Begin typing your search above and press return to search.

విశాఖ రాజధాని కోసం రూట్ మ్యాప్...పాదయాత్ర ఆగినట్లే...?

By:  Tupaki Desk   |   25 Oct 2022 1:52 PM GMT
విశాఖ రాజధాని కోసం రూట్ మ్యాప్...పాదయాత్ర ఆగినట్లే...?
X
ఏపీలో ఒక అతి కీలక అంశం మీద ప్రతీ రోజూ రాజకీయ రచ్చ సాగుతూనే ఉంది. అమరావతి రాజధాని అజెండాతో తెలుగుదేశం విపక్షాలు ఉంటే మూడు రాజధానులు అంటూ అధికార వైసీపీ తన వాదన వినిపిస్తోంది. దీంతో రాజధాని వివాదం అలా కొనసాగుతోంది. ఇక అమరావతి టూ అరసవెల్లి అంటూ రైతులు సాగిస్తున్న పాదయాత్ర కరెక్ట్ గా మూడు రోజుల క్రితం రామచంద్రాపురంలో ఆగింది. ఈ యాత్రకు విరామాన్ని తాత్కాలికంగా ప్రకటించామని రైతు నాయకులు చెబుతున్నారు.

అయితే అమరావతి రైతుల పాదయాత్ర పూర్తిగా ఆగినట్లే అని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అంటూనే ఆయన ఉత్తరాంధ్రా వైపు రైతుల పాదయాత్ర వచ్చే అవకాశాలు లేవని, ఒక విధంగా ఉత్తరాంధ్రా ప్రజల రాజకీయ కోరిక తీరబోతోంది అని చాలా నమ్మకంగా చెబుతున్నారు.

అమరావతి రైతుల పాదయాత్ర కోసం అరు వందల మంది రైతులు పేర్లను పోలీసులకు ఇస్తే తీరా యాత్రలో చూస్తే అరవై మంది దాకా కూడా లేరని ఆయన విమర్శించారు. దీంతోనే టీడీపీ ముసుగులో రైతులు చేస్తున్న పాదయాత్రను ఆపేశారని ఆయన తనదైన విమర్శలు చేశారు. ఇది ఫక్తు రాజకీయ యాత్ర అని తాము మొదటి నుంచి చెబుతున్నామని ఆయన గుర్తు చేయడం విశేషం.

ఇదిలా ఉండగా విశాఖ రాజధాని అన్నది తొందరలోనే నెరవేరుతుందని చెప్పుకొచ్చారు. దాని కోసం రూట్ మ్యాప్ ని కూడా రెడీ చేస్తున్నామని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. విశాఖ రాజధానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని వాటిని పరిష్కరించడం ద్వారా విశాఖకు పరిపాలారాజధానికి తరలిస్తామని బొత్స వెల్లడించారు.

మరి బొత్స చెప్పిన దాని ప్రకారం చూస్తే రూట్ మ్యాప్ లో ఏముంటుంది అన్నదే ఇపుడు చర్చగా ఉంది. సుప్రీం కోర్టులో ప్రస్తుతం అమరావతి రాజధాని కేసు విచారణకు రెడీగా ఉంది. దీని మీదనే వైసీపీ పెద్దలు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇందులో మౌలికమైన ప్రశ్నలను పొందుపరచి ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ లో దాఖలు చేశారు. పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునే హక్కులు చట్ట సభలకు లేవా అన్నదే ఒక మౌలికమైన ప్రశ్న.

దాంతో పాటుగా తాము మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసుకున్నాక ఇక విచారణ తీర్పు వంటివి ఎందుకు అన్న దాని మీద కూడా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు పెట్టుకున్న పిటిషన్ లో పేర్కొంది. మరి వీటి మీద ఏమైనా వారికి అనుకూలత ఉంటుందే అని భావించే మంత్రులు ఈ రకంగా ప్రకటనలు చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా నవంబర్ నెల చాలా కీలకంగా మారనుంది అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.