Begin typing your search above and press return to search.

ఎవరీ మెహుల్ చోక్సీ.. పీఎన్.బీ స్కాంలో ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   1 Jun 2021 4:30 AM GMT
ఎవరీ మెహుల్ చోక్సీ.. పీఎన్.బీ స్కాంలో ఏం జరిగింది?
X
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిందితుడు మెహుల్ చోక్సీ ప్రస్తుతం కరీబియన్ ద్వీప దేశం డొమినికాలో జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. ‘గర్ల్ ఫ్రెండ్’తో సరదాగా గడుపుదామనో..లేక డిన్నర్ కోసమో కానీ చోక్సీ ఒక యువతి హానీ ట్రాప్ లో పడి డొమినికాకు బోటులో వెళ్లాడని ప్రచారం సాగుతోంది. అక్కడ పోలీసులకు దొరికిపోయినట్టు చెబుతున్నారు.

*పీఎన్బీకి ఎంత ఎగ్గొట్టారు?
పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఏకంగా 13500 కోట్ల రూపాయల రుణం తీసుకొని తీర్చకుండా ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయాడు మెహుల్ చోక్సీ(60), నీరవ్ మోడీ(48).. వీరిద్దరూ మామ అల్లుల్లు. ఇది దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచింది. ప్రధాన నిందితుల్లో ఒకడైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ డొమినికా రిపబ్లిక్ దేశంలో పోలీసులకు పట్టుబడ్డాడు. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి దేశం వదిలి ఇతడు పారిపోయాడు.

*సీబీఐ దర్యాప్తు
ఈ కేసులో దర్యాప్తును ప్రారంభించిన సీఐడీ, ఈడీ పలు చార్జ్ షీట్లను నమోదు చేయడంతోపాటు కుటుంబ సభ్యుల పేర్లను కూడా చేర్చింది. పలు విదేశీ, స్వదేశీ ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నీరవ్ మోడీ బ్రిటన్ లో తలదాచుకుంటున్నాడు. గత ఏడాది లండన్ లో అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం వాండ్స్ వర్త్ జైలులో ఉన్న నీరవ్ మోడీని దేశానికి తిరిగి రప్పించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది.

*మెహుల్ కరేబియన్ దేశాలకు పారిపోయాడు
నిజానికి ఈ మోసం వెలుగుచూడగానే నీరవ్ మోడీతోపాటు ఆయన మామ మెహుల్ చోక్సీ సైతం పక్కా స్కెచ్ గీశారు. 62 ఏళ్ల చోక్సీ స్కాంకు ముందే పలు దేశాల పౌరసత్వం తీసుకున్నాడు. అంటిగ్వా, క్యూబాల్లో చోక్సీకి ఆస్తులు పౌరసత్వం ఉంది. చోక్సీ అక్కడి నుంచి క్యూబాకు వెళ్లాలని స్కెచ్ గీశాడు. ఈలోపు అంటిగ్వా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో చోక్సీని గుర్తించిన డొమినికా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.