Begin typing your search above and press return to search.

ఓటుకు నోటులో మరో తమ్ముడికి అరెస్ట్ ముప్పు?

By:  Tupaki Desk   |   11 Feb 2016 4:25 AM GMT
ఓటుకు నోటులో మరో తమ్ముడికి అరెస్ట్ ముప్పు?
X
తమ్ముళ్లను వణికించిన ఓటుకు నోటు ముప్పు పూర్తిగా తొలిగిపోలేదా? అంటే అవుననే చెబుతున్నారు. తాత్కాలిక రాజీ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరిగినా.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న మాటకు తగ్గట్లే తాజా పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం. ఆ మధ్య తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీటీడీపీ నేత వేం నరేంద్రరెడ్డిని గెలిపించేందుకు వీలుగా నామినేటెడ్ ఎమ్మెల్యే వేం నరేంద్రర్ రెడ్డిని గెలిపించుకోవటానికి వీలుగా టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి డబ్బు ఇవ్వబోయి కెమేరా కంటికి దొరికిపోవటం.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల సంగతి తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించిన ఒక దశలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు వినిపించింది. అనంతరం ఈ వివాదం సద్దుమణిగినట్లు కనిపించినా పూర్తిగా సమిసిపోలేదన్న మాట తాజా పరిణామాల నేపథ్యంలో స్పష్టమవుతోంది. ఓటుకు నోటు కేసులో నగరానికి చెందిన ఒక టీటీడీపీ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లుగా బలమైన ఆధారాలు లభించాయని చెబుతున్నారు.

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఎమ్మెల్యే చంద్రబాబుకు అత్యంత విధేయుడిగా చెబుతారు. తెలంగాణ అధికారపక్షం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఆయన్ను ఏ మాత్రం ఆకర్షించలేకపోయిందన్న మాట వినిపిస్తున్న సమయంలోనే.. ఓటుకు నోటు కేసు తెర మీదకు రావటం గమనార్హం. ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే టీటీడీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి.. సంద్ర వెంకట వీరయ్యలు అరెస్ట్ కావటం.. అనంతరం బెయిల్ లభించటం తెలిసిందే.

ఓటుకు నోటు వ్యవహారంలో సదరు ఎమ్మెల్యే పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించాయని.. అరెస్ట్ చేయటమే తరువాయిగా చెబుతున్నారు. హైదరాబాద్ నగర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కీలకభూమిక పోషిస్తున్న ఈ ఎమ్మెల్యే అరెస్ట్ బాబును మరింత ఇబ్బందుల్లో నెట్టే వీలుందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. గత కొద్దికాలంగా తెర మీదకు రాని ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే జరిగితే.. ఇద్దరు చంద్రుళ్ల మధ్య లొల్లి షురూ అయినట్లేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు టీటీడీపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తారా? లేదా? అన్న విషయంపై సందిగ్థం వ్యక్తమవుతోంది.