Begin typing your search above and press return to search.

డజనుమంది మంత్రులు.. 70 మంది ఎమ్మెల్యేలు.. ఆ ఏపీ సలహాదారు 'ప్రదర్శన' మామూలుగా లేదుగా?

By:  Tupaki Desk   |   28 March 2022 10:30 AM GMT
డజనుమంది మంత్రులు.. 70 మంది ఎమ్మెల్యేలు.. ఆ ఏపీ సలహాదారు ప్రదర్శన మామూలుగా లేదుగా?
X
రాజకీయాల్లో ఒకటనుకుంటే ఒకటవుతుంది.. అలాగే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడో అంశం భలే చర్చకు వస్తోంది. పదుల కొద్దీ ఉన్న సలహాదారుల్లో ఓ సలహాదారు ప్రదర్శించిన వైభవం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల ఆ సలహాదారు ఓ పెద్ద హోటల్ లో ఏర్పాటు చేసిన వ్యక్తిగత కార్యక్రమానికి ఏకంగా దాదాపు డజను మంది మంత్రులు, 70 మంది ఎమ్మెల్యేలు హాజరయినట్లు తెలిసి ఔరా అని నోరెళ్లబెడుతున్నారు. మిగతా సలహాదారులేమో లోలోన ఆలోచనలో పడ్డారు. అసలే అవి ఏపీ రాజకీయాలు మరి? అందులోనూ అందరిలోనూ ఈ సలహాదారు చాలా చిన్నవారు. కానీ, పెద్ద పోస్టు పట్టేశారు. దీంతో మిగతావారికి కాస్త కంటగింపుగానే ఉంటుంది.

అంతమంది ప్రజాప్రతినిధులా?

ఆ సలహాదారు ఏర్పాటు చేసిన కార్యక్రమం, సందర్భం ఇక్కడ అనవసరం కానీ, అందుకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేల సంఖ్య చూస్తేనే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. సహజంగా ఏ సీఎం ఇంట్లోనో తప్ప ఈ స్థాయిలో డజను మంది మంత్రులు, 70 మంది ఎమ్మెల్యేలు హాజరుకావడం అరుదు. కానీ, ఓ సీఎం సలహాదారు నిర్వహించిన కార్యక్రమానికే ఇంతమంది ప్రజాప్రతినిధులు వెళ్లడం అంటే.. పరోక్షంగా ఇది తన ‘‘పరిచయ ప్రదర్శన’’లా కనిపించింది. అసలే రాజకీయాలు మంచిగా లేవు. అందులోనూ ప్రాంతీయ పార్టీలు వచ్చాక ఎప్పుడే కుట్ర జరుగుతుందో చెప్పలేం? నలుగురు ప్రజాప్రతినిధులు ఒక్కచోట పోగైతేనే చెవులు కొరుక్కునే కాలం. అలాంటిది ఏకంగా ఇంతమంది హాజరవడం, అందులోనూ నిఘా కళ్లు నిత్యం వెంటాడే వైసీపీ సర్కారు పాలనలో హాజరవడం మిగతావారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది.

‘‘రాజకీయ’’ ఆశలతోనేనా?

ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఓ సలహాదారు ఎత్తుగడలు వేయడంలో చాలా నేర్పరి. అలానే ఆయన ఇక్కడ వరకు వచ్చారు. సాధారణ స్థాయి నుంచి ప్రయాణం మొదలుపెట్టి, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని వీడి.. అందివచ్చిన ప్రయివేటు ఉద్యోగ అవకాశాన్ని వినియోగించుకుని వైసీపీ ప్రస్తుత పెద్దలకు దగ్గరయ్యారు. ముందే చెప్పుకున్నట్లు తన ఎత్తుగడలతో ఉద్యోగంలో రాణించారు. అటు ఉద్యోగంలో ఎదుగుతూనే వైసీపీ రాజకీయ నాయకులతోనూ పరిచయాలు పెంచుకున్నారు. తాను ఉన్న పోస్టు కూడా అతడికి బాగా ఉపయోగపడింది. దాని ద్వారా తను కొంత ఆర్థికంగానూ నిలదొక్కుకునే వెసులుబాటు దొరికింది. అయితే, మొదటినుంచి జీవితంలో నిలదొక్కుకోవాలనే ఆశలున్న ఆ సలహాదారు ఉద్యోగంలో స్థిరపడ్డాక.. వైసీపీ ప్రభుత్వం రావడంతో అటువైపు అడుగులు వేశారు. మిగతావారికి భిన్నమైన పోస్టును ప్రభుత్వంలో సంపాదించారు. అధినేతకు బాగా దగ్గరని చెప్పుకొంటూ వస్తున్నారు.

మరోవైపు ఇటీవలి అతడి ప్రయివేటు కార్యక్రమం కొంత రాజకీయ ఆలోచనలతోనే సాగిందని చెప్పొచ్చు. దానికితోడు ఏపీలో నెల కిందట ఓ యువ ప్రజాప్రతినిధి హఠాన్మరణంతో ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ ఖాళీని భర్తీ చేసే దిశగా సలహాదారు ముందస్తు ప్రణాళిక వేశాడా? అన్న అనుమానం వస్తోంది. అదీ కాకుండా త్వరలో పూరించాల్సిన చట్ట సభ పోస్టును కైవసం చేసుకునేందుకు వ్యూహాలు వేస్తున్నాడా? అని ప్రయివేటుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

సలహాలే వినని సారుకు.. లెక్కలేనంతమంది సలహాదారులు

అసలు ఏపీ సర్కారులో సలహాదారులెందరు? అంటే పదో పరకో కాదు ఓ 50 మంది ఉంటారని చెబుతారు. వీరందరికీ నెలకు కనీసం రూ.3 లక్షల పైనే జీతభత్యాలు. ఇదంతా ప్రజాధనమేనని .. వారికి అప్పనంగా కట్టబెడుతున్నారంటూ అక్కడి ప్రజలు ముఖ్యంగా యువత వాపోతుంటారు. చిత్రమేమంటే.. అసలు వేరొకరి సలహాలే వినని సారుకు ఇంతమంది సలహాదారులు ఉండడం విచిత్రమని చెవులు కొరుక్కుంటుంటారు.