Begin typing your search above and press return to search.

చోక్సీ పరారీ.. భారత్ పొరపాటే..!

By:  Tupaki Desk   |   4 Aug 2018 7:18 AM GMT
చోక్సీ పరారీ.. భారత్ పొరపాటే..!
X
భారత ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన నీరవ్ మోడీ మేనమామ మెహుల్ చోక్సీ కి పౌరసత్వం మంజూరు చేయడంలో తామేమీ తప్పు చేయలేదని ఆంటిగ్వా అండ్ బార్బూడా ప్రభుత్వం ప్రకటించింది. ఆయన 2017 మేలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడని.. భారత హోంశాఖ - సెబీ సానుకూల నివేదికలు ఇచ్చాయని పేర్కొంది. చోక్సీ ప్రస్తుతం తమ దేశ పౌరుడు కనుక ఆయనను దేశం నుంచి పంపించలేమని స్పష్టం చేసింది. చోక్సీకి పాస్ పోర్టు మంజూరు చేయడంలో పొరపాటు జరగలేదని పేర్కొంది.

భారత్ కోరుతున్నట్టు చోక్సీ పౌరసత్వం రద్దు చేయాలంటే చట్టబద్దమైన ప్రక్రియను చేపట్టవలసి ఉంటుందని.. ఆయన ప్రస్తుతం ఆంటిగ్వా చట్టాల రక్షణలో ఉన్నారని ఆంటిగ్వా అండ్ బార్బూడా తెలిపింది.

చోక్సీపై ప్రస్తుతం బ్యాంకులను మోసగించిన వ్యవహారంలో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఆంటిగ్వా ప్రభుత్వంతో భారత్ కు నేరస్థుల అప్పగింత ఒప్పందం లేకపోవడమే దీనికి కారణమని చెప్తున్నారు. చోక్సీ 2017నవంబర్ లో ఆంటిగ్వా పౌరసత్వం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నదీ తెలియజేయాలని భారత్ కోరినా ఆంటిగ్వా మాత్రం స్పందించడం లేదు.