Begin typing your search above and press return to search.

గర్ల్ ఫ్రెండ్ కాదంటూ సర్టిఫికేట్ ఇచ్చిన ఛోక్సీ వైఫ్.. అయినా తప్పులో కాలేశారు

By:  Tupaki Desk   |   3 Jun 2021 3:50 AM GMT
గర్ల్ ఫ్రెండ్ కాదంటూ సర్టిఫికేట్ ఇచ్చిన ఛోక్సీ వైఫ్.. అయినా తప్పులో కాలేశారు
X
నిజానికి ఉన్న దరిద్రమైన లక్షణం.. అది ఉత్తినే కూర్చోదు. ఏదోలా అందరికి తెలిసేలా చేస్తుంది. ఈ కారణంతోనే నిజాన్ని దాచి.. అబద్ధాన్ని చెప్పినప్పుడు ఒక అబద్ధానికి వంద అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఉన్న నిజాన్ని ఏదో రూపంలో చెప్పేసే పరిస్థితి. తాజాగా వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అయ్యగారి ఎపిసోడ్ కు సంబంధించి ఆయన సతీమణి తాజాగా స్పందించారు.

ఆయన వెంట డొమినికాలో ఉన్న మహిళ.. గర్ల్ ఫ్రెండ్ కాదంటూ సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. భారత్ లోని బ్యాంకులకు భారీగా టోపీ పెట్టి.. చెప్పా పెట్టకుండా దేశం విడిచి పెట్టి వెళ్లిపోయి.. ఆంటిగ్వా - బార్బుడాలో సెటిల్ కావటం.. ఆ దేశ పౌరసత్వాన్ని తీసుకోవటం తెలిసిందే. ఇదిలా ఉండగా ఒక రాత్రి ఆంటిగ్వా నుంచి డొమినికా దేశానికి వెళ్లటం.. అక్కడ అపహరణకు గురి కావటం.. ఆ వెంటనే అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకొని జైల్లో ఉంచటం తెలిసిన విషయాలే.

ఈ ఉదంతంలో ఛోక్సీ వెంట ఒక మహిళ ఉందని.. ఆమెతో విందు కోసం వెళ్లిన ఛోక్సీ అడ్డంగా బుక్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని ఆంటిగ్వా దేశ ప్రధాని గస్టన్ బ్రౌనే చెప్పటం సంచలనంగా మారింది. ఇలాంటివేళ రంగంలోకి దిగిన ఛోక్సీ సతీమణి.. తన భర్త వెంట ఉన్న మహిళ గర్ల్ ఫ్రెండ్ కాదంటూ డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. తన భర్త విషయంలో మానవ హక్కుల్ని విస్మరించి హింసకు గురి చేయటం తమ కుటుంబాన్ని ఆవేదనకు గురి చేస్తోందన్నారు. తన భర్తకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. ఆయన్ను సజీవంగా రప్పించాలని భావించినప్పుడు హింసించాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు.

భర్త తరపున వకల్తా పుచ్చుకొని మాట్లాడిన ఆమె.. తన భర్త సుద్దపూస అన్నట్లుగా మాట్లాడటంబాగానే ఉన్నా.. మాటల మధ్యలో ఆమె చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. డొమినికాకు వెళ్లిన తన భర్త వెంట ఉన్న మహిళ అందరికి తెలిసిన వ్యక్తేనని చెప్పారు. ఆ దేశానికి వెళ్లిన సందర్భాల్లో తన భర్తతో కలిసి వాక్ చేయటం ఆమెకు అలవాటుగా చెప్పటం ఆసక్తికరంగా మారింది. గర్ల్ ఫ్రెండ్ కాదంటూనే.. యధాలాపంగా ఛోక్సీ సతీమణి నోటి నుంచి రావాల్సిన నిజం వచ్చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.