Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రం ఎందుకు పండగ చేసుకుంటున్నారంటే..

By:  Tupaki Desk   |   27 Nov 2015 5:30 PM GMT
ఆ రాష్ట్రం ఎందుకు పండగ చేసుకుంటున్నారంటే..
X
భారత సంతతి బ్రిటిష్ పౌరుడు బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యేందుకు ఎక్కువ రోజులు పట్టవు అని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరూన్ ఏ ముహూర్తంలో వ్యాఖ్యానించారో గాని, ఆ అవకాశం మొదటగా పోర్చుగల్ తలుపు తట్టింది. కారణం. గోవా సంతతి పోర్చుగల్ నేత ఆంటోనియో కోస్టా తాజాగా పోర్చుగల్ ప్రధాని కావడమే. యావత్‍‌ భారత దేశం గతంలో బ్రిటిష్ ఏలుబడిలోకి రాగా ఒక్క గోవా మాత్రం స్వాతంత్ర్యానంతరం కూడా చాలా కాలంపాటు పోర్చుగీసుల పాలనలో ఉండి తర్వాత 1961వ సంవత్సరంలో భారత సైనిక చర్యతో విముక్తి పొందింది.

గతంలో తమను పాలించిన దేశానికి తమ సంతతి వ్యక్తే ప్రధాని కావడంతో గోవన్ల సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి, గోవా రాష్ట్రానికి చెందిన రమాకాంత్ ఖలాప్ ఈ పరిణామంపై వ్యాఖ్యానిస్తూ విధి తీర్చుకున్న ప్రతీకారంగా అభివర్ణించారు. తమను గతంలో పరిపాలించిన ఒక యూరోపియన్ దేశానికి తమ సంతతివాడే నేడు ప్రధాని కావడం కాలం తీర్చుకున్న ప్రతీకారం కాకపోతే మరేంటని ఈయన ప్రశ్నిస్తున్నారు.

బహుశా.. విధి తనకు తానుగా ప్రతీకారం తీర్చుకున్నట్లుంది. ఒకనాటి పాలితుడు నేడు పాలకుడయ్యాడు. ఇది గోవా ప్రజలకు మహత్తర దినం అని కాంగ్రెస్ నేత ఖలాప్ ఆనందం వ్యక్తీకరించారు. అభినందనలు ఆంటోనియో కోస్టా... ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోవన్ ప్రజలారా అభినందనలు.. ఆంటోనియో కోస్టా ప్రధాని పదవిలో సుదీర్ఘకాలం కొనసాగాలని ప్రార్థిద్దాం. అలాగే పలువురు గోవన్లు ఆయన అడుగుజాడల్లో నడిచి తమ తమ కార్యరంగాల్లో ప్రపంచ నేతలు కావాలి అంటూ ఖలాప్ ఆశాభావం ప్రకటించారు.

సోషలిస్టు నేత అయిన కోస్టాను ఈ మంగళవారం పోర్చుగల్ ప్రధానిగా ఆ దేశాధ్యక్షుడు నియమించారు. 54 ఏళ్ల ఆంటోనియో కోస్టా వారసత్వ గృహం గోవాలోని కోంబా-మార్గోవాలో ఉంది. ఆయన బంధువులు కొందరు నేటికీ మార్గోవాలో నివసిస్తున్నారు. దాదాపు 450 సంవత్సరాల పాటు పోర్చుగీస్ వలసపాలనలో ఉన్న గోవాను 1961 డిసెంబర్ 19న భారతీయ సైన్యం విముక్తి చేసింది.

విధి తీర్చుకున్న ప్రతీకారమో లేక కాలం ప్రకటించిన మహా నిర్ణయమో.. ఏదైతేనేం.. భారత (గోవా) సంతతి నేత ఒకరు ఏకంగా ఒక యూరోపియన్ దేశానికి ప్రధాని కావడం ప్రపంచ యవనికపై భారతీయుల భవిష్య ప్రభావాన్ని తిరుగులేకుండా చాటింది. అమెరికా దేశాధ్యక్ష పదవికి భారత సంతతి నేత బాబీ జిందాల్ పోటీపడి ఇటీవలే విరమించుకున్న విషయం తెలిసిందే. యూరప్, అమెరికాలలో భవిష్యత్తు భారతీయులదే అనే సత్యానికి ఇవి తిరుగులేని సంకేతాలు కావా మరి?