Begin typing your search above and press return to search.
ఏ వైరస్ అయినా కేరళలోనే ముందు.. ఎందుకు..?
By: Tupaki Desk | 20 July 2022 1:30 AM GMTప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా.. కేరళ వారు ఒకరు ఉంటారు అంటారు. ఇది వాస్తవమే. భారత్ లోని మిగతా రాష్ట్రాల కంటే కేరళ చాలా ముందుంటుంది. అన్ని రంగాల్లోనూ ఆ రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుంది కూడా. దేశంలోనే తొలి వంద శాతం అక్షరాస్యత సాధించిన జిల్లా కేరళలోని కొట్టాయం అని 40 ఏళ్ల క్రితమే పాఠ్య పుస్తకాల్లో రాశారు. అంతటి ప్రగతి కేరళ సొంతం.
అంతేకాదు.. నర్సింగ్ నుంచి మేనేజ్ మెంట్ దాకా వివిధ రంగాల్లోని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలోనూ కేరళీయులకు మరే భారత రాష్ట్ర పౌరులు సాటిరారు. గల్ప్, అమెరికా, కెనడా, సింగపూర్, మలేసియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్.. ఇలా ఎక్కడైనా కేరళ వాసుల విజయ పతాకను చూస్తుంటాం. అయితే, మూడు దశాబ్దాలుగా పరిస్థితి కొంత మారింది. మిగతా దక్షిణాది రాష్ట్రాలూ పుంజుకొన్నాయి. అది వేరే విషయం. ఇప్పుడు చెప్పుకొంటున్న విషయం ‘‘వైరస్ ’’లు.
అక్కడే ఎందుకు..?
నిఫా.. జికా.. కొవిడ్.. మంకీ పాక్స్.. భారత్ లో ఏ వైరస్ కేసయినా తొలిగా కనిపిస్తోంది కేరళలోనే. తాజాగా దేశంలో రెండు మంకీ పాక్స్ కేసులు రాగా.. రెండూ కేరళవే. వీరిద్దరూ ఇతర దేశాల నుంచి వచ్చిన వారే. ఈ ఏడాది ప్రారంభంలో నిఫా వైరస్ కేరళను వణికించింది. అయితే, వ్యాప్తి అక్కడితోనే ఆగిపోయింది. ఇక జికా వైరస్ గురించి కూడా కేరళలో కలకలం రేపింది. ఏడిస్ ఈజిప్టై దోమ కుట్టడం ద్వారా వ్యాపించే ఈ వ్యాధి బారినపడినవారు పెద్దఎత్తున ఉన్నారు.
ఇవే దోమలు చికన్ గన్యా, డెంగీని కూడా వ్యాపింపజేస్తాయి. నిఫా వైరస్ గబ్బిలాల నుంచి వ్యాపిస్తుంది. వాటి లాలాజలం, మూత్రం, రక్తంలో ఈ వైరస్ ఉంటుంది. పండ్లు, పందులు, ఇతర మార్గాల ద్వారా మనుషులకు అంటుకుంటుంది. మెదడుపై ప్రభావం చూపే ఈ వైరస్ కారణంగా 40 నుంచి 75 శాతం మంది రోగులు చనిపోయే ప్రమాదం ఉంది.
తొలి రెండు కొవిడ్ కేసులు
ప్రపంచాన్ని మూడేళ్లుగా వణికిస్తున్న కొవిడ్ కు సంబంధించి భారత్ లో తొలి కేసు కేరళలోనే నమోదైంది. చైనా నుంచి వైద్య విద్యార్థినికి 2020 జనవరి 27న పాజిటివ్ గా తేలింది. రెండో కేసు కూడా ఈ రాష్ట్రంలోనే నమోదైంది. అయితే, వీరు త్వరగానే కోలుకున్నారు. కాకపోతే.. భారత్ లో కొవిడ్ తొలి కేసులుగా ముద్రపడ్డారు. కాగా, తదనంతర పరిస్థితుల్లో కొవిడ్ దేశంలోనే కాక ప్రపంచంలో ఎంతటి ప్రళయం రేపిందో అందరికీ తెలిసిందే. కొవిడ్ రెండో, మూడో వేవ్ లోనూ కేరళలో కేసులు అత్యధికంగా వచ్చాయి.
పుట్టుక పుట్టుకే.. కట్టడి కట్టడే..
పైన చెప్పుకొన్నట్లు దేశంలో వెలుగుచూసే ప్రతి వైరస్ కేసు కేరళకు సంబంధం ఉన్నా.. చర్యలు తీసుకోవడంలో అక్కడి ప్రభుత్వ యంత్రాంగం తీరును ఏమాత్రం తక్కువ చేయలేం. విద్యావంతులు, చైతన్యవంతులున్న సమాజం కావడంతో ప్రభుత్వంపైన సైతం ఈ మేరకు ఒత్తిడి ఉంటుంది. దీంతో అధికార యంత్రాంగం సమర్థంగా విధి నిర్వహిస్తుంది.
కాగా, కొవిడ్ ను కేరళ తొలినాళ్లలో అత్యంత సమర్థంగా కట్టడి చేసింది. దీనికిగాను ఆరోగ్య శాఖ మంత్రికి ప్రశంసలు కూడా దక్కాయి. అయితే, రెండో వేవ్ ఎవరి చేతుల్లోనూ లేకపోయింది. ఇటుచూస్తే.. ఎక్కడా దాపరికం లేకుండా కరోనా కేసులు, మరణాల లెక్కలను వెల్లడించడంలో కేరళ అత్యంత నిజాయతీగా వ్యవహరించింది. అంతేకాదు.. కొవిడ్ మరణాలకు సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రకటించిన పరిహారం కోసం.. మరణాల గణాంకాలను ప్రతి రోజూ సవరిస్తూ లెక్కల్లో చేర్చింది. అదీ కేరళ యంత్రాంగం సమర్థత.
వ్యాప్తి ఎందుకు..?
ప్రపంచంలో ప్రతి మూలన కేరళీయులు ఉంటారని చెప్పుకొన్నాం కదా..? వారితో పాటు, వారిని చూసి వచ్చేందుకు వెళ్లే బంధుమిత్రులు, వ్యాపార లావాదేవీలకు రాకపోకలు నెరిపే వ్యక్తుల సంఖ్య ఎక్కువే ఉంటుంది. వీరంతా స్వరాష్ట్రానికి వచ్చి పోయే నేపథ్యంలో వైరస్ వాహకులుగా మారుతున్నారు. ఇటీవల కేరళలో నమోదైన రెండు మంకీ పాక్స్ కేసుల్లోనూ బాధితులు విదేశీ ప్రయాణ చరిత్ర ఉన్నవారే కావడం ఇక్కడ గమనార్హం.
కాగా, దేశంలో నమోదైన కొవిడ్ తొలి కేసు చైనా నుంచి విద్యార్థిని కావడం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే.. కేరళ ప్రధానంగా తీర రాష్ట్రం. దీనికితగ్గట్లే వర్షాలు పడుతుంటాయి. నైరుతి రుతు పవనాలు ముందుగా ప్రవేశించేది కేరళలోనే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో జూన్ నుంచి తడిసిమద్దువుతుంటుంది. ఇది దోమల వ్యాప్తికి కారణం అవుతుంది. ఇన్ని కారణాలతోనే కేరళ ప్రధానంగా వైరస్ తొలి కేసులకు కేంద్రం అవుతోంది.