Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం ... స్విస్‌ టెక్నాలజీతో పేదలకు ఇల్లు !

By:  Tupaki Desk   |   23 March 2020 8:10 AM GMT
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం ... స్విస్‌ టెక్నాలజీతో పేదలకు ఇల్లు !
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రాష్ట్రంలో ప్రతి పేదవారికి ఇల్లు కట్టించి ఇవ్వాలనే దృఢనిచ్ఛయంతో ఉన్న ఏపీ ప్రభుత్వం ..పేదల కోసం నిర్మించే ఇళ్లకు ఇండో–స్విస్‌ సాంకేతికతతోపాటు ఇంధన సామర్థ్య టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ విధానం వల్ల విద్యుత్‌ ఆదాతోపాటు కొత్తగా నిర్మించే ఇళ్లల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 8 డిగ్రీల వరకు తగ్గుతాయని గుర్తించారు. ఈ ప్రాజెక్టు గురించి వివరించేందుకు బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ అధికారులు ఇటీవల రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ తో భేటీ అయ్యారు.

దేశంలో తొలిసారిగా ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌ రెసిడెన్షియల్‌ ప్రకారం.. ఇండో స్విస్‌ ఇంధన సామర్థ్య సాంకేతికతను బలహీనవర్గాల గృహాలకు అందజేస్తామని తెలిపారు. హౌసింగ్, రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ, బీప్‌ అధికారులతో అజయ్‌ జైన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌ రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

అసలు ఈ ఈసీబీసీఆర్‌ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల గృహ నిర్మాణ వ్యయం తగ్గుతుందని బీఈఈ తెలిపింది. 30 లక్షల ఇళ్లలో ఎల్‌ ఈడీ లైట్లు, అత్యుత్తమ ఇంధన సామర్థ్యం కలిగిన ఫ్యాన్లు, ఇతర ఎనర్జీ సామర్థ్య ఉపకరణాలను అమర్చేందుకు సహకరించాల్సిందిగా ఏపీ స్టేట్‌ ఎనర్జీ ఎఫిషిఎన్సీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కోరారు. దేశంలో ఈసీబీసీ రెసిడెన్షియల్‌ కోసం కేంద్ర ప్రభుత్వం 3 రాష్ట్రాలను నామినేట్‌ చేయగా, వాటిలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది అని తెలిపింది.

అసలు ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి సమాచారం ఏమిటి అంటే ... పేదలు, బలహీనవర్గాలకు 14వేల 97 జగనన్న కాలనీల పేరుతో 30 లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ ఇళ్లల్లో హాల్, బెడ్‌ రూమ్, కిచెన్, టాయిలెట్‌ వంటి సౌకర్యాలు ఉంటాయి. అలాగే ఇంటి మొత్తం విస్తీర్ణంలో 16.66 శాతం ఓపెన్‌ ఏరియా ఉంటుంది. ఇండో–స్విస్‌ టెక్నాలజీతో ఇళ్లు కట్టడం వల్ల పగటిపూట ఇంటి లోపల సహజసిద్ధమైన వెలుతురు పెరుగుతుంది. కానీ చల్లదనం మాత్రం ఉంటుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో తయారు చేసిన ఇంధన ఆదా చేయగల విద్యుత్‌ ఉపకరణాలనే అమరుస్తారు. ఇల్లు చల్లగా ఉండటం, ఇంకోవైపు వాడే ఉపకరణాలు విద్యుత్‌ను ఆదా చేయడం వల్ల తక్కువ విద్యుత్‌ బిల్లులు వచ్చే అవకాశం ఉంది. స్విస్‌ టెక్నాలజీ వల్ల ఇంట్లో ఉష్ణోగ్రత 4 నుంచి 8 డిగ్రీల వరకు తగ్గుతుంది. కాబట్టి ఏసీలు, కూలర్లు అంతగా వాడాల్సిన అవసరం ఉండదు. ఈ మేరకు స్విట్జర్లాండ్‌ కంపెనీలు టెక్నికల్ నాలెడ్జ్‌ ను ఆంధ్రప్రదేశ్‌ కు అందిస్తుంది.