Begin typing your search above and press return to search.

ఏడేళ్ల నాటి ఫోటోతో కోహ్లి.. రహానేలను ఎటకారం ఆడేసిన క్రికెటర్ భార్య

By:  Tupaki Desk   |   30 Aug 2021 3:30 AM GMT
ఏడేళ్ల నాటి ఫోటోతో కోహ్లి.. రహానేలను ఎటకారం ఆడేసిన క్రికెటర్ భార్య
X
మొగుడు గొప్పతనం గురించి చెప్పుకోవటం తప్పేం కాదు. కానీ.. ఆ పేరుతో ఇతరుల్ని ఎటకారం ఆడేయటమే సమస్య. తాజాగా అదే పని చేశారు టీమిండియా క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ సతీమణి కమ్ ప్రముఖ యాంకర్ కమ్ క్రికెట్ వ్యాఖ్యాత మయంతి లాంగర్. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సిరీస్ లో బ్రిటీష్ బౌలర్ ఆండర్సన్ బౌలింగ్ ను ఎదుర్కోవటానికి టీమిండియా క్రికెటర్లు కిందా మీదా పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన టెస్టు మ్యాచ్.. అతడి కారణంగానే గోవిందా అనటం చూశాం.

ఇలాంటివేళ.. కోహ్లీ.. రహానేలను ఎటకారం ఆడేసేలా.. తన భర్త గొప్పతనాన్ని గుర్తు చేసేలా తాజాగా ఆమె పోస్టు ఉందంటున్నారు. ఇన్ స్టాలో ఆమె పోస్టు చేసిన స్టోరీ ఇప్పుడు చర్చగా మారింది. ఇందులో ఏడేళ్ల క్రితం నాటి ఫోటోను పోస్టు చేయటం గమనార్హం. 2014 ఇంగ్లండ్ పర్యటనలో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ సందర్భంగా తీసిన ఫోటో ఇది. తన భర్త బాదిన బౌండరీకి ఆండర్సన్ తల పట్టుకున్న ఫోటోను పోస్టు చేయటం ద్వారా.. స్టువర్ట్ బిన్ని గొప్పతనాన్ని చెప్పకనే చెప్పేసింది. పరోక్షంగా టీమిండియా క్రికెటర్లలో మిస్అయిన అంశాన్ని.. తన భర్తలో ఉన్న టాలెంట్ చెప్పేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆ మ్యాచ్ తోనే బిన్ని టెస్టు క్రికెట్ లోకి అడుగుపెట్టారు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఒక్క పరుగుకే అవుట్ అయ్యారు. కానీ.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 78 పరుగులు చేసిన తన సత్తా చాటారు. ఈ ఫోటోను పోస్టుకు ఎలాంటి వ్యాఖ్యను జోడించలేదు. అయితే.. ఒక ఫోటో కొన్ని వేల భావాలకు నెలవు అన్న చందంగా మారి.. ఎవరికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా ఈ ఫోటో ఉందన్న మాట వినిపిస్తోంది. మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కొడుకే ఈ స్టువర్ట్ బిన్ని. క్రికెట్ యాంకర్ మయంతిని ప్రేమించి పెళ్లాడిన వీరికి గత ఏడాది ఒక బాబు పుట్టాడు.

అతడు చివరిసారిగా 2016లో వెస్టిండీస్ పై టీ20 మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్ లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సమర్పించుకోవటంతో అతగాడికి షాక్ తగిలింది. అయితే.. టీమిండియా తరఫున ఆరు టెస్టులు ఆడిన అతను హాఫ్ సెంచరీతో 194 పరుగులు చేశారు. బౌలింగ్ పెద్దగా రాణించలేదు. అయితే.. వన్డే క్రికెట్ లో మాత్రం భారత్ తరఫున అత్యుత్తమ గణాంకాలు అతడి పేరు మీదనే నమోదై ఉన్నాయి. 2014లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం నాలుగు పరుగులకే ఆరు వికెట్లు తీశారు. దానికి ముందు వరకు ఈ రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. పన్నెండు పరుగులకు ఆరు వికెట్లు తీయగా.. అంతకు మించి అన్నట్లు స్టువర్ట్ బిన్ని రికార్డు ఉంది. తన భర్త గొప్పతనాన్ని గుర్తు చేస్తూ.. టీమిండియా క్రికెటర్లకు ఎక్కడో తగిలేలా మయంతి ఇన్ స్టా స్టోరీ ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.