Begin typing your search above and press return to search.

పేకాట గుట్టులో ఏపీ, తెలంగాణ మంత్రులు!

By:  Tupaki Desk   |   2 Nov 2021 7:30 AM GMT
పేకాట గుట్టులో ఏపీ, తెలంగాణ మంత్రులు!
X
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశంలోనూ ఎక్క‌డైనా ఏదైనా అక్ర‌మం జ‌రిగితే.. చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు జ‌రిగితే.. అందులో రాజ‌కీయ నాయ‌కుల పాత్ర కూడా వెలుగులోకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నాయ‌కుల అండ‌తో అక్ర‌మార్కులు చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నారు. ఇప్పుడు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన పేకాట వ్య‌వ‌హారంలోనూ రాజ‌కీయ నాయ‌కులు పెద్ద సంఖ్య‌లోనే ఉన్నార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ హీరో నాగశౌర్య తండ్రి లీజుకు తీసుకున్న హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర శివారులోని మంచిరేవుల ఫాంహౌస్‌లో ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్న 30 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు అరెస్ట‌యిన పేకాట రాయుళ్ల వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో మ‌ణికొండ‌కు చెందిన గుత్తా సుమ‌న్ కుమార్ ప్ర‌ధాన సూత్ర‌ధారి అని పోలీసులు తేల్చారు. అత‌ను న‌గ‌రంలోకి కొన్న చోట్ల ఇలాగే పేకాట శిబిరాలను ఓ క్యాసినో రేంజ్‌లో నిర్వ‌హిస్తున్నార‌ని.. డ‌బ్బులు తీసుకుని అందుకు స‌మాన విలువైన రంగురంగుల కాయిన్లు ఇచ్చి భారీస్థాయిలోనే ఈ వ్య‌వ‌హారాన్ని న‌డిపిస్తున్నార‌ని తేలింది. అత‌నికి ఇంత భారీ నెట్‌వ‌ర్క్ ఎలా సాధ్య‌మైంద‌ని కూపీ లాగేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. మామిడి తోట‌ల్లో పేకాట క్యాంపులు నిర్వ‌హించే స్థాయి నుంచి ఇలా ఫాంహౌజ్‌ల్లో స్టార్ హోట‌ల్ గ‌దుల్లో ఈ మాయ‌దారి ఆట‌ను నిర్వ‌హించే స్థాయికి ఎలా ఎదిగాడ‌ని పోలీసులు ఆరా తీస్తున్నారు.

గుత్తా సుమ‌న్ కుమార్‌కు చెందిన ఫోన్ల‌ను వాట్సాప్ సంభాష‌ణ‌ల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. అయితే ఇప్పుడొక వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫాంహౌజ్ శిబిరంపై పోలీసులు మ‌రో గంట ఆల‌స్యంగా దాడి చేసి ఉంటే పెద్ద సంఖ్య‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కులు ప‌ట్టుబ‌డేవాళ్ల‌నే టాక్ వినిపిస్తోంది. సుమ‌న్ కుమార్‌కు చెందిన ఫోన్లోని వాట్సాప్ సంభాష‌ణ‌లు గ‌మ‌నించిన పోలీసులు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ముఖులు రాజ‌కీయ నాయ‌కుల‌తో క‌లిపి సుమ‌న్‌ వేర్వేరుగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసిన‌ట్లు చెబుతున్నారు. ఆ గ్రూపుల్లో పేకాట నిర్వ‌హించే తేదీలు స‌మ‌యంతో పాటు ప్లేస్‌ను ముందే పోస్ట్ చేస్తున్న‌ట్లు తెలిసింది. ఆ ప్ర‌ముఖ‌ల జాబితాలో ఏపీ నుంచి ఇద్ద‌రు మంత్రులు, తెలంగాణ నుంచి ఇద్ద‌రు మంత్రులు ఉన్నార‌ని అంటున్నారు. ఇక రెండు రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలైతే దాదాపు 50 మంది వ‌ర‌కూ ఉన్నార‌ని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆ మంత్రులు పేర్లు బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ని స‌మాచారం. మ‌రోవైపు ఎమ్మెల్యేల పేర్ల‌ను కూడా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలిసింది. వీళ్లంద‌రూ సుమ‌న్‌తో ట‌చ్‌లో ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడూ ప్లేస్‌లు మారుస్తూ పేకాట ఆడుతుంటార‌ని ప్ర‌చారం జోరంద‌కుంది. మ‌రి వీళ్ల విష‌యంలో పోలీసులు ఇప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నే విష‌యం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ మంత్రుల‌కు ఎమ్మెల్యేల‌కు డిపార్ట్‌మెంట్ నోటీసులు జారీచేస్తుందో? లేదో? చూడాల‌ని అంటున్నారు. ఈ నాయ‌కుల పేర్ల‌ను బ‌య‌ట‌కు ప్ర‌క‌టిస్తేనే ఈ విష‌యంపై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది. మ‌రి పోలీస్ వాళ్లు ఏం చేస్తారో చూడాల‌ని అంద‌రూ అనుకుంటున్నారు. మొత్తానికి ఈ పేకాట వ్య‌వ‌హారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.