Begin typing your search above and press return to search.

భార్య‌ను చంపిన ఉగ్ర‌వాదుల‌పై ఓ పౌరుడి ప్రేమ‌

By:  Tupaki Desk   |   17 Nov 2015 3:11 PM GMT
భార్య‌ను చంపిన ఉగ్ర‌వాదుల‌పై ఓ పౌరుడి ప్రేమ‌
X
పారిస్‌ లో ఉగ్ర‌వాద మూక‌లు జ‌రిపిన విచక్షణారహితంగా కాల్పులే యావ‌త్ ప్ర‌పంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేశాయి. స‌మాజం మొత్తం ఈ ఘ‌ట‌న‌ను ఖండించింది. ఈ క్రూర చ‌ర్య‌కు బ‌ల‌యిన వారి కుటుంబ స‌భ్యుల‌ మాన‌సిక స్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి ఘ‌ట‌న‌తో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య‌ను కోల్పోయిన వ్య‌క్తి త‌న‌ భావాలను ఎలా వ్య‌క్తీక‌రిస్తాడు? ఇదేం ప్ర‌శ్న‌...ఉగ్ర‌వాదుల‌పై అలాంటి వారు ఎంత క‌సిగా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్పాలా....? అంటారా. అలా ద్వేషంతో మెజార్టీ ప్ర‌జ‌లు ఉంటారు. కానీ పారీస్ పౌరుడు ఒక‌రు పూర్తి భిన్నంగా స్పందించారు. త‌న భార్య‌ను చంపించిన వారిపై ద్వేషం ఏమాత్రం లేద‌ని ప్ర‌క‌టించాడు.

ఐసిస్ ఉగ్రవాదులు పారిస్‌ లోని పలుచోట్ల భీక‌ర కాల్పులకు తెగబడ్డ ఘ‌ట‌న‌లో 129 మంది పౌరులు మృతిచెందిన సంగ‌తి తెలిసిందే. ఉగ్రవాదులు పారిస్‌ లోని బటాక్లాన్ థియేటర్ వద్ద జరిపిన కాల్పుల్లో తన ప్రియమైన భార్యను కొల్పోయిన ఆంటోని లిరిస్ అనే పారిస్‌ వాసి ఉగ్రవాదుల‌ చర్యపై సోషల్ మాద్యమంలో పై విధంగా స్పందించాడు. త‌న ఆవేద‌న‌ను ప్రేమ‌పూర్వ‌కంగా వెల్ల‌డిస్తూ...ఫేస్‌ బుక్ పేజీ ద్వారా ఉగ్ర చర్యపై భావాల‌ను పంచుకున్నాడు.

"గ‌త‌ శుక్రవారం రాత్రి మీరు నా కొడుకుకు తల్లిని, నా జీవితపు ప్రేమని తీసుకున్నారు. అయినా మీ మీద నా కోపం లేదు! పలు రాత్రులు, పగళ్ల నిరీక్షణ తర్వాత ఈ రోజు ఉదయం నేను ఆమెను చివరిసారిగా చూశాను. 12 సంవత్సరాల క్రితం పిచ్చిగా ఆమెతో ప్రేమలో పడ్డప్పుడు ఎంత అందంగానైతే తనుందో ఈ రోజు సాయంత్రం నన్ను వదిలి వెళ్లిపోయేటప్పుడు కూడా అంతే అందంగా ఉంది. ఇప్పడు నేను, నా 7 ఏళ్ల కొడుకు మాత్ర‌మే మిగిలాం. మేం ఇద్దరమే అయినప్పటికీ ప్రపంచంలోని సైన్యమంతటి కంటే శక్తిమంతులం. భగవంతుడు అతని సృష్టిలో మీరు(ఉగ్రవాదులు) విచక్షణారహితంగా చంపుకోవడానికి మమ్మల్ని సృష్టించినట్లు అయితే నా భార్య శరీరంలోని ప్రతి బుల్లెట్ కూడా అతడి(దేవుడి) హృదయాన్ని గాయపరుస్తది. గుండెను చీల్చేలా ఉన్న బాధితుడు ఈ వ్యాఖ్యలు ప్రతిఒక్కరి మనసును తట్టిలేపుతున్నాయి" అని అభిప్రాయ‌ప‌డ్డారు.

త‌ను ఉగ్ర‌వాదుల‌పై ద్వేషం పెంచుకుంటే అజ్ఞాన‌మే అవుతంద‌ని చెప్పిన ఆంటోని అలాంటి అజ్ఞానం వ‌ల్లే ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు పాల్ప‌డ్డార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. భార్య‌ను పోగొట్టుకోవడం ద్వారా త‌న‌ను భ‌య‌పెట్టాల‌ని చూసిన వారికి త‌న ధైర్యం ఒక పాఠం అవుతుంద‌ని ఆంటోనీ ఈ సంద‌ర్భంగా అభిప్రాయ‌ప‌డ్డారు. ఆంటోనీ పోస్ట్‌ కు వేల‌కొల‌ది లైక్‌ లు కామెంట్లు వ‌చ్చిప‌డుతున్నాయి.