Begin typing your search above and press return to search.

ఏపీని భయపెడుతున్న ఎయిడ్స్ గణాంకాలు...

By:  Tupaki Desk   |   8 Sep 2019 1:30 AM GMT
ఏపీని భయపెడుతున్న ఎయిడ్స్ గణాంకాలు...
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మహమ్మారి ఎయిడ్స్ కబళిస్తోందా ? అంటే ప్రస్తుతం ఉన్న గణాంకాలు అవుననే చెబుతున్నాయి. మానవ శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పూర్తిగా నశింపచేసి - ప్రాణాలను హరించే ఈ వైరస్ ఏపీలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో 3.98 లక్షల మంది వ్యాధి సోకిన జాబితాలో ఉన్నారు. ఇక అనధికారికంగా ఇంకో లక్ష వరకు ఉండొచ్చు.

తాజా లెక్కల ప్రకారం ఏపీ ఎయిడ్స్ లో రెండో స్థానంలో ఉంది. ఏపీ కంటే ముందు మహారాష్ట్ర అత్యధికంగా హెచ్ ఐవీ బాధితులతో మొదటి స్థానంలో ఉంది. ఇక ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీలో 2009 లెక్కల ప్రకారం మొత్తం 4 లక్షల 89వేల మంది హెచ్ ఐవీ- ఎయిడ్స్ బాధితులు ఉన్నారు. తర్వాత విభజనానంతరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే హెచ్ఐవీ బాధితులు అధికంగా ఉన్నారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఎన్ ఏసీఓ) 2017లో విడుదల చేసిన రిపోర్టులోనూ హెచ్ ఐవీ బాధితుల్లో ఏపీ రెండవ స్థానంలో ఉంది.

ఆ నివేదిక ప్రకారం ఏపీలో 2017 మార్చి నాటికి 2లక్షల 70 వేల మంది హెచ్ ఐవీ బాధితులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య ఇంకా పెరిగి 3.98 లక్షలకు చేరుకుంది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ మంది హెచ్ ఐవీ బాధితులు ఉన్నారు. తర్వాత స్థానం గుంటూరు - మూడో స్థానంలో కృష్ణా - నాల్గవ స్థానంలో పశ్చిమగోదావరి జిల్లాలు ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో విశాఖపట్నం - ప్రకాశం - అనంతపురం - చిత్తూరు - కర్నూలు - నెల్లూరు - కడప - శ్రీకాకుళం - విజయనగరం జిల్లాలు ఉన్నాయి. అలాగే ఎయిడ్స్ బాధితుల్లో మహిళలే ఎక్కువ ఉన్నారు.

రాష్ట్రంలో హెచ్ ఐవీ-ఎయిడ్స్ నివారించేందుకు జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ -ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థల ఆధ్వర్యంలో హెచ్ ఐవీ బాధితులకు ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తోంది. అటు ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎన్ ఏసీపీ)ని ప్రారంభించింది. దశలవారీగా ఈ వైరస్ ఎలా కంట్రోల్ చేయాలి? ప్రజలకు ఎటువంటి సేవలు అందించాలి? మెడిసిన్స్ - సెంటర్స్ - హెల్ప్ లైన్స్ - తదితర అంశాలపై ప్రణాళికలు సిద్ధపరిచి అమలు పరుస్తున్నారు.

ఇప్పటివరకు ఎన్ ఏసీపీ నాలుగు దశల్లో అమలు పరిచారు. ఇక 2017 నుంచి 2024 వరకు ఎన్ ఏసీపీ ఫేజ్-5ను అమల్లోకి తీసుకొచ్చారు. ఈ ఫేజ్-5లో భాగంగా మరింత విస్తృతమైన చర్యలు తీసుకుని - 80 శాతం వరకు ఈ వ్యాధిని కంట్రోల్ చేయాలని - 2030 నాటికి పూర్తిగా కంట్రోల్ చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించుకుంది.