Begin typing your search above and press return to search.

మంట పుట్టిస్తున్న అమీర్ మాట‌లు!

By:  Tupaki Desk   |   24 Nov 2015 7:02 AM GMT
మంట పుట్టిస్తున్న అమీర్ మాట‌లు!
X
అనుకున్నదే జ‌రుగుతోంది. బీహార్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా మొద‌లైన అస‌హ‌నం ర‌చ్చ‌.. ఆ రాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌లై.. బీజేపీ ఘోర ప‌రాజ‌యంతో చ‌ర్చ ముగిసిన‌ట్లైంది. బీహార్ ఎన్నిక‌ల త‌ర్వాత ఏ మేధావి.. ఏ పండితుడు.. మ‌రే క‌ళాకారుడు సైతం త‌న పుర‌స్కారాల్ని వెన‌క్కి ఇస్తాన‌ని ప్ర‌క‌టించ‌క‌పోవ‌టం.. ఏ ప్ర‌ముఖుడు దేశంలో అస‌హ‌నం మీద త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేయ‌లేదు. ఇదిలా ఉంటే.. సోమ‌వారం ఒక మీడియా అవార్డుల ఫంక్ష‌న్‌లో మాట్లాడిన ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అమీర్ ఖాన్‌.. అస‌హ‌నం మీద చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా కొత్త దుమారం రేగింది.

దేశంలో నెల‌కొన్న మ‌త అస‌హ‌నం నేప‌థ్యంలో.. త‌న భార్య కిర‌ణ్ రావ్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ.. దేశం విడిచి వెళ్లిపోదామ‌ని అడిగింద‌ని.. వేరే దేశానికి వెళ్లాల‌ని కూడా ఆలోచించింద‌ని.. త‌మ పిల్ల‌ల విష‌యంలో త‌న భార్య ఇంత‌టి ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేసింద‌ని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. దేశంలో అంత దారుణ ప‌రిస్థితి ఉందా? అన్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. అమీర్ ఖాన్ వ్యాఖ్య‌ల్ని ప‌లువురు ఖండిస్తున్నారు.

ఎవ‌రి వ‌ర‌కో ఎందుకు.. బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు అనుప‌మ్ ఖేర్ స్పందిస్తూ..అమీర్ వ్యాఖ్య‌ల్ని తీవ్రంగా విమ‌ర్శించారు. తాజాగా ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా అమీర్ ను ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. ఇన్‌ క్రెడిబుల్ ఇండియా కాస్త‌.. ఇన్‌ టాల‌రేట్ ఇండియాగా ఎప్ప‌టి నుంచి మారింద‌ని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. ఇదంతా కేవ‌లం ఏడెనిమిది నెల‌ల నుంచి మాత్ర‌మేనా? అన్న ప్ర‌శ్న‌ను సంధించారు. ఇదొక్క‌టే కాదు.. డియ‌ర్ అమీర్‌ ఖాన్ అంటూ మ‌రో రెండు ట్వీట్ల‌ను ఆయ‌న చేశారు.

ఈ ట్వీట్ల విష‌యానికి వ‌స్తే.. దేశంలో ఇంత‌కంటే దారుణ‌మైన ప‌రిస్థితుల్లోనూ నువ్వు ఈ దేశంలో జీవించావ‌న్న విష‌యాన్ని నీ భార్య‌కు చెప్పావా? అన్న అనుప‌మ్ ఖేర్‌.. అలాంటి స‌మ‌యంలోనూ నువ్వు ఎప్పుడూ దేశాన్ని విడిచి వెళ్లాల‌న్న ఆలోచ‌న చేయ‌లేదే అన్నారు. మ‌రో ట్వీట్ లో.. ఏ దేశానికి వెళ్లిపోవాల‌ని నీ భార్య కోరుకుంటుందో ఒక్క‌సారి అడిగి చూడమ‌న్న అనుప‌మ్‌.. ఈ దేశం నిన్ను అమీర్ ఖాన్ ను చేసింద‌ని చెప్ప‌మంటూ ట్వీట్ ముగించారు.

అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై అనుప‌మ్ ఖేర్ లాంటి వారే కాదు.. ప‌లువురు సోష‌ల్ మీడియాలో విరుచుకుప‌డుతున్నారు. ఇక‌.. బీజేపీ ఎంపీ మ‌నోజ్ తివారి ట్విట్ట‌ర్‌ లో స్పందించారు. అమీర్‌ కు ఎక్క‌డ శాంతి ఉంటుందో అక్క‌డ‌కు వెళ్లిపోవ‌చ్చ‌ని.. ఆ స్వేచ్ఛ ఆయ‌న‌కు ఉంద‌ని పేర్కొన్నారు. ఇక్క‌డ జీవించ‌టానికి భ‌యంగా ఉంటే.. ఎక్క‌డికైనా వెళ్లి జీవించొచ్చ‌ని పేర్కొన్నారు.

ఒక్క క్ష‌ణంలో ఇంత తీవ్ర‌మైన వ్యాఖ్య చేసి భార‌త‌మాత‌కు క‌ళంకాన్ని తీసుకొచ్చిన అమీర్‌.. తాను చేసిన వ్యాఖ్య‌లు ఎంత త‌ప్పుగా ఉన్నాయో ఒక్క‌సారి ఆలోచించాల‌న్నారు. అమీర్ వ్యాఖ్య‌లు షాక్ క‌లిగించాయ‌ని.. త‌న‌కు విప‌రీత‌మైన బాధ‌ను క‌లిగించాయ‌ని వ్యాఖ్యానించారు.