Begin typing your search above and press return to search.

మునుగోడు కాంగ్రెస్‌కు మ‌రో ప‌రీక్ష‌.. అసంతృప్తుల అల‌క తీర్చేదెలా?

By:  Tupaki Desk   |   10 Sep 2022 11:30 PM GMT
మునుగోడు కాంగ్రెస్‌కు మ‌రో ప‌రీక్ష‌.. అసంతృప్తుల అల‌క తీర్చేదెలా?
X
తెలంగాణ కాంగ్రెస్‌కు ఒక‌టి త‌ర్వాత‌.. ఒక‌టి స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌వ‌హారం కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారింది. దీని నుంచి తాడో పేడో తెంచుకుని బ‌య‌ట‌ప‌డినా.. ఇప్పుడు సొంత పార్టీ నేత‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్న అసంతృప్తి సెగ‌ల‌ను త‌ట్టుకునేదెలా ? అనే చ‌ర్చ కాంగ్రెస్‌లో జోరుగానే సాగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక అనివార్య‌మైన నేప‌థ్యంలో కాంగ్రెస్ ఇక్క‌డ అభ్య‌ర్థి ఎంపిక‌పై బాగానే క‌స‌ర‌త్తు చేసింది సిట్టింగ్ సీటు కావ‌డంతో ఎలాగైనా గెలుచుకుని తీరాల‌నేది కాంగ్రెస్ ప‌ట్టుద‌ల‌గా ఉంది.

దీనికితోడు.. ఇత‌ర నాయ‌కులు కూడా భారీగానే పోటీ ప‌డ్డారు. మాకంటే మాకేన‌ని.. వారివారి చానెళ్ల‌లో ప్ర‌చారం చేసుకున్నారు. అయితే.. చివ‌ర‌కు పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి కుమార్తె స్ర‌వంతికి సీటు ద‌క్కింది. ఇదే ఇప్పుడు మ‌రింత ఇబ్బందిగా మారింది. టికెట్ ఆశించిన వారు తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు. వాస్త‌వానికి ఈ టికెట్‌ను చెల‌మ‌ల కృష్నారెడ్డి, ప‌ల్లె ర‌వి, కైలాష్ వంటి స్థానికంగా బ‌లం ఉన్న నాయ‌కులు ఆశించారు. అయితే.. దీనిని ఎటూ తేల్చ‌లేక‌.. స్థానిక కాంగ్రెస్ నాయ‌క‌త్వం.. అధిష్టానానికి అభ్య‌ర్థి ఎంపిక బాధ్య‌త‌ను అప్ప‌గించేసింది.

దీంతో గ‌త ఉప ఎన్నిక‌ల్లో చేసిన త‌ప్ప‌దాలు జ‌ర‌గ‌కూడ‌ద‌ని భావించిన కాంగ్రెస్.. ఇత‌ర ప్ర‌త్య‌ర్థి పార్టీలైన బీజేపీ, టీఆర్ ఎస్ క‌న్నా.. ముందుగానే.. అభ్య‌ర్థిని ఖ‌రారు చేస్తూ.. పాల్వాయి స్ర‌వంతిని ప్ర‌క‌టించింది. దీంతో టికెట్‌నుఆశించిన వారు.. తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు. ఇప్పుడు వీరి స‌హ‌కారం లేక‌పోతే.. స్ర‌వంతి గెలుపు అంత ఈజీకాద‌నేది పార్టీ నేత‌ల ఆలోచ‌న‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా వారిని బుజ్జ‌గించేందుకు రాష్ట్ర పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఎన్నికల్లో కలిసి పని చేయాలని రేవంత్ రెడ్డి నేతలకు సూచించారు.

అయితే.. వారు మాత్రం ఉఊ అంటున్నార‌నేది పార్టీ లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ``మేం పార్టీలో అనేక సంవ‌త్స‌రాలుగా ప‌నిచేస్తు న్నాం. క‌నీసం.. మాకు ఇత‌ర నామినేటెడ్ ప‌ద‌వుల హామీ కూడా ఇవ్వ‌కుండా.. ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకున్నారు`` అని చెల‌మ‌ల కృస్ణారెడ్డి అన్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రో ఇద్ద‌రు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఇది కూడా నిజ‌మే. టికెట్ ఆశించిన వారిని బుజ్జ‌గించే క్ర‌తువు చేప‌ట్ట‌కుండానే.. వారి ఆమోదం తీసుకోకుండానే అధిష్టానం.. తాంబూలాలిచ్చేశాం.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించింద‌నే టాక్ వినిపిస్తోంది.

ఈ ప‌రిణామాల‌తో కాంగ్రెస్ ప్ర‌చారం ఏ విధంగా ఉంటుంద‌నే ఇప్పుడు మునుగోడులో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రోవైపు ఆదివారం నుంచి నుంచి మునుగోడు ప్రచారానికి వెళ్లాల‌ని.. ప్రచారం ముమ్మ‌రం చేయాల‌ని.. కాంగ్రెస్ నాయ‌కులు ఇప్ప‌టికే రెడీ అయ్యారు. అయితే.. కీల‌క నేత‌లు రంగంలోకి దిగుతున్నా.. స్థానికంగా ప‌ట్టున్న వారు లేకుండా ప్ర‌చారం జ‌రిగితే.. పార్టీకి ఇబ్బందేననే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి రేవంత్ ఎలా బుజ్జ‌గిస్తారో చూడాలి. ఇప్పుడు స్ర‌వంతి గెలుపు క‌న్నా.. పార్టీలో నేత‌ల ఐక్య‌త ముఖ్య‌మ‌ని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.