Begin typing your search above and press return to search.

మిగిలిన ఆరుగురిలోనూ జంపింగ్స్ ప‌క్కాన‌ట‌!

By:  Tupaki Desk   |   8 Jun 2019 2:30 PM GMT
మిగిలిన ఆరుగురిలోనూ జంపింగ్స్ ప‌క్కాన‌ట‌!
X
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మ‌హా ఇబ్బందిక‌రంగా మారుతోంది. ఒక‌ప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్ని ప‌దేళ్ల పాటు ఏలిన కాంగ్రెస్‌.. త‌న ఉనికిని మ‌రింత బ‌లోపేతం చేసుకోవ‌టంలో భాగంగా.. ఏపీని రెండు ముక్క‌లు చేయాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకోవ‌టం తెలిసిందే. రాష్ట్రాన్ని రెండు ముక్క‌లు చేయ‌టం ద్వారా.. తెలంగాణ‌లో తిరుగులేని శ‌క్తిగా తాము ఆవిర్భవిస్తామ‌ని భావించింది.

కాంగ్రెస్ ఒక‌టి త‌లిస్తే.. దేవుడు మ‌రొక‌టి త‌ల‌చిన‌ట్లుగా.. కాంగ్రెస్ మీద త‌మ‌కున్న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు తెలంగాణ ప్ర‌జ‌లు. 2014 ఎన్నిక‌ల‌తో పోలిస్తే.. 2018లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌రింత దారుణ‌మైన ఫ‌లితాల్ని ఇచ్చిన తెలంగాణ ప్ర‌జ‌లు ఒక ఎత్తు అయితే.. ప్ర‌త్య‌ర్థిని చీల్చి చెండాడే తీరున్న గులాబీ బాస్ కేసీఆర్ పుణ్యామా అని పార్టీ ఉనికే ప్ర‌మాదంలో ప‌డిన ప‌రిస్థితి.

మొన్న‌టికి మొన్న 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఏకంగా 12 మందిని గులాబీ కారులో ఎక్కించేశారు. మిగిలిన ఆరుగురిలోనూ మ‌రో ఇద్ద‌రు గులాబీ కారులో జంప్ కావ‌టం ఖాయ‌మంటున్నారు. సీఎల్పీలో చీలిక తీసుకురావ‌టం ద్వారా.. తెలంగాణ అధికార‌ప‌క్షంలో కాంగ్రెస్ పార్టీ చీలిక విభాగాన్ని క‌లిపేశారు. ఇదిలా ఉండ‌గా తాజాగా మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు గులాబీ కారు ఎక్కేందుకు ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష హోదాను కోల్పోయిన కాంగ్రెస్.. ఇప్ప‌టికే విల‌విల‌లాడుతుంటే.. తాజాగా మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కూడా జంప్ అవుతున్న ప‌రిస్థితి వారికి ఇబ్బందిక‌రంగా మారుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే పోడెం వీర‌య్య తో పాటు.. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి కూడా గులాబీ పార్టీలోకి చేరిపోతార‌ని చెబుతున్నారు. అదే జ‌రిగితే మాత్రం తెలంగాణ‌లో కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ ఖాయ‌మంటున్నారు. అయితే.. జ‌గ్గారెడ్డి పార్టీలోకి రావ‌టంపై కేసీఆర్ మొగ్గు చూప‌టం లేద‌ని తెలుస్తోంది. దీంతో.. ఆయ‌న స్థానంలో మ‌రొక‌రి మీద వ‌ల విసిరే కార్య‌క్ర‌మాన్ని పెట్టుకుంటార‌ని చెబుతున్నారు.

తాజాగా చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో సీట్ల విష‌యంలో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదురుకానుంది. అసెంబ్లీ స‌మావేశాల్లో వారికి స్థానాలు చివర్లో ఏర్పాటు చేస్తార‌ని.. భ‌ట్టి లాంటి సీనియ‌ర్లు ఇలాంటి ట్రీట్ మెంట్ ఇబ్బందిక‌రం కానుంద‌ని తెలుస్తోంది.