Begin typing your search above and press return to search.

ఆనం బాటలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   4 Jan 2023 6:37 AM GMT
ఆనం బాటలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X
వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి బాటలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నారైలు ఎంతో సేవ చేస్తున్నారని.. వారిని అడ్డుకుంటే సేవ చేయడానికి ఎవరు వస్తారని మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. కొద్ది రోజుల క్రితం గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్‌ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సంస్థ పై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన యన్టీఆర్‌ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సేవను రాజకీయ కారణాలతో విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు. కొంత మంది వ్యక్తులు ఎన్నారైలను వారి పనులు వారు చూసుకోవాలని సలహా ఇస్తున్నారంటూ పరోక్షంగా కొడాలి నాని వ్యాఖ్యలని తప్పుబట్టారు. ఎన్నారైలను భయపెడితే ఎలా అని ప్రశ్నించారు. ఇలాగైతే వారు సేవా కార్యక్రమాలెలా చేస్తారన్నారని కృష్ణప్రసాద్‌ ప్రశ్నించారు.

ప్రవాసులతో దేశంలో చాలా అభివృద్ధి జరుగుతోందని వసంత కృష్ణప్రసాద్‌ గుర్తు చేశారు. ప్రవాసుల సాయాన్ని ఆపాలనుకోవటం అవివేకమవుతోందన్నారు.

కాగా గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ నిర్వహించిన ప్రవాస భారతీయుడు, ఉయ్యూరు ఫౌండేషన్‌ నిర్వాహకుడు ఉయ్యూరు శ్రీనివాస్‌ మంచి వ్యక్తి అని తెలిపారు. ఆయన తనకు చాలాకాలంగా స్నేహితుడని చెప్పారు. గుంటూరులో రాజకీయ వేదికపైకి వచ్చారనే ఉద్దేశంతో కావాలని శ్రీనివాస్‌పై ఉన్నవి, లేనివి కల్పించి చెప్పి రాద్ధాంతం చేస్తున్నారని వసంత మండిపడ్డారు.

గతంలో చాలా మంది దుస్తుల పంపిణీ తదితర అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారని గుర్తు చేశారు. పేదల పట్ల అభిమానం ఉన్న శ్రీనివాస్‌ పెద్ద ఎత్తున కార్యక్రమం చేయబోయి ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ప్రజలకు కష్టం కలగాలని ఎవరూ కోరుకోరని వివరించారు. ఆయన మంచి మనిషని, పేదలకు అండగా ఉన్నారని వివరించారు.

గుంటూరు సంఘటన అనంతరం ఎన్నారైలకు సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని, కొడాలి నాని వంటివారు ఎన్నారైలు వారు పని వారు చూసుకోక వారికి రాజకీయాలు ఎందుకని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత ఇలా మాట్లాడటం గమనార్హం.

పైగా గుంటూరు ఘటనను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ వైసీపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు, విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ సభ్యుడే ప్రభుత్వ చర్యలను తప్పుబడుతున్నట్లు మాట్లాడటం హాట్‌ టాపిక్‌ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.