Begin typing your search above and press return to search.

అనుపమ్ ఖేర్ ప్రసంగాన్ని మీరు విన్నారా? 1

By:  Tupaki Desk   |   8 March 2016 6:49 AM GMT
అనుపమ్ ఖేర్ ప్రసంగాన్ని మీరు విన్నారా? 1
X
ప్రముఖులు ఆచితూచి మాట్లాడటం మానేసి చాలాకాలమే అయ్యింది. తమ ప్రత్యర్థుల పైనా.. తాము విభేదించే వారిని అడ్డదిడ్డంగా తిట్టేయటం.. ఆ క్రమంలో విమర్శలకు గురి కావటం ఇప్పుడు మామూలు వ్యవహారమైంది. అయితే.. అందుకు భిన్నంగా.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేయటమే కాదు.. క్రమపద్ధతిలో హుందాగా తన వాదనను వినిపించటం.. అది కూడా తాను విభేదించే వారి సమక్షంలోనే జరగటం ఒక ఆసక్తికర పరిణామం.

కోల్ కతాలో బాగా ఫేమస్ అయిన ‘‘ది టెలిగ్రాఫ్’’ మీడియా సంస్థ ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన ‘ది టెలిగ్రాఫ్ నేషనల్ డిబేట్’’లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ చేసిన ప్రసంగం హాట్ టాపిక్ గా మారింది. ఈ దేశంలో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన కాస్త ఎక్కువసేపే మాట్లాడారు. అయితే.. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని సునిశితంగా స్పృశిస్తూ.. తన మీదున్న విమర్శలకు సమాధానాలు చెబుతూ.. తన వాదనను వినిపించారు. ఈ క్రమంలో ఓ రేంజ్ లో చెలరేగిపోయిన ఆయన.. చాలానే ప్రశ్నల్ని సంధించారు. తను వినిపిస్తున్న వాదనకు సంబంధించి తన పక్షానికి చెందిన వారు చేసే తప్పుల్ని కూడా ఆయన క్షమించకపోవటం గమనార్హం.

ప్రముఖులు పైకి చెప్పే మాటలకు చేసే పనులకు మధ్యనున్న అంతరాన్ని ఎత్తి చూపించిన అనుపమ్ ఖేర్ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు.. ఆయన చేసిన ప్రసంగాన్ని అనువదించి వాట్సప్ లో షేర్ చేస్తున్నారు. అది కాస్తా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. తీవ్ర చర్చను రేకెత్తిస్తున్న అనుపమ్ ఖేర్ ప్రసంగానికి సంబంధించి సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఒక స్వేచ్ఛానువాదం చూస్తే..

నమస్కారం.. నేను హిందీలో మాట్లాడాలనుకుంటున్నాను.. ఎందుకంటే నేను హిందీలో ఆలోచిస్తాను కాబట్టి.. ఒక వేళ మధ్య మధ్యలో నా నుంచి ఇంగ్లీష్ పదాలు వస్తే అది మీ అదృష్టం క్రింద లెక్క! నేను వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకూడదని చాలా ఆలోచించుకుని వచ్చాను. కానీ, తప్పేటట్లు లేదు. ఈ సభలో ఇంతకుముందు జస్టిస్ గంగూలీ చేసిన ప్రసంగం చూసి నేను బాధతో పాటు షాక్ కూడా తిన్నా. ఒక న్యాయమూర్తిగా వ్యవహరించిన వ్యక్తి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపడుతుండటం దురదృష్టకరం! (జస్టిస్ గంగూలీని చూస్తూ)

న్యాయవిద్యార్థిని పై లైంగిక వేధింపుల కేసులో మీడియా మిమ్మల్ని ప్రశ్నలు అడిగినప్పుడు .. వాళ్ల మీద అసహనం ప్రదర్శించిన మీరు.. ఈ రోజు మీరు జేఎన్‌ యూలో జరిగిందంతా కరెక్టే అని సమర్థించడం పెద్ద తప్పు! తాజాగా,ఫ్రిబవరి తొమ్మిదిన యాంటీ- ఇండియా క్యాంపెయిన్ లో పాల్గొన్న ఒక వ్యక్తిని మనం ‘హీరో’ ని చేస్తున్నాం.. ఆ రోజు జేఎన్‌ యూ విద్యార్థులు ఏ నినాదాలు చేశారో తెలుసా? ‘అఫ్జల్ గురు.. మేం సిగ్గుపడుతున్నాం.. నిన్ను హత్య చేసిన వాళ్లు ఇంకా బ్రతికున్నారు?’ అంటే.. ఇక్కడ అఫ్జల్ గురును హత్య చేసిన వాళ్లు ఎవరు? అంటే వాళ్ల ఉద్దేశం సుప్రీం కోర్టు జడ్జిలు అఫ్జల్ గురును హత్య చేశారా? ‘భారత్ ను ముక్కలు ముక్కలు చేస్తాం.. ఇన్‌ షా అల్లా..ఇన్‌ షా అల్లా’.. ఇంత దారుణమైన నినాదాలు చేస్తే వాటిని ఖండించకుండా.. సుప్రీంకోర్టును మీరు(జస్టిస్ గంగూలీ) తప్పుపట్టడం ఎంతవరకు సమర్థనీయం! అంటే.. సుప్రీం కోర్టు జడ్జిలు అప్జల్ గురును హత్య చేశారా? ఒకప్పుడు సుప్రీంకోర్టు జడ్డిగా ఉండి జేఎన్‌యూ ఘటనను సమర్థించినందుకు మిమ్మల్ని ఎవరూ క్షమించరు!

అనంతరం కాంగ్రెస్ ప్రతినిథి సుర్జేవాలా ఉద్దేశించి మాట్లాడుతూ.. సుర్జేవాలా గారు.. కేంద్ర ప్రభుత్వం అంత అసహనంగా ఉంది.. ఇంత అసహనంగా ఉంది అంటూ మీరు ఓ లిస్ట్ తయారు చేసుకొచ్చి ప్రసంగించారు. కానీ, 1975లో.. దేశంలో అత్యంత అసహనమైన ఘటన అయిన ‘ఎమర్జెన్సీ’ని విధించింది మీ నాయకురాలు ఇందిరాగాంధీనే! దేశంలో ఇప్పటిదాకా జరిగిన అత్యంత దారుణమైన ఘటన అదే! అప్పట్లో ఎమర్జన్సీకి వ్యతిరేకంగా ఎవరెవరైతే నినదించారో..వాళ్లందరినీ నిర్థాక్షిణ్యంగా జైల్లో పెట్టి కుళ్లబొడిచారు. ఎమర్జెన్సీ పై ఆఖరికి ఇళ్లలో చర్చించుకున్నట్టు తెలిసినా.. వారిని కూడా ఉపేక్షించకుండా ఇందిరాగాంధీ జైల్లో పెట్టించేసింది. అలా, జైలుకెళ్లిన వాళ్లలో మా తాతగారు కూడా ఉన్నారు.

అసలు, ఈ దేశంలో అత్యంత సహనం కలిగిన వ్యక్తులు ఎవరో తెలుసా? కాంగ్రెస్ పార్టీ వాళ్లు.. ప్రధానిగా తాము ఫోకస్ చేస్తున్న ఆ వ్యక్తిని (రాహుల్‌ గాంధీని ఉద్దేశించి) ఇన్నాళ్ల నుంచి ఓపిగ్గా భరిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగా గొప్పవాళ్లు. కాంగ్రెస్‌లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. తమ ప్రధానమంత్రి అభ్యర్థి సరైన వ్యక్తి కాదని తెలిసినా.. ఆ మాట ఒకళ్లకొకళ్లు చెప్పుకోవడానికి కూడా వారికి భయం! ఇలాంటి వ్యక్తిని పెట్టుకుని మనం అడ్డంగా బుక్కైపోయాంరా బాబు అని మనసులో అనుకుంటూ.. బయటకు మాత్రం ఆ వ్యక్తి పట్ల వినయవిధేయతలను ప్రదర్శిస్తూ చాలా గొప్ప సహనాన్ని కాంగ్రెస్ వాళ్లు చూపిస్తున్నారు. అదే, సహనాన్ని మీరు పార్లమెంట్‌లో కూడా చూపించండి. మీరు అలాంటి వ్యక్తిని భరిస్తున్నారంటే.. మీరు ప్రపంచంలో ఎవరినైనా భరించగలరు. ఆ వ్యక్తిని(రాహుల్‌ ను ఉద్దేశించి) భరించడంలో చూపిస్తున్న సహనాన్ని మీరు పార్లమెంట్‌లో చూపించండి.. అనేక సమస్యలు పరిష్కారమవుతాయి.

ఇంకా చదవటానికి క్లిక్ చేయండి: అనుపమ్ ఖేర్ ప్రసంగాన్ని మీరు విన్నారా? 2