Begin typing your search above and press return to search.

నాలుగు సింహాల చిహ్నంపై ప్ర‌ముఖ సినీ న‌టుడి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   13 July 2022 10:48 AM GMT
నాలుగు సింహాల చిహ్నంపై ప్ర‌ముఖ సినీ న‌టుడి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు!
X
ఢిల్లీలో కొత్త నూత‌న పార్ల‌మెంటు భ‌వ‌నంపై నాలుగు సింహాల విగ్ర‌హానికి సంబంధించిన వివాదం ఇంకా కాక‌రేపుతోంది. సార‌నాథ్ లో మౌర్య చ‌క్ర‌వ‌ర్తి అశోకుడు నిర్మించిన స్థూపంలో సింహాలు శాంత‌చిత్తంతో ఉన్నాయ‌ని.. అచ్చం అదే న‌మూనాతో పార్ల‌మెంటు భ‌వ‌నంలో రూపొందించిన నాలుగు సింహాలు కోపంతో చూస్తున్న‌ట్టు మ‌లిచార‌ని ప్ర‌తిప‌క్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. కొత్త పార్లమెంట్‌ భవనంపై ఏర్పాటు చేసిన ఈ జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జూలై 11న ఆవిష్కరించిన సంగ‌తి తెలిసిందే.

ఈ జాతీయ చిహ్నంపై ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. అంతేకాకుండా సామాజిక కార్యకర్తలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో హుందాగా, రాజసంగా, ఆత్మవిశ్వాసంతో ఉండే నాలుగు సింహాలు.. క్రూరంగా, దౌర్జన్యకరంగా కనిపిస్తున్నాయని, తక్షణమే మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.

లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి ట్వీట్‌ చేస్తూ 'మోదీ జీ.. దయచేసి సింహం ముఖాన్ని ఓసారి చూడండి. సారనాథ్ ​నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన ప్రతిమలా ఉందా లేక వక్రీకరించిన గిర్ సింహం ఫొటోలా ఉందో ఒకసారి పరిశీలించండి. వీలైతే మార్పించండి' అంటూ ట్వీట్ చేశారు.

జాతీయ చిహ్నంలో మార్పులను సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా తప్పుబట్టారు. 'మోదీ నవ భారత్ ఇదే' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీరే కాకుండా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు జవహర్ సర్కార్, మెహువా మొయిత్రా, రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్, తదిత‌ర పార్టీలు సైతం మండిప‌డ్డాయి.

ఈ విమర్శలపై ప్రముఖ నటుడు, 'కాశ్మీర్ ఫైల్స్' ఫేమ్ అనుపమ్ ఖేర్ ట్విట్ట‌రులో మండిప‌డ్డారు. 'సింహానికి దంతాలు ఉంటే, అది ఖచ్చితంగా వారికి చూపిస్తుంది. ఇది నిజమైన స్వాతంత్ర్య‌ భారతదేశానికి చిహ్నమైన సింహం. అవసరమైతే సింహం కూడా కొరుకుతుంది.. దాడి చేస్తుంది.

జై హింద్' అని అనుప‌మ్ ఖేర్‌వీడియోతో పాటు ట్వీట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో పలువురు నెటిజన్లు అనుప‌మ్ ఖేర్ కు అనుకూలంగా, వ్య‌తిరేకంగా కామెంట్లు పెడుతున్నారు.