫౌండేషన్ చేరుకుంది.

బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం చూస్తే.. ప్రస్తుతం బిల్ గేట్స్ సంపద 113 బిలియన్ డాలర్లు. ప్రపంచంలో నాలుగో సంపన్నుడిగా కొనసాగుతున్న ఆయనకు ముందు టెస్లాఅధినేత ఎలన్ మస్క్ (217 బిలియన్ డాలర్లు).. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (134 బిలియన్ డాలర్లు).. బెర్నార్డ్ జీన్ ఆర్నాల్ట్ (127 బిలియన్ డాలర్లు) గేట్స్ ముందు ఉన్నారు. నాలుగో స్థానంలో ఉన్న ఆయన.. తన సంపదలో సింహభాగాన్నిఫౌండేషన్ కు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీంతో.. ఈ జాబితా నుంచి బయటకు వచ్చేయనున్నారు.

ఇప్పటివరకు ఏటా తాను చేసే సేవా కార్యక్రమాల ఖర్చు గురించి ప్రస్తావించారు. కరోనా సమయంలో ఏడాదికి 2 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఖర్చు చేశానని.. 2026 నాటికి ఆ మొత్తాన్ని 9 బిలియన్ డాలర్లకు పెంచటమే తన లక్ష్యంగా చెప్పుకొచ్చారు. ఓవైపు కరోనా.. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం.. వాతావరణ మార్పులతో పాటు ఇతర సంక్షోభాలతో ప్రపంచం కష్టాలు పడుతున్న నేపథ్యంలో సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంపాదించటం ఒక ఎత్తు అయితే.. దాన్ని అందరి కోసం ఖర్చు చేయాలన్న సంకల్పం మహా గొప్పదిగా చెప్పాలి. ఆ విషయంలో గేట్స్ ను గొప్పోడిగా చెప్పక తప్పదు.