Begin typing your search above and press return to search.

తెలంగాణకు మరో కేంద్ర మంత్రి.. అవకాశం ఎవరికంటే?

By:  Tupaki Desk   |   6 Jan 2023 4:06 AM GMT
తెలంగాణకు మరో కేంద్ర మంత్రి.. అవకాశం ఎవరికంటే?
X
తాము టార్గెట్ చేసిన రాష్ట్రంలో కాషాయ జెండాను ఎగరేసే వరకు నిద్రపోని తత్త్వం మోడీషాలకు ఎంతన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు డిసైడ్ అయిపోయి.. సామదాన దండోపాయాలను ప్రయోగించినా ఒక పట్టాన లొంగని రాష్ట్రాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఆ జాబితాలో మొదటి వరుసలో నిలుస్తుంది పశ్చిమ బెంగాల్. అదే రీతిలోమరికొన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ.. తమ టార్గెట్ కు తగ్గట్లే ఫలితాల్ని సొంతం చేసుకున్న స్టేట్లే ఎక్కువని చెప్పాలి.

గడిచిన కొంతకాలంగా తెలంగాణను టార్గెట్ చేయటమే కాదు.. ఈ ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పాగా వేసేందుకు కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. మనసులో ఆశ ఉన్నప్పటికీ.. పెద్దగా ఆసక్తి చూపని తెలంగాణ రాష్ట్రాన్ని ఈసారి మాత్రం సంగతి చూడాల్సిందే అన్న కోటాలోకి మార్చేయటం తెలిసిందే. గడిచిన కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలన్ప పట్టుదలతో ఉన్నారు మోడీషాలు.

అందులో భాగంగా ఇప్పటికే రంగాన్ని సిద్ధం చేసిన వారు.. అందుకుతగ్గట్లే పావులు కదుపుతున్నారు. మరో ఏడాది తర్వాత సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉన్న నపథ్యంలో మోడీ సర్కారు.. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీల్లో మరొకరిని కేంద్ర కేబినెట్ లోకి చేర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణతో పాటు.. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహం మీద నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఈ నెల 16-17 తేదీల్లో ఢిల్లీలో జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దీనికి సంబంధించిన నిర్ణయం తప్పక ఉంటుందంటున్నారు.

ఈ ఏడాది కర్ణాటక.. తెలంగాణ.. మధ్యప్రదేశ్.. రాజస్థాన్.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో ఇప్పటికే అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్.. కర్ణాటకలో పవర్ ను నిలబెట్టుకోవటం.. తెలంగాణలో అధికారంలోకి రావటం తప్పనిసరిగా భావిస్తున్నారు. మిగిలిన రాజస్థాన్.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను ఓడించటమే లక్ష్యమన్నట్లుగా కమలనాథులు ప్లానింగ్ ఉంది. తెలంగాణవిషయానికి వస్తే ఇప్పటికే రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

ఆయనకు తోడుగా మరొకరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవటం ద్వారా.. తెలంగాణ బీజేపీ నేతల్లో స్థైర్యాన్ని పెంచాలన్నది అధినాయకత్వ ఆలోచనగా చెబుతున్నారు. వీరిలో బండి సంజయ్.. అరవింద్ తో పాటు ఇటీవల యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన డాక్టర్ లక్ష్మణ్ ను కూడా పరిగణలోకి తీసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది. రేసులో ఉన్న ముగ్గురు బీసీ వర్గానికి చెందిన వారు కావటంతో.. వారికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తే మేలు జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది.

ఒక వేళ బండి సంజయ్ కు కేబినెట్ లో చోటు దక్కితే.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన స్థానాన్ని ఈటల రాజేందర్ తో భర్తీ చేస్తారని చెబుతున్నారు. ఏమైనా.. తెలంగాణకు తామిచ్చే ప్రాధాన్యత ఏంతన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేయటమే కాదు.. కేసీఆర్ సర్కారు మీద పోరు చేసే కమలనాథులకు మరింత స్థైర్యాన్ని ఇవ్వటమే మోడీషాల ఉద్దేశమని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.