Begin typing your search above and press return to search.

కరోనా పేషెంట్లకు యాంటీ క్లాటింగ్‌ డ్రగ్..ఎందుకంటే‌ !

By:  Tupaki Desk   |   23 April 2020 12:30 PM GMT
కరోనా పేషెంట్లకు యాంటీ క్లాటింగ్‌ డ్రగ్..ఎందుకంటే‌ !
X
కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతూ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం మార్చేస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారి పై ఈ కరోనా మహమ్మారి పంజా విసరుతోంది. ఇక న్యూయార్క్ ‌లో మహమ్మారి సృష్టించిన బీభత్సం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే వేలాది మంది కరోనాతో మృత్యువాత పడగా... లక్షలాది మంది వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మౌంట్‌ సినాయ్‌ ఆస్పత్రి వైద్యులు పలు కీలక విషయాలు వెల్లడించారు. కరోనా వ్యాపించిన తొలినాళ్లలో డయాలసిస్ పేషెంట్లు - ఊపిరితిత్తుల ఇన్ ‌ఫెక్షన్ ‌తో బాధపడుతున్న వారి శరీరంలో రక్తం గడ్డకట్టడం గమనించామన్నారు.

ఈ విషయం గురించి నెఫ్రాలజిస్టులు, పల్మనాలజిస్టులు, న్యూరోసర్జన్లు చర్చించుకున్న తర్వాత వివిధ వ్యాధులతో బాధ పడుతున్న పేషెంట్లలో ఇలాంటి లక్షణాలే ఉన్నాయని గుర్తించామని, దీంతో రక్తం గడ్డకట్టకుండా రోగులకు మెడిసిన్‌ ఇస్తున్నామని తెలిపారు. ఈ విషయం గురించి న్యూరో సర్జన్‌ జే మోకో మాట్లాడుతూ.. ‘‘ లంగ్‌ డిసీజ్‌ కంటే కరోనా కలిగించే అనారోగ్యం తీవ్ర స్థాయిలో ఉంది. చిన్నా, పెద్ద అందరిపైనా దీని ప్రభావం ఉంటోంది. రక్తం గడ్డకట్టిన రోగులు చాలా మంది కరోనా తో బాధ పడుతున్నారు. నేను చికిత్స అందించిన 32 పేషెంట్లలో దాదాపు సగం మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇది ఆలోచించాల్సిన విషయం’’ అని తెలిపారు.

ఈ క్రమంలోనే మౌంట్‌ సినాయి ఆస్పత్రి వర్గాలు చైనాలోని హుబే ప్రావిన్స్‌ డాక్టర్లతో మాట్లాడి వైరస్‌ ప్రభావం గురించి ఒక అంచనాకు వచ్చారని తెలిపారు. కొంతమంది వైద్యులు బృందంగా ఏర్పడి ఈ విషయంపై పరిశోధనలు చేయగా, వైరస్‌ ప్రవేశించిన కారణంగానే చాలా మంది పేషెంట్లలో రక్తం గడ్డకట్టినట్లు తేలిందని, ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తమ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్‌ కేర్‌ విభాగంలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు రక్తాన్ని పలుచగా చేసే హెపారిన్‌ ఇస్తున్నామని తెలిపారు. అదే విధంగా కోవిడ్‌ నుంచి కోలుకున్న పేషెంట్ల నుంచి సేకరించిన ప్లాస్మాను ఎక్కిస్తున్నామన్నారు