Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో మరో విషాదం : ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం .. నలుగురు మృతి

By:  Tupaki Desk   |   28 April 2021 9:20 AM IST
మహారాష్ట్రలో మరో విషాదం : ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం .. నలుగురు మృతి
X
మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా వరుసగా పలు విషాదకరమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభణ , కరోనా మరణాలతో అల్లాడిపోతుంటే , మరోవైపు హాస్పిటల్స్ లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా థానేలో బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు రోగులు సజీవ దహనమయ్యారు. థానేలోని ప్రైమ్‌ క్రిటికేర్‌ ఆస్పత్రిలో ఈ రోజు తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. ఆసుపత్రిలో మంటలు వ్యాపించి అగ్నిప్రమాదం చోటుచేసుకుందని థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారి వెల్లడించారు.

ఆస్పత్రి మొదటి అంతస్థులో ఈ ప్రమాదం చోటుచేసుకున్న వెంటనే ,కొద్ది సమయంలోనే 3 ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. 2 వాటర్ ట్యాంకర్లు, ఓ రెస్క్యూ వాహనాన్ని తెచ్చారు. అలాగే ఐదు అంబులెన్సుల్లో పేషెంట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోవిడ్‌ రోగులతో పాటు ఇతర బాధితులను మరో ఆస్పత్రికి తరలిస్తుండగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.ఇటీవల రెండ్రోజుల క్రితం కూడా థానేలోని వేదాంత్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత కారణంగా ఐదుగురు కొవిడ్‌ బాధితులు మరణించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ముంబైలోని అన్ని ఆస్పత్రుల్లో ఫైర్, ఇతరత్రా సదుపాయాలు ఎలా ఉన్నాయో ఆడిట్ చెయ్యమని నిన్న మహారాష్ట్ర మంత్రి ఎకనాథ్ షిండే అధికారులకి ఆదేశాలు జారీచేశారు. ఇంతలోనే ఈ ఘోర ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.