Begin typing your search above and press return to search.

పార్టీ ఏదైనా.. ఆ మ‌హిళా నేత‌ల లెక్కే వేర‌ట‌.. !

By:  Tupaki Desk   |   25 Nov 2021 2:30 AM GMT
పార్టీ ఏదైనా.. ఆ మ‌హిళా నేత‌ల లెక్కే వేర‌ట‌.. !
X
అవును..! రాజ‌కీయాల్లో కొంద‌రు నాయ‌కుల లెక్కే వేరుగా ఉంటోంది. ఇలాంటివారిలో మ‌హిళా నాయ‌కుల లెక్క మ‌రీ డిఫ‌రెంట్‌గా ఉంటోందని అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీలు ఏవైనా.. జెండాలు..ఏవైనా.. కూడా అజెండాలు మాత్రం ఎవ‌రికివారుగా అమ‌లు చేస్తున్నా.. మొత్తంగా చూసుకుంటే.. రిజ‌ల్ట్ మాత్రం ఒకే విధంగా ఉంద‌నే గుస‌గుస వినిపిస్తుండడం గ‌మ‌నార్హం. నాయ‌కులు ఎవ‌రైనా కూడా అవ‌స‌రం-అవ‌కాశం అనే రెండు వ్యూహాల‌తోనే రాజ‌కీయాలు చేస్తారు. అయితే.. ఒక‌ప్పుడు గెలిచామా? ఓడామా? అనే సంబంధం లేకుండా.. నాయ‌కులు రాజ‌కీయాల్లో ఉంటే.. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది.

కేవ‌లం గెలుపు గుర్రం ఎక్కితేనే పార్టీలో యాక్టివ్‌గా ఉంటామ‌నే ధోర‌ణి నాయ‌కుల మ‌ధ్య పెరుగుతున్నట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా మ‌హిళా నాయ‌కుల ప‌రిస్థితి ఇలానే ఉంది. కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి అయినా.. మాజీ ఐఏఎస్ అధికారి కె. ర‌త్న ప్ర‌భ అయినా.. అవ‌కాశ వాద రాజ‌కీయ నేత‌లుగా మారుతు న్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది ఇటు వారు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీల్లోనూ.. అటు తాము ఎవ‌రి ఓట్ల కోసం అయితే.. వ‌చ్చారో.. వారికి కూడా అందుబాటులో లేకుండా పోతున్నారు. కేవ‌లం ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు.. మాత్ర‌మే వీరు మెరుస్తారు. త‌ర్వాత మ‌ళ్లీ ఎక్క‌డికి వెళ్లిపోతారో.. తెలియ‌దు.

ర‌త్న ప్ర‌భ విష‌యం కంటే.. ఇప్పుడు ప‌న‌బాక ల‌క్ష్మి విష‌యం ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. ఆమెకు గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు తిరుప‌తి పార్ల‌మెంటు టికెట్ ఇచ్చారు. త‌ర్వాత‌.. ఈ ఏడాది జ‌రిగిన ఉప ఎన్నిక‌లోనూ.. ఆమెకు టికెట్ ఇచ్చి ప్రోత్స‌హించారు. అయితే.. వైసీపీ ప్ర‌భంజ‌నం.. సానుభూతి ముందు ప‌న‌బాక ఓడిపోయారు. ఇంత వ‌ర‌కు స‌హ‌జం ఆమె కూడా దాదాపు పాతికేళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. కానీ.. ఓట‌మి త‌ర్వాత‌.. ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. క‌నీసం పార్టీ తర‌ఫున కూడా ఆమె వాయిస్ వినిపించ‌డం లేదు.

ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చి.. ఏమీ చేయాల్సిన అవ‌స‌రం లేక‌పోయినా.. పార్టీ కార్యాలయంపై దాడి జ‌రిగిన‌ప్పుడు కానీ.. చంద్ర‌బాబు దీక్ష‌కు కూర్చున్న‌ప్పుడు కానీ.. ప‌న‌బాక ల‌క్ష్మి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అదేస‌మ‌యంలో కుప్పం ఎన్నిక‌ల్లోనూ ఆమె పార్టిసిపేష‌న్ లేద‌నే వాద‌న ఉంది. ఈ నేప‌థ్యంలో ఇలాంటి అవ‌కాశ వాద నాయ‌కుల‌కు ప్రోత్సాహం అందించ‌డం అవ‌స‌రమా? అనే చ‌ర్చ వ‌స్తోంది. అటు ర‌త్న ప్ర‌భ కూడా మ‌ళ్లీ క‌ర్ణాట‌క, హైద‌రాబాద్కు వెళ్లిపోయార‌నే వాద‌న ఉంది. ఈ విష‌యం బీజేపీలోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీయ‌డం గ‌మ‌నార్హం.