Begin typing your search above and press return to search.

దేశంలో మరో వేరియంట్ ... కర్ణాటకలో తొలి కేసు నమోదు !

By:  Tupaki Desk   |   7 Aug 2021 6:50 AM GMT
దేశంలో మరో వేరియంట్ ... కర్ణాటకలో తొలి కేసు నమోదు !
X
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజుకో కొత్త రకం వేరియంట్స్ వెలుగులోకి వస్తున్నాయి. వివిధ దేశాలకు వ్యాపిస్తోంది. తొలిసారి 2019 డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి.. రోజుకో కొత్త రూపం దాల్చుతోంది. భారత్‌లో తొలిసారి గుర్తించిన డెల్టా వేరియంట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 135 దేశాలకు విస్తరించింది. ఇదిలా ఉండగా, బ్రిటన్లో తొలిసారి గుర్తించిన 'ఈటా వేరియంట్' భారత్లో ప్రవేశించింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈటా వేరియంట్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కరోనా వేరియంట్లలో ఒకటైన ఇటా వేరియంట్ కర్ణాటక లోని మంగళూరులో ఓ వ్యక్తిలో బయటపడింది.

తొలిసారి బ్రిటన్ లో వెలుగు చూసిన ఈటా వేరియంట్ను మంగళూరుకు చెందిన ఓ వ్యక్తి నమూనాల్లో ఉన్నట్టు జన్యు పరీక్షల్లో తేలిందని పేర్కొన్నారు. నాలుగు నెలల కిందట బాధితుడు దుబాయ్ నుంచి దక్షిణ కన్నడ జిల్లాలోని మూదబిద్రే గ్రామానికి వచ్చినట్లు వైద్యులు వెల్లడించాయి. కరోనా లక్షణాలు బయటపడటంతో నిర్ధారణ పరీక్షలో కరోనా వైరస్ పాజిటివ్‌ గా వచ్చిందని వివరించారు. చికిత్స అనంతరం అతడు కరోనా నుంచి కొద్ది రోజుల తర్వాత కోలుకున్నట్లు చెప్పారు. అతడితో సన్నిహితంగా ఉన్న 100 మందికిపైగా గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జన్యు విశ్లేషణ పరిశోధనలో భాగంగా అతడి రక్త నమూనాలను సేకరించి ల్యాబొరేటరీకి పంపామని, ఆ వ్యక్తిలో కొత్త రకం ఈటా వేరియంట్ బయటపడినట్లు చెప్పారు. ఈ వేరియంట్‌పై మరింత పరిశోధన కోసం శాంపిల్స్‌ని పంపినట్లు కర్ణాటక వైద్య, ఆరోగ్య తెలిపింది.

తొలిసారి బ్రిటన్, నైజీరియాలో ఈ రకం వేరియంట్ బయటపడింది. ఎక్కువ కేసులు నైజీరియాలో నమోదయ్యాయి. దీన్ని B.1.525 అని పిలుస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు. ఇది డెల్టా వేరియంట్ అంత వేగంగా ఇది వ్యాప్తి చెందలేదనే అభిప్రాయపడ్డారు. ఈ రకం వైరస్ ఈ సంవత్సరం మార్చి 5 నాటికి ఇది 23 దేశాలకు విస్తరించి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తేనే ఈ వేరియంట్ ఎంతమేర ప్రమాదకరమో తెలుస్తుంది. ఇదిలావుంటే, కొత్త వేరియంట్ ఈటా వెలుగుచూడటంతో హెల్త్ డిపార్ట్‌మెంట్ అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతానికి ఆ దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి ఎవర్ని కలిశాడు, వాళ్లు ఎక్కడెక్కడ ఉన్నారో ట్రేసింగ్ చేస్తున్నారు

కాగా, డెల్టా వేరియంట్ రూపంలో దేశంలో కరోనా వైరస్ ముప్పు కొనసాగుతూనే ఉంది. చిన్నారుల్లో కూడా ఈ వేరియంటే ప్రధానంగా కనిపిస్తోంది. రెండో దశ వ్యాప్తి వేళ కర్ణాటకలో నిర్వహించిన జన్యువిశ్లేషణల ఆధారంగా నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా సోకిన పిల్లల్లో విలక్షణమైన వేరియంట్ ఏదీ లేదు.. డెల్టానే ప్రధానంగా కనిపిస్తోంది అని ప్రొఫెసర్ రవి మీడియాకు వెల్లడించారు. కర్ణాటకలో చిన్నారుల నుంచి సేకరించిన నమూనాల్లోని వైరస్‌ జన్యు విశ్లేషణపై ఆయన పరిశోధనలు కొనసాగిస్తున్నారు. కర్ణాటకలో 77 శాతం ఇన్ఫెక్షన్లకు డెల్టా వేరియంటే కారణమని తేలింది. మొత్తం 1,413 కేసులకు గానూ 1,089 కేసుల్లో డెల్టా వేరియంట్‌ను గుర్తించినట్లు వెల్లడైంది. అలాగే 159 కప్పా, 155 ఆల్ఫా, ఏడు బీటా, మూడు డెల్టా ప్లస్ వేరియంట్‌ కేసులు బయటపడ్డాయి.

దేశంలో నిన్న 38,628 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 40,017 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,95,385కు చేరింది. ఇక మరణాల విషయానికొస్తే... నిన్న 617 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,27,371కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,10,55,861 మంది కోలుకున్నారు. 4,12,153 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌ లలో చికిత్స అందుతోంది. నిన్న 49,55,138 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 50,10,09,609 వ్యాక్సిన్ డోసులు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.